ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

విమర్శకులకూ ‘గ్లామర్‌’ ఉందని ఋజువు చేశాడు త్రిపురనేని

ABN, Publish Date - Aug 05 , 2024 | 05:41 AM

గత నాలుగేళ్ళుగా స్టాలిన్ పాలనలో సోవియట్ రష్యాలో, తూర్పు ఐరోపా దేశాలలో జరిగిన మారణ హోమాల గురించి చదువుతున్నాను. రష్యా విచ్ఛిన్నం తరువాత 1991, 1992 సంవత్సరాల్లో రష్యన్ ఆర్కైవ్స్‌ పబ్లిక్‌కి అందుబాటులోకి....

చదువు ముచ్చట

ఈమధ్య చదివిన పుస్తకం?

గత నాలుగేళ్ళుగా స్టాలిన్ పాలనలో సోవియట్ రష్యాలో, తూర్పు ఐరోపా దేశాలలో జరిగిన మారణ హోమాల గురించి చదువుతున్నాను. రష్యా విచ్ఛిన్నం తరువాత 1991, 1992 సంవత్సరాల్లో రష్యన్ ఆర్కైవ్స్‌ పబ్లిక్‌కి అందుబాటులోకి రావటంతో ప్రపంచవ్యాప్తంగా వందలాదిమంది పరిశోధకులు వాటిని పరిశీలించి విస్తృతంగా పుస్తకాలు రాశారు. స్టాలిన్ దురాగతాల నన్నింటిని ఆధారాలతో నిరూపించారు. ఈ పుస్తకాలు స్టాలిన్ సోషలిజం పేరుతో కొనసాగించిన హింస గురించి వాస్తవాలు వెల్లడించాయి. వీటి గురించి నేను చదువుతున్న పుస్తకాలలో ఈమధ్యనే Robert Conquest రాసిన ‘The Harvest of Sorrow: Soviet Collectivization and the Terror -Famine’ అనే పుస్తకం చదివాను.

ఈ పుస్తకం స్టాలిన్ నిర్బంధ సంఘటిత వ్యవసాయ విధానాల ఫలితంగా జరిగిన హింస, ఉక్రెయిన్‌లో స్టాలిన్ ప్రభుత్వం కృత్రిమ కరువు సృష్టించి మిలియన్ల కొద్దీ ప్రజల మరణానికి కారణమైన విధానం అన్నిటినీ చాలా లోతుగా వివరిస్తుంది. ఉక్రెయిన్‌ ప్రజలను నరభక్షకుల స్థాయికి దిగజార్చిన కృత్రిమ కరువుతోపాటు, కరువు వెనుక ఉన్న రాజకీయ ఉద్దేశాలను వివరిస్తుంది.


బాల్యంలో మొదటిసారి ఏ పుస్తకాన్ని ఇష్టంగా చదవటం గుర్తుంది?

నాకు గుర్తున్నంతవరకు ‘నీతి చంద్రిక’. అవి చిన్నయ్య సూరి చేసిన అనువాదానికి retold versions అయి ఉంటాయి. ఆ కథలు చాలా ఆకర్షణీయంగా ఉండేవి, ముఖ్యంగా జంతువుల మధ్య సంభాషణాలు. ఇప్పుడు ఆలోచిస్తే అవి కూడా మ్యాజిక్ రియలిస్ట్ కథలు అనిపిస్తాయి.

వ్యక్తిగతంగా ప్రభావితం చేసిన రచయిత?

ఒక్క పేరు మాత్రమే చెప్పాలంటే త్రిపురనేని మధుసూధన రావు. ఆయన ఉపన్యాసాలు, విమర్శ మాతరం మొత్తాన్ని ప్రభావితం చేశాయి. కాల్పనిక సాహిత్యకారులకే కాదు, విమర్శకులకూ ‘గ్లామర్’ ఉందని ఋజువు చేశాడు త్రిపురనేని.

తెలుగులో మీకు నచ్చిన విమర్శ పుస్తకం?

దార్శనికుడు, నవలా రచయిత, కథకుడు, వ్యాసకర్త జి.వి. క్రిష్ణరావు రాసిన ‘కావ్య జగత్తు’. భరతుని నుంచి ప్లేటో, మార్క్స్ దాక కావ్య వస్తురూపాలు ఎలా పరిణామం చెందాయో క్రిష్ణరావు అద్భుతంగా చర్చించాడు. ప్రాచ్య, పాశ్చాత్య సిద్ధాంతాలూ లోతుగా అర్థం చేసుకుని స్వతంత్ర సాహిత్య మూర్తి మత్వాన్ని రూపొందించున్న రచయిత జి.వి. క్రిష్ణరావు.


