ట్రంప్ గెలుపు డెమొక్రాటిక్ పార్టీ పుణ్యమే !
ABN, Publish Date - Nov 14 , 2024 | 12:43 AM
అమెరికా ఎన్నికల ఫలితాలు వెలువడిన తరవాత వెర్మోంట్ రాష్ట్రానికి చెందిన ఇండిపెండెంట్ సెనెటర్ బెర్నీ సాండర్స్ ఒక బహిరంగ లేఖ విడుదల చేశాడు. ఆ లేఖలో మొదటి వాక్యం ఇది...
అమెరికా ఎన్నికల ఫలితాలు వెలువడిన తరవాత వెర్మోంట్ రాష్ట్రానికి చెందిన ఇండిపెండెంట్ సెనెటర్ బెర్నీ సాండర్స్ ఒక బహిరంగ లేఖ విడుదల చేశాడు. ఆ లేఖలో మొదటి వాక్యం ఇది– - ‘‘శ్రామిక వర్గాన్ని వదిలేసిన డెమొక్రాటిక్ పార్టీని ఇప్పుడు శ్రామిక వర్గం వదిలేయడంలో ఆశ్చర్యమేమీ లేదు’’. అమెరికా ఎన్నికల ఫలితాలకి ఇంతకంటే క్లుప్తమైన, సంపూర్ణమైన, విశ్లేషణ ఇంకొకటి ఉండదు.
అమెరికాలో గత 50 ఏళ్ళుగా సామాన్య మానవుడి జీవన ప్రమాణాలు పతనం చెందుతూ వస్తున్నాయి. ఆదాయ అసమానత పెరిగిపోతూ వస్తోంది. 1950లలో ఒక ఫ్యాక్టరీ కార్మికుడి జీతంతో ఇద్దరు పిల్లలున్న ఒక కుటుంబం మధ్యతరగతి జీవనం గడపగలిగేది. కానీ క్రమంగా మాన్యుఫాక్చరింగ్ ఉద్యోగాలన్నీ అమెరికా కంటే చవక జీవన ప్రమాణాలున్న దేశాలకి తరలిపోయాయి. దాని వల్ల వచ్చిన లాభాలు మాత్రం కొద్దిమంది ధనవంతుల జేబుల్లోకి జేరిపోయాయి. ఇప్పుడు అరవై శాతం మంది అమెరికన్లు ఒక్క నెల జీతం రాకపోయినా రోడ్డున పడే పరిస్థితి వచ్చింది.
2008లో ఒబామా ‘మార్పు తెస్తా’ననే వాగ్దానంతో ఎన్నికలలో నిలబడ్డాడు. మార్పు కోసం జనం ఓటు వేశారు. రిపబ్లికన్ పార్టీ బలంగా ఉన్న ఇండియానా, ఉత్తర కరోలినా వంటి రాష్ట్రాలను కూడా ఒబామా గెలుచుకున్నాడు. కానీ గెలిచిన తరవాత ఆ మార్పు వాగ్దానాన్ని వదిలేశాడు. ఆర్థిక అసమానతలకూ, కార్పొరేట్ల ధనదాహానికీ, రాజకీయాల్లో డబ్బు పాత్రకీ వ్యతిరేకంగా, 2011లో దేశవ్యాప్తంగా లక్షలమంది పాల్గొన్న ‘ఆక్యుపై వాల్‌స్ట్రీట్’ నిరసనలని అతి క్రూరంగా అణచివేశారు. దివాళా తీసిన పెద్ద పెద్ద కార్పొరేషన్లకి బిలియన్ల డాలర్ల ప్రజాధనాన్ని ఇచ్చి ఆదుకుంది డెమొక్రాటిక్ పార్టీ ప్రభుత్వం. ప్రజాధనాన్ని తీసుకున్న కంపెనీలు కోలుకున్న తరవాత షేర్ మార్కెట్లో లాభ పడ్డాయే గాని, సామాన్య జనానికి గానీ, అప్పులు చేసి మరీ పెద్ద పెద్ద కంపెనీలను ఆదుకున్న ప్రభుత్వానికి గానీ ఏమీ మేలు చేకూరలేదు. ఆర్థిక లోటు మాత్రం పెరిగిపోతూ వచ్చింది. వీటన్నిటి వల్లా అప్పటిదాకా దన్నుగా ఉండిన శ్రామిక జనాలు డెమొక్రాటిక్ పార్టీకి క్రమంగా దూరమవుతూ వచ్చారు.
