ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

రెండో పుస్తకం వచ్చే దాకా ‘తంగెడుపూల గోపి’ అనే పిలిచారు!

ABN, Publish Date - Sep 30 , 2024 | 12:44 AM

నా మొట్టమొదటి కవితా సంపుటి ‘తంగెడుపూలు’ 1976లో వెలువడింది. దానిలో 1967 నుండి 73 వరకు రాసిన 31 కవితలున్నాయి. శీలావీర్రాజు గారు ముఖచిత్రం వేశారు. రామ్‌కోటిలో మాక్స్‌ముల్లర్‌ భవన్‌ పక్కన ఆయన ఇల్లు వెతుక్కుంటూ...

నా మొదటి పుస్తకం

ఎన్‌. గోపి : 93910 28496

నా మొట్టమొదటి కవితా సంపుటి ‘తంగెడుపూలు’ 1976లో వెలువడింది. దానిలో 1967 నుండి 73 వరకు రాసిన 31 కవితలున్నాయి. శీలావీర్రాజు గారు ముఖచిత్రం వేశారు. రామ్‌కోటిలో మాక్స్‌ముల్లర్‌ భవన్‌ పక్కన ఆయన ఇల్లు వెతుక్కుంటూ వెళ్ళాను. ‘‘తంగెడుపూలు ఎలా వుంటాయో తెలియదే’’ అన్నారు. అప్పుడు ఘట్‌కేసర్‌ దాక బస్సులో వెళ్ళి ఓ తంగెడుకొమ్మను తెంపుకొచ్చి ఆయనకిచ్చాను. చక్కటి బొమ్మ వేశారు. డబ్బులు తీసుకో లేదు. ఆయనే కాచిగూడ లోని మోహన్‌ ప్రాసెస్‌కు తీసికెళ్లి బ్లాక్‌లు చేయించారు. మహానుభావుడు!


కుందుర్తి గారు దానికి ఓ సుదీర్ఘమైన ముందుమాట రాశారు. దానిపేరు ‘ప్రతిధ్వని’. అంటే ఇతని కవిత్వంలో ధ్వని ఉంది అని మెచ్చుకుంటూ ఆ పేరు పెట్టారు. అభ్యుదయ కవిత్వంలో సూర్యవంశపుకవులు, చంద్రవంశపు కవులున్నా రనీ, గోపి చంద్రవంశం కవి అని సూత్రీకరించారు. ఆ పుస్తకాన్ని సినారె కు అంకితమిచ్చాను. ‘‘పల్లవదశలోనే నా లోని కవిత్వాన్ని గుర్తించి నాపై ఆప్యాయతను చిందించే గురువు గారికి చిరుకానుకగా’’ అని అంకితవాక్యాలు రాశాను. ఇక్కడ ఓ మంచి జ్ఞాపకం ఏంటంటే అంకితం ఫోటో కోసం నారాయణగూడలో ఇప్పటి తాజ్‌మహల్‌ హోటల్‌ పక్కన గోవింద్‌ స్టూడియో అని వుండేది, ఇద్దరం బస్సులో వెళ్ళాం, అప్పుడాయనకు కారు వుండేది కాదు. ఫోటో పట్ల ఆయనకున్న శ్రద్ధ నా పైన ప్రేమకు తార్కాణం.

‘తంగెడుపూలు’ ఆవిష్కరణ సభ శ్రీకృష్ణదేవ రాయాంధ్ర భాషానిలయంలో జరిగింది. దేవులపల్లి రామానుజరావు గారి అధ్యక్ష్యతన జరిగిన సభలో శ్రీ కుందుర్తి ఆవిష్కరిం చారు. సభ ఘనంగా పండింది. అంతకు రెండేండ్ల ముందు అరుణతో నా వర్ణాంతర వివాహం ఆ లైబ్రరీ ఆవరణలోనే జరగడం ఒక యాదృచ్ఛిక సంతోషం. ఆ రోజుల్లోనే ‘బయోడేట’ అనే సంచలన కవిత రాశాను.


ఈ పుస్తకం లకిడికాపూల్‌ లోని వరలక్ష్మి ప్రెస్‌లో అచ్చయ్యింది. అది శివారెడ్డి ఇంటిపక్కనే వుండేది. రోజూ వెళ్ళి పడిగాపులు పడేవాణ్ని. పూర్తి కావడానికి ఆరు నెలలు పట్టింది. ఆ రోజుల్లోనే ద్వారకా మిత్రుల సమా వేశాలు అక్కడ ప్రారంభ మౌతు న్నాయి. అప్పుడు పైస లెక్కడివి! ముద్రణ ఖర్చు ఏడు వందల రూపా యలయ్యింది. మిత్రుల ఆర్థిక హస్తాల తోనే అది సాధ్యమైంది. 70 పేజీల పుస్తకానికి 3 రూపాయల ధర నిర్ణయించాను. ఆ రోజుల్లోనే మా అబ్బాయి చైతన్య జన్మించాడు. వాడి పేరనే ‘చైతన్య ప్రచురణలు’ అని నామకరణం చేశాను.

తంగెడుపూలు లోని ‘కత్తికార్చిన కన్నీరు’ అనే కవితకు సృజన పత్రిక నిర్వహించిన కవితల పోటీలో ప్రత్యేక బహుమతిని ప్రకటించారు. దాని ఎడిటర్‌ వరవరరావు ఓ బి.ఏ విద్యార్థిని ఆర్ట్స్‌ కాలేజి మెట్లమీద వెతికిపట్టుకొని ‘సృజన, నవత’ సంచికలు పురస్కారం కింద బహుకరించడం ఓ మధురమైన అనుభూతి.


అలాగే ‘తంగెడుపూలు’ ఆ రోజుల్లో నా సిగ్నేచర్‌ కవిత. ‘‘తంగెడుపూలు అంటే ఒప్పుకోను/ బంగారుపూలు’’ అని కవి సమ్మేళనాల్లో చదవగానే కరతాళ ధ్వనులు మిన్నుముట్టేవి. మరో ఎనిమిదేళ్లకు ‘మైలురాయి’ సంపుటి వచ్చేదాక నన్ను ‘తంగెడుపూల గోపి’ అనే వ్యవహరించేవారు. ఎనిమిదేళ్ళ ఆలస్యం ఎందుకంటే నేనప్పుడు వేమన రిసెర్చ్‌లో పీకల లోతుగా మునిగి వున్నాను కాబట్టి. ఆ తరువాత ‘వేమనగోపి’ అనే వాడుక ఏర్పడింది.

ఆ రోజుల్లోనే ఆంధ్ర మహిళాసభలో దుర్గాబాయి దేశ్‌ముఖ్‌ గారు ‘దేవులపల్లి కృష్ణశాస్త్రి పురస్కారం’ అని స్థాపించారు. తొలి అవార్డు తంగెడుపూలకే లభించడం ఒక మహోద్వేగం. ఇవాళ తంగెడుపూలు ‘తెలంగాణ’కు ఒక ఐడెంటిటీ. 1967 లో అంటే నా 17వ యేట రాసిన ఈ కవిత ఇప్పటికీ ‘వన్నెయుం వాసియున్‌’ చెడకపోవడం ఆనందచందనం.

ఎన్‌. గోపి : 93910 28496

Updated Date - Sep 30 , 2024 | 12:44 AM