సాహిత్యంలో మీకు నచ్చిన కల్పితపాత్ర?

బుచ్చిబాబు ‘చివరకు మిగిలేది?’ లోని ‘అమృతం’.

ఏ గతకాలం రచయితనైనా కలసి మాట్లాడగలిగితే ఎవరితో ఏం మాట్లాడతారు?

వడ్డెర చండీదాస్‌తో. ఆయన ఉన్నప్పుడు రెండుసార్లు మాట్లాడే ప్రయత్నం నేను, వేగుంట మోహన్ ప్రసాద్ గారు చేశాం. అయితే, ఆయన మాట్లాడ లేదు. మేమే మాట్లాడాము. ఆయన్ని ఆడగాలంటే– తనకీ, ‘అనుక్షణికం’లోని శ్రీపతికి పాత్రకు ఉన్న సంబంధం ఏమిటి? అని అడుగుతాను. అలాగే– జీవితమిచ్చే అన్ని ఆనందాలను పూర్తిగా అనుభవంలోకి తెచ్చుకోవాలని సంఘర్షించిన అన్నా కెరినాని, మేడమ్‌ బోవరీని టాల్‌స్టాయ్, ప్లాబర్ట్‌లు ఆ పాత్రలు తమ ఘర్షణ ఫలితాలను పొందకుండానే ముగించినట్టు, తాను కూడా స్వప్న రాగలీన పాత్రను ముగించాడా? అనీ అడగవచ్చు. అయితే, తన రచనల మీద ఎప్పుడూ మాట్లాడాని చండీదాస్‌, Beckett లాగా, ‘‘The words are all we have’’ అని అంటాడేమో!


మీ పఠనాభిరుచి కాలంతోపాటు ఎలా మారింది?

నా తరంలో చాలమంది లాగానే నేను చలం, రంగనాయకమ్మ నవలలు కథలు చదువుతూ సాహిత్య అభిరుచి పెంచుకున్నాను. ఇంటర్మీడియట్‌లో మాకు ఇంగ్లిష్ లెక్చరర్‌గా ఉన్న వర్ధనరావు గారు నన్ను మార్క్సిస్ట్ పుస్తకాల వైపు తిప్పారు. ఆ తరువాత త్రిపురనేని మధుసూధన రావు గారి ప్రేరణతో ప్రాథమిక మార్క్సిస్ట్ పుస్తకాలు చదవటం మొదలైంది. క్రమంగా యూరోపియన్ మార్క్సిస్టులకు, రష్యన్ మార్క్సిస్టులకు మధ్య మౌలిక వ్యత్యాసం ఉందని తెలిసి ఫ్రాంక్ఫర్ట్ స్కూల్‌కి చెందిన మార్క్సిస్టుల పుస్తకాలు చదివాను. అది క్లాసికల్ మార్క్సిస్టు సిద్ధాంత పరిమితులను తెలుసుకోవటానికి ఆస్కారం కలిగించింది. సిద్ధాంత గ్రంథాలతోపాటు చదువుతూ వచ్చిన యూరోపియన్ సాహిత్యం ఆధునికానంతర వాదాన్ని పరిచయం చేసింది. ఆధునికాంతరవాద చర్చలలో కీలకపాత్ర పోషించిన ప్రముఖ పోలిష్ తాత్వికుడు, సామాజిక శాస్త్రవేత్త జిగ్మట్ బౌమన్ రచనలను క్రమంగా చదువుతూ రావటంవల్ల ఆయన ఆలోచనలు ఆమోదయోగ్యంగా కనిపించాయి.

సంప్రదాయ మార్క్సిస్టులు విస్మరించిన, విశ్లేషించలేని అనేక అంశాలను ఆయన అద్భుతంగా విశ్లేషించాడు. సోషలిజం ఒక ఆదర్శమే తప్ప, ప్రాజెక్టు కాదు, దానిని ఒక ప్రాజెక్ట్‌గా భావించి ఆచరణకు దిగటం వల్ల మానవ చరిత్రలో కనీవినీ ఎరుగని దారుణాలు జరిగాయనే ఆయన నిర్ధారణ నాకు చాలా కన్విన్సింగ్‌గా అనిపించింది. ఆయన ప్రేరణతోనే సోవియట్ రష్యాలో, తూర్పు ఐరోపాలో సోషలిస్టు వ్యవస్థలు కొనసాగించిన మారణహోమాలను గురించి రాసే పనిలో ఉన్నాను. ఇది ఒక కనీసం వెయ్యి పేజిల పుస్తకం కావచ్చు.

బి. తిరుపతిరావు

Updated Date - Aug 05 , 2024 | 05:41 AM

Advertising
Advertising
<