2016 ఎన్నికలలో ఇండిపెండెంట్ సెనెటర్ బెర్నీ సాండర్స్ డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థిత్వానికి బరిలో నిలబడ్డాడు. అమెరికాలో అసలు ఎన్నికలకి ముందు ప్రైమరీ ఎన్నికలని జరుగుతాయి. ఆ ప్రైమరీలలో ప్రతీ పార్టీ, రాబోయే అధ్యక్ష ఎన్నికల్లో నిలబడడానికి, తన అభ్యర్థిని ఎన్నుకుంటుంది. 2016 ప్రైమరీలలో బెర్నీ సాండర్స్ ఆర్థిక అసమానతలనీ, కార్పొరేట్ అవినీతినీ, ఫార్మా, ఇన్సూరెన్సు కంపెనీల లాభాపేక్షనీ వ్యతిరేకిస్తూ, ప్రభుత్వం సామాన్య ప్రజల కోసం పనిచేయాలనే నినాదంతో నిలబడ్డాడు. డెమొక్రాటిక్ పార్టీతో విసిగిపోయి, ఎన్నికలకే దూరమైపోయిన సామాన్య జనం లక్షలాదిగా బెర్నీని సమర్థించారు. ముఖ్యంగా యువత బెర్నీని ఆదరించింది. బెర్నీ ర్యాలీలు జనంతో కిటకిటలాడగా, అదే పార్టీలోని బెర్నీ ప్రత్యర్థి హిల్లరీ ర్యాలీలు వెలవెలబోయాయి. మీడియా బెర్నీని వెలివేసినా, ప్రైమరీలలో కొత్త ఓటర్లు ఓటు వేయడానికి డెమొక్రాటిక్ పార్టీ నాయకత్వం అవాంతరాలు సృష్టించినా, కార్పొరేట్ కంపెనీలు మిలియన్ల డాలర్లు హిల్లరీ ప్రచారానికి గుమ్మరించినా, కేవలం సామాన్య జనం ఇచ్చిన 10–-20 డాలర్ల విరాళాలతో ప్రచారం చేసిన బెర్నీ 23 రాష్ట్రాలు గెలుచుకున్నాడు. దేశ వ్యాప్తంగా 43 శాతం ఓట్లు సాధించాడు. కానీ, పార్టీ అభ్యర్థిగా నామినేషన్ గెలుచుకున్న హిల్లరీ, బెర్నీ ద్వారా డెమొక్రాటిక్ పార్టీకి వచ్చిన మద్దతుని తన వేపు తిప్పుకోవడానికి ఎటువంటి ప్రయత్నమూ చేయలేదు. అంతేకాక ‘‘గంటకి జీతం కనీసం పదిహేను డాలర్లు ఇవ్వాలి’’ అనే డిమాండునీ; అందరికీ ఆరోగ్య సేవలు అందుబాటులో ఉండాలనే డిమాండునీ అవహేళన చేసింది. మొత్తం మీద మళ్ళీ శ్రామిక జనాల్ని నిస్పృహలోకి నెట్టివేసి, ట్రంప్ బూచిని చూపి ‘‘నాకు తప్ప ఇంకెవరికి ఓటేస్తారు మీరు’’ అన్న నిర్లక్ష్యంతో గెలిచిపోతాననుకుంది హిల్లరీ. కానీ శ్రామిక జనాన్ని దూరం చేసుకున్న కారణంగా ట్రంప్ చేతిలో ఓడిపోయింది.
