ప్రజాపరిపాలన కోసం సంస్కణలు ఏవీ?
ABN, Publish Date - Oct 29 , 2024 | 12:44 AM
ఏదైనా పని కోసం ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లి పనులు కాక, అధికారుల చుట్టూ తిరగలేక బాధితులు పడే వేదన వర్ణనాతీతం. సమయం వెచ్చించి, డబ్బు ఖర్చు పెట్టుకుని, ప్రభుత్వ అధికారుల చుట్టూ తిరిగే ప్రజలకు ఇప్పటికీ సరైన పరిష్కారం...
ఏదైనా పని కోసం ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లి పనులు కాక, అధికారుల చుట్టూ తిరగలేక బాధితులు పడే వేదన వర్ణనాతీతం. సమయం వెచ్చించి, డబ్బు ఖర్చు పెట్టుకుని, ప్రభుత్వ అధికారుల చుట్టూ తిరిగే ప్రజలకు ఇప్పటికీ సరైన పరిష్కారం దొరకలేదు. ఆన్‌లైన్ ద్వారా పరిష్కారం చూపుతామనే హామీ ప్రకటనలకే పరిమితమైంది. పౌరసేవల కోసం ప్రజలకు ఇంకా తిప్పలు తప్పడం లేదు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో నూతన ప్రభుత్వాలు ప్రజలకు మరింత మెరుగైన పరిపాలన, సత్వరం అవినీతి రహితంగా సర్వీసులు అందిస్తామనే ప్రకటనలు చేస్తున్నప్పటికీ ఆశించిన, పరిగణించదగిన మార్పు ఏదీ లేదు. సత్వర పౌరసేవలు అందించేందుకు ఇంతకు ముందు ప్రభుత్వాలు ఆమోదించి అమలు చేయని చట్టాలు ఉన్నాయి. ఆ చట్టాలకు అవసరమైన మార్పులతో ఉత్తమ ప్రమాణాలు అందుకునే విధంగా రూపకల్పన చేయాలి. అన్ని ప్రభుత్వ విభాగాల వ్యవస్థలను పర్యవేక్షించేందుకు సాధారణ పరిపాలన శాఖలో ఒక విభాగాన్ని ఏర్పాటు చేయాలి. పౌర సేవలను నిరంతరం పర్యవేక్షించడం ద్వారా మాత్రమే సత్వర పరిష్కారం సాధ్యమవుతుంది. ప్రజలకు మెరుగైన పరిపాలనా సేవలను అందించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక సంస్కరణలను తీసుకు వచ్చాయి. దీనిలో భాగంగా అనేక రాష్ట్రాలు పౌరసేవా పత్రం (సిటిజన్ చార్టర్)ను అమలు చేశాయి.
యూపీఏ ప్రభుత్వ కాలంలో వీరప్పమొయిలీ నేతృత్వంలోని 2వ జాతీయ పరిపాలన సంస్కరణల కమిషన్ (ఎఆర్‌సి) 2009లో తన నివేదిక సమర్పించింది. దానిలోని కీలకమైన సిఫార్సులను అమలు చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం సూచనలు చేసింది. ఆ నివేదికలో పరిపాలనకు సంబంధించిన కొన్ని ముఖ్యంశాలు– 1. పరిపాలనలో నైతికతను పెంచడానికి జాతీయ నైతిక కమిషన్ ఏర్పాటు చేయడం. 2. పబ్లిక్ సర్వీస్ డెలివరీకి పౌర కేంద్రీకృత విధానాన్ని అమలు చేయడం, పారదర్శకత, జవాబుదారీ తనాన్ని మెరుగుపరచడానికి ఈ గవర్నెన్స్ అమలు చేయడం. 3. పారదర్శకతను పెంపొందించడానికి సమాచార హక్కు చట్టాన్ని మరింత మెరుగుపర్చడం, సమస్త సమాచారాన్ని అందుబాటులో ఉంచటం, అందించటం. 4. సివిల్ సర్వీస్ సంస్కరణలు– పౌర సేవలపై ప్రజల ప్రతిస్పందనను తెలియజేయడానికి, అధికారులను జవాబుదారీ చేయడానికి మరిన్ని సంస్కరణలు చేయడం.
దీనికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం ‘నిర్దేశిత సమయంలో ప్రభుత్వ సేవల పంపిణీ, ప్రజా ఫిర్యాదుల పరిష్కారం’ బిల్లును 2011లో లోక్‌సభలో ప్రవేశపెట్టింది. అయితే అది ఆమోదానికి నోచుకోలేదు. అయినప్పటికీ సదరు బిల్లులోని సూచనలను పరిగణనలోకి తీసుకొని చాలా రాష్ట్ర ప్రభుత్వాలు అనేక సంస్కరణలను ప్రవేశపెట్టాయి. ‘ప్రభుత్వ సర్వీసుల పంపిణీ హామీ, అకౌంటబిలిటీ’ ప్రైవేటు బిల్లును రాజ్యసభ సభ్యులు ఫౌజియా ఖాన్ 2017 డిసెంబర్ 9న రాజ్యసభలో ప్రవేశపెట్టారు. దీనికంటే ముందే 1999లో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ నాయకత్వంలోని ప్రభుత్వం దేశంలో మొదటిసారిగా సిటిజన్ చార్జర్‌ను ప్రవేశపెట్టింది. ఇది పౌరులకు నాణ్యమైన సేవలను అందించడానికి, పాలనలో పారదర్శకత, జవాబుదారీతనాన్ని నిర్ధారించడానికి ఒక మార్గదర్శక ప్రయత్నాన్ని చేసింది. అది మొదలు దేశంలో అనేక రాష్ట్రాలు వీటిని అమలు చేశాయి.
సిటిజన్ చార్టర్, సర్వీసెస్ డెలివరీ గ్యారెంటీ చట్టం... ఈ రెండు ప్రజాసేవలను మెరుగుపరచడానికి ఉద్దేశించిన కార్యక్రమాలే. కానీ వాటి పరిధి, ఉద్దేశంలో విభిన్నంగా ఉంటాయి. సిటిజన్ చార్టర్– నిర్దిష్ట సేవలను అందించటానికి సమయపాలన, జవాబుదారీతనంతో కూడి ప్రభుత్వ ఏజెన్సీ ద్వారా నిబద్ధతతో కూడిన ప్రకటన. కానీ చట్టబద్ధత లేదు. అదే ప్రభుత్వ సేవల గ్యారెంటీ చట్టం ప్రకారం నిర్ణీత గడువులోగా సేవలు అందించడంలో విఫలమైన అధికారులకు జరిమానాలు విధిస్తుంది. సేవలను సకాలంలో అందