ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

అనువాద వ్యాకరణం మనకింకా అలవాటు కావాలి!

ABN, Publish Date - Nov 04 , 2024 | 12:45 AM

తెలుగు సాహిత్యాన్ని ఇంగ్లీషు భాషా మాధ్యమం ద్వారా గ్లోబల్‌ తెర పైకి తెచ్చేందుకు ఇప్పుడిప్పుడే ప్రయత్నాలు ముమ్మరం అవుతున్నాయి. ఆ ప్రయత్నాల్లో ఒకటి అజు పబ్లికేషన్స్‌ – ఛాయా పబ్లికేషన్స్‌ సంస్థలు రెండూ కలిసి ‘TILT’ (తెలుగు ఇన్‌ లిటరరీ ట్రాన్స్‌లేషన్‌) పేరుతో చేపట్టిన ...

తెలుగు సాహిత్యాన్ని ఇంగ్లీషు భాషా మాధ్యమం ద్వారా గ్లోబల్‌ తెర పైకి తెచ్చేందుకు ఇప్పుడిప్పుడే ప్రయత్నాలు ముమ్మరం అవుతున్నాయి. ఆ ప్రయత్నాల్లో ఒకటి అజు పబ్లికేషన్స్‌ – ఛాయా పబ్లికేషన్స్‌ సంస్థలు రెండూ కలిసి ‘TILT’ (తెలుగు ఇన్‌ లిటరరీ ట్రాన్స్‌లేషన్‌) పేరుతో చేపట్టిన ఆన్‌లైన్‌ ట్రాన్స్‌లేషన్‌ వర్క్‌షాప్‌. తెలుగు నుంచి ఇంగ్లీషుకు అనువదించే సామర్థ్యం గల అనువాదకులు కొందరిని ఎంపిక చేసి, వారికి ఫ్రెంచ్‌ అనువాదకురాలు రాస్‌ ష్వార్జ్‌ మెంటార్‌షిప్‌లో, ఇతర ప్రపంచ స్థాయి అనువాదకుల ఆధ్వర్యంలో అనువాదంలో మెళకువలను బోధిస్తూ, అనుమానాలను నివృత్తి చేయటం ఈ ఆన్‌లైన్‌ వర్క్‌షాప్‌ ముఖ్య ఉద్దేశం. ఈ సందర్భంగా అజు పబ్లికేషన్స్‌ కో ఫౌండర్‌/ డైరెక్టర్‌ శ్వేత యర్రం, ఛాయా పబ్లికేషన్స్‌ రిప్రజెంటెటివ్‌ మైత్రిలతో ‘వివిధ’ జరిపిన సంభాషణ ఇది.

ఈ ఆన్‌లైన్‌ ట్రాన్స్‌లేషన్‌ వర్క్‌షాప్‌ గురించి చెప్పండి. ఈ ఆలోచన ఎలా కలిగింది?

రెండు ప్రచురణ సంస్థలు ఒక వేదిక మీదకి రావడం కావొచ్చు, ఖర్చుతో కూడుకున్న వ్యవహారమైనా వ్యయ ప్రయాసలకు వెనుకాడకుండా ముందడుగు వేయడం కావొచ్చూ... ఇలాంటి వర్క్‌షాప్‌ ప్రయత్నం మాకు తెలిసి బహుశా భారతీయ భాషల్లో మొదటిసారిగా జరుగుతున్నది.


తెలుగు భాషా సాహిత్యాన్ని ఇక్కడి స్థానిక రచనలతో పాటూ అనువాదాలూ సుసంపన్నం చేశాయి. రష్యన్ సాహిత్యం, శరత్ నవలలు, ఇంకా ప్రేమ్ చంద్, కిషన్ చంద్, తగళి శివశంకర పిళ్ళై, మహాశ్వేతా దేవీ, భిభూతి భూషణ్‌ల రచనలు... ఇలా చెప్పుకుంటే పొతే బోలెడంత మంది ఇతర భాషల రచయితలు తెలుగులో పరిచయమయ్యారు. అలానే, పక్క రాష్ట్రాల సాహిత్యం నుంచి ఇంగ్లీష్‌లోకి అనేక రచనలు వెళ్ళాయి. అక్కడి పాత తరమే కాదు, కొత్త తరం రచయితల రచనలు కూడా ఇంగ్లీష్‌ లోకి అనువాదం అవుతున్నాయి. అలా చూసుకున్నప్పుడు, తెలుగు భాషా, తెలుగు సాహిత్యమూ ఎక్కడ ఉన్నాయీ అన్న ప్రశ్నే ఈ వర్క్‌షాప్‌కి బీజం వేసింది. తెలుగు నుంచి ఇంగ్లీష్ అనువాదం మన దగ్గర చాలా తక్కువగా జరుగుతున్నది. అందువల్ల ఆ స్కిల్ సెట్ ఎక్కువగా పరిణతి చెందలేదు. అనువాదం అంటే కేవలం పదాల అనువాదం కాదు. ఆ రచన, రచయిత ఆత్మను పట్టుకోవడం. టార్గెట్ రీడర్స్ ఎవరని తెలుసుకొని అందుకు తగ్గట్లుగా అనువదించడం. అందుకు కసరత్తు అవసరం. అనువాదం ఇండియన్ ఇంగ్లీష్‌ లోకి వెళ్ళడం ఒక ఎత్తయితే, దాన్ని ఇంటర్నేషనల్ ఇంగష్‌లోకి తీసుకువెళ్ళడం మరొక ఎత్తు. మేం ఎంచుకున్న అనువాదకులందరూ తెలుగు – ఇంగ్లీష్ భాషలపై పట్టు ఉన్నవారే, అంతర్జాతీయ సమకాలీన సాహిత్యం చదువుతున్నవారే. వారికి కాస్త శిక్షణ ఇస్తే అద్భుతాలు చేయవచ్చు అనిపించింది. పైగా ఎక్కువ శాతం పార్టిసిపెంట్స్ 35 ఏళ్ల లోపు వాళ్ళు కనుక స్కోప్ ఫర్ ఫ్యూచర్ డెవలప్మెంట్ ఎక్కువ.


ఈ ఆలోచన ఆచరణ దాకా రావటానికి జరిగిన ప్రయత్నం ఏమిటి? వర్క్‌షాప్‌ నిర్వహణకు ఫ్రెంచ్‌ అనువాదకురాలు రాస్‌ ష్వార్జ్‌నే ఎందుకు ఎంపిక చేశారు?

మాటల మధ్యన వచ్చిన విషయాన్నీ ఇక్కడి దాకా తెచ్చింది మిత్రుడు అనిల్. ఆయన హర్షణీయం అనే పోడ్కాస్ట్ నడుపుతున్నాడు. అంతర్జాతీయ రచయితలూ, అనువాదకులతో అనేక ఇంటర్వ్యూలు చేశాడు. రాస్ ష్వార్జ్‌ ఈ ఆలోచనకి తగిన వ్యక్తి అని సలహా ఇచ్చింది తనే. ఐతే, రాస్ ఫ్రెంచ్ – ఇంగ్లీష్ అనువాదకురాలు కాబట్టి, తెలుగు తెలిసిన లోకల్ చెక్ పాయింట్స్ కూడా వర్క్‌ షాప్‌కి కావాలి అనుకున్నప్పుడు మాకు తట్టింది– రచయిత ఉణుదుర్తి సుధాకర్, అనువాదకుడు అవినేని భాస్కర్‌లు. అడగ్గానే వాళ్ళు కూడా ఒప్పుకొని మాకు భారం తగ్గించారు. రాస్ విషయానికి వస్తే ఆమె నాలుగు దశాబ్దాలుగా వంద పుస్తకాలను అనువాదం చేశారు. ఎన్నో ప్రసిద్ధ అంతర్జాతీయ బహుమతులూ అందుకున్నారు. ఆమె ఆధ్వర్యంలో మా పార్టిసిపెంట్స్ వివిధ పార్శ్వాలతో కలిసిన అనువాద వ్యాకరణం నేర్చుకుంటారని మా నమ్మకం.


వర్క్‌షాప్‌లు జరిగే తీరు ఎలా ఉంటుంది?

ఇది ఆరు నెలల వరకు, నెలకి మూడు గంటల పాటు జరిగే ఆన్‌లైన్‌ వర్క్‌షాప్‌. ఈ ఆరు నెలల్లో మా ఆరుగురు అనువాదకులు ఒక్కొక్కరూ సెషన్‌కు రెండేసి కథల చొప్పున అనువదిస్తారు. ప్రతి వర్క్‌షాప్‌ లోనూ ఆ అనువాదాల గురించి లోతుగా రాస్‌తో చర్చిస్తారు. రాసినదాన్ని మెరుగుపరిచే పద్ధతులను నేర్చుకుంటారు. ఇవన్నీ తరువాతి సెషన్‌కి వారు చేసే అనువాదాల్లో ఇంప్లిమెంట్ చేసుకుంటూ, కొత్త సమస్యలు ఎదురైతే వాటిని చర్చకు తీసుకొస్తారు. ప్రాంతీయత, రెండు భాషల మధ్య పొసగని తత్వం, ఆలోచనా విధానాల్లో వైరుధ్యం, డయాస్పోరా ఆఫ్ టార్గెట్ రీడర్స్, ఇడియమాటిక్ ఎక్స్‌ప్రెషన్స్ (నుడికారం), పఠనీయత లాంటి అన్ని అంశాలనూ కూలంకషంగా చర్చిస్తారు, నేర్చుకుంటారు. ఇందుకు రాస్ ష్వార్జ్‌తో పాటు గెస్ట్ స్పీకర్స్ కూడా సహకరిస్తారు. తమ రచనల్ని చర్చిస్తూ, మెంటార్ల సలహాలు పరిగణిస్తూ సమన్వయంతో సాగే ఒక పూర్తి ఇంటరాక్టివ్ వర్క్‌షాప్‌ ఇది.


తెలుగు నుంచి ఇంగ్లీష్‌కు అనువదించే క్రమంలో ఎదురయ్యే ఏ అంశాలపై, సమస్యలపై ఫోకస్‌ పెడుతున్నారు?

అనువాదం అంటే కేవలం వేర్బాటిమ్ (ప్రతి పదం యథాతథంగా చేయటం) మాత్రమే కాదని చదువర్లుగా మేం నమ్ముతున్నాం. ఎంత కాదనుకున్నా అనువాదంలో కొంత నష్టం జరుగుతుందని మనం ఒప్పుకోవాలి. అలాగని పూర్తిగా భావమే విడిచిపెట్టి సొగసుగా నాలుగు మంచి పదాలు పొదిగి ఇచ్చేసి అనువాదం అంటే పెద్ద మోసమే కదా! పైన చెప్పినట్లుగా– అనువాదాల్లో సమస్యలు– ముఖ్యంగా ప్రాంతీయత, రెండు భాషల మధ్య పొసగని తత్వం, ఆలోచనా విధానాల్లో వైరుధ్యం, డయాస్పోరా ఆఫ్ టార్గెట్ రీడర్స్, రాస్ అన్నట్లు ‘మ్యూజిక్ ఆఫ్ ది టెక్స్‌ట్‌’, ఇవన్నీ చూసుకోవాల్సిన అంశాలు. దీనినే అనువాద వ్యాకరణం అని చెప్పుకోవచ్చు. దీని పైనే మా వర్క్‌షాప్‌ పూర్తి శ్రద్ధ పెడుతుంది.

వర్క్‌షాప్‌లో భాగంగా పార్టిసిపెంట్స్‌ చేసే అనువాదాలు కేవలం వర్క్‌షాప్ కోసమే గాక Asymptote, Words Without Borders లాంటి అనేక ప్రఖ్యాత అంతర్జాతీయ సాహిత్య జర్నల్స్‌లో ప్రచురితం అయ్యేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేయాలన్నద దానిపై కూడా మెంటార్స్ ఫోకస్ చేస్తున్నారు.


తెలుగులోని ఏ రచనలను ఇంగ్లీషులోకి తీసుకువెళ్ళాలీ అన్న ఎంపిక ఏ ప్రాతిపదిక మీద చేయబోతున్నారు? అనువాదం జరిగాక ఆ పుస్తకాల మార్కెటింగ్‌ స్ట్రాటజీ ఏమిటి?

అనువాదం కేవలం సాహిత్య ప్రక్రియే కాదు, ఒక భాషా సమాజాన్ని మరో భాషా సమాజానికి పరిచయం చేయగలదు కూడా. మేము ఇంగ్లీష్ లోకి అనువాదం చేయించే రచనల్లో సమకాలీనతకి ప్రాధాన్యత ఇస్తున్నాం. లోకల్ ఈజ్ గ్లోబల్ అన్నవిధంగా– ఇక్కడి స్థానికత ఉట్టిపడుతూ, యూనివర్సల్ అప్పీల్ కూడా ఉన్న కథలని ఎంచుతున్నాం. ప్రస్తుతానికి, ఈ వర్క్‌షాప్‌ కోసం మా రెండు పబ్లి షింగ్ హౌసుల నుంచి వచ్చిన రచయితల కథలు మాత్రమే తీసుకున్నాం. ఇవన్నీ ఒక ఇంగ్లీష్ ఆంథాలజీగా తీసుకురావాలనేది మా ఉద్దేశం. ఏవి తీసుకోవాలీ అన్నది పూర్తిగా మా విచక్షణ. ముందుగా కథలను అనువదింపజేసి, వాటిని అంతర్జాతీయ సాహిత్య పత్రికల్లో ప్రచురణార్హం అయ్యేలా చూసి, తద్వారా అంతర్జాతీయ ప్రచురణకర్తలతో మాట్లాడి పుస్తకంగా తేవాలి అనుకుంటున్నాం.

పుస్తకాల మార్కెటింగ్‌ విషయంలో తప్పనిసరిగా ఒక స్ట్రాటజీ ఉండాల్సిందే అని నమ్ముతాం. పబ్లిషర్లుగా మేం ఇప్పుడు తెలుగులో ఇన్ని వేల పుస్తకాలు అమ్మగలుగుతున్నామంటే అదే కారణం. ఈతరం తెలుగు మాట్లాడే వాళ్ళందరూ తెలుగు చదవగలిగే వాళ్లు కాదు. ప్రపంచవ్యాప్తంగా ఉండే ఇంగ్లీష్ భాషా పాఠకులు, మన దేశంలోని ఇంగ్లీష్ పాఠకులు, తెలుగు చదవలేక కేవలం మాట్లాడగలిగేవారు... వీరంతా మా టార్గెట్. వీళ్లదాకా మా అనువాద సాహిత్యం తీసుకువెళ్ళడం కోసం అన్ని టచ్ పాయింట్స్‌నూ మేము దృష్టిలో ఉంచుకుంటాం. సోషల్ మీడియాలో కొత్త పాఠకులని చేరడం కూడా ఇందులో పెద్ద భాగమే. సమకాలీన తెలుగు సాహిత్యాన్ని ఇంగ్లీష్ పాఠకులకి అందించడం మా అనువాద లక్ష్యాల్లో ముఖ్యమైనది.


వర్క్‌షాప్‌ తొలి సెషన్లు ఎలా జరిగాయి?

వచ్చిన అప్లికేషన్స్‌ని ఫిల్టర్ చేసి ఆరుగురిని ఎంపిక చేశాం. మొదటి సెషన్ సెప్టెంబర్ 12న జరిగింది. పార్టిసిపెంట్స్ అనువాదం మొదలు పెట్టిన కథలని ఒక్కొకటిగా ఎంచి రాస్ ష్వార్జ్‌ వారి తోనే చర్చించారు. రాస్ ఇచ్చిన సూచనలు, సలహాలు, రేకెత్తించిన ప్రశ్నలు అన్నింటికీ పార్టిసిపెంట్స్ నుంచి గొప్ప స్పందన లభించింది. మున్ముందు సెషన్స్ కోసం ఉత్సుకంగా ఎదురుచూస్తున్నాం మేమంతా.

సాహిత్య వేదిక మైత్రి

బొమ్మలు: అక్బర్

Updated Date - Nov 04 , 2024 | 12:45 AM