2020లో మళ్ళీ చరిత్ర పునరావృతమైంది. బెర్నీ మళ్ళీ నిలబడ్డాడు. ఈసారి బెర్నీ పేరూ, బెర్నీ శ్రామిక జన పక్షపాతమూ, జనానికి తెలిసి ఉండడం చేత రాష్ట్రం తరవాత రాష్ట్రం బెర్నీ గెలవడం మొదలుపెట్టాడు. దాంతో దడ పట్టుకున్న పార్టీ నాయకత్వం బైడెన్ తప్ప మిగతా అభ్యర్థుల్ని అందరినీ బరిలో నుంచి తొలగించి, ఒబామాకి నల్ల జాతీయులలో ఉన్న పలుకుబడిని ఉపయోగించి నల్ల జాతీయులు ఎక్కువగా ఉన్న దక్షిణ కరోలినా రాష్ట్రం బైడెన్ గెలుచుకొనేలా చేసి, బెర్నీ ఉప్పెనకి అడ్డుకట్ట వేశారు. బైడెన్ నామినేషన్ గెలిచేలా చేశారు. కానీ ఇన్ని నమ్మకద్రోహాల వల్ల శ్రామిక జనాలని శాశ్వతంగా దూరం చేసుకుంది డెమొక్రాటిక్ పార్టీ! కానీ ట్రంప్ దుష్పరిపాలనతో కూడా జనం విసిగిపోయి ఉండడం చేత చావు తప్పి కన్ను లొట్టబోయినట్టు, బొటాబొటీగా కేవలం 10-–20 వేల ఓట్ల తేడాలతో 4-–5 రాష్ట్రాలు గెలిచి మొత్తానికి అధ్యక్షుడు కావడానికి అవసరమైన ఎలెక్టోరల్ ఓట్లను బైడెన్ సంపాదించుకున్నాడు.
కానీ శ్రామిక జనాల పరిస్థితి ఏమీ మెరుగుపడలేదు. కోవిడ్ వ్యాధి వ్యాప్తి తగ్గాక ఆర్థిక వ్యవస్థ కొంత కోలుకున్నప్పటికీ, నిరుద్యోగం అదుపులో ఉన్నప్పటికీ, ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిపోయింది. సామాన్య జనాల జీతాలు అంతగా పెరగక, ఎన్నో ఇక్కట్లు పడవలసి వచ్చింది. 2024లో డెమొక్రాటిక్ పార్టీ, ప్రైమరీని పేరుకి మాత్రమే నిర్వహించింది. ఎటువంటి డిబేట్లూ లేకుండా బైడెన్‌ని అభ్యర్థిగా ఎన్నుకుంది. ప్రైమరీ దశలో డిబేట్లు నిర్వహించి ఉంటే బైడెన్ మానసిక క్షీణత అప్పుడే బయటపడి ఉండేది. కొత్త అభిప్రాయాలతో జనానికి ఒక ఆశ కలిగించే అభ్యర్థి ఎవరైనా గెలిచి ఉండేవారు. ఆఖరికి ట్రంప్‌తో జూలైలో జరిగిన డిబేట్‌లో బైడెన్ మానసిక క్షీణత బయటపడింది. అప్పటికయినా ‘ప్రజాస్వామికంగా’ ఓపెన్ కన్వెన్షన్ నిర్వహిస్తే జనాన్ని ఉత్తేజపరచగలిగే అభ్యర్థిని ఎన్నుకుని ఉండొచ్చు. దానికి విరుద్ధంగా ప్రజల ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా నాలుగేళ్ల పాటు ఉపాధ్యక్షురాలిగా ఉండి కూడా ఎటువంటి ప్రజాదరణా లేని, తనకంటూ ఒక గుర్తింపునీ తెచ్చుకోలేని కమలా హారిస్‌ని అభ్యర్థిగా నియమించారు. అప్పటికైనా కమల కొత్త వాగ్దానాలతో ముందుకి వచ్చి ఉండవచ్చు. సామాన్య జనం ఎదుర్కొంటున్న సమస్యల్ని ఎలా పరిష్కరించగలనో అన్నది వివరించి ఉండవచ్చు. కమల అవేవీ చేయకుండా కేవలం ట్రంప్ అవినీతి మీదా ట్రంప్ నేర చరిత్ర మీదా మాత్రమే దృష్టి సారించింది. ‘‘ట్రంప్ చెడ్డవాడు కాబట్టి నాకు ఓటు వేయండి’’ అన్న ఏకైక నినాదంతో గెలవాలని ప్రయత్నించింది. అసలు సామాన్య జనం సమస్యల్లో ఉన్నారనే మాటే ఎత్తకుండా ప్రచారం జరిపింది. ‘‘అంతా బాగానే ఉంది, నిరుద్యోగం అదుపులో ఉంది, స్టాక్ మార్కెట్లు పైపైకి వెళుతున్నాయి’’ –-అన్న ధనికవర్గ అవగాహనతో ప్రచారం జరిపింది. ఒక ఇంటర్వ్యూలో ‘‘బైడెన్ కంటే మీ ప్రభుత్వం ఎలా తేడాగా ఉంటుంది?’’ అన్న ప్రశ్నకి ‘‘ఏమీ తేడాగా ఉండదు’’ అని సమాధానం ఇచ్చింది.
ట్రంప్ దీన్ని తనకి అనుకూలంగా మార్చుకోవడంలో సఫలమయ్యాడు. ప్రజల కష్టాలన్నిటికీ, ధరలు పెరగడానికీ, జీతాలు పెరగకపోవడానికీ అక్రమ వలసదారులే కారణమనే భ్రమ కలిపించాడు. తనను గెలిపిస్తే 2 కోట్ల అక్రమ వలసదారుల్ని తిరిగి పంపించేస్తాననీ, దాని వల్ల ధరలూ నేరాలూ తగ్గిపోతాయనీ జనాల్ని భ్రమింపజేశాడు. చైనా దిగుమతుల మీద 60శాతం పన్ను విధిస్తాననీ, దాని ద్వారా ఇతర దేశాలకి తరలిపోయిన ఉద్యోగాలు వెనక్కి రప్పిస్తానని వాగ్దానాలు చేశాడు. గత 30 ఏళ్లుగా తమకు వెన్నుపోటు పొడిచిన డెమొక్రాటిక్ పార్టీతో విసిగిపోయిన జనంలో కొంత మంది ట్రంప్ మాయ మాటలకి బుట్టలో పడ్డారు. నిజానికి ట్రంప్ వాగ్దానాలు పొంతన లేనివి. దిగుమతి పన్నులు, ధరల్ని పెంచుతాయి గానీ, తగ్గించవు. అక్రమ వలస దారుల్ని బహిష్కరిస్తే అమెరికాలో వ్యవసాయం కుప్పకూలుతుంది. ధరలు ఇంకా పెరుగుతాయి.
డెమొక్రాటిక్ పార్టీ ఇప్పటికైనా సామాన్య జనానికి సహాయపడే ఎజెండాని చేపట్టకపోతే అమెరికా ఫాసిజం ఊబిలో ఇంకా లోతుగా కూరుకుపోతుంది. భారతదేశంలో గత పదేళ్లలో మత అసహనం ఎలా పెరిగిపోయిందో అలా అమెరికాలో శ్వేత జాత్యాహంకారం ఇంకా పెరిగిపోతుంది. ట్రంప్‌కి ఎలాగూ ప్రజల సమస్యల్ని తీర్చగలిగే ఆసక్తి గానీ, శక్తిగానీ లేవు. తన అసమర్థతని కప్పిపుచ్చుకోడానికి ట్రంప్ తన జిగ్రీ దోస్తు మోదీ ఎలా ద్వేష రాజకీయాల్ని పెంచి పోషించాడో అలాగే ద్వేషాన్ని ఎగదోస్తాడు. ఈ భ్రమల్లోనించీ జనం బయటపడడానికి రెండు మూడు దశాబ్దాలు పట్టవచ్చు.
వి.ఎస్. రవి
(శాండియాగో, కాలిఫోర్నియా)
Updated Date - Nov 14 , 2024 | 12:43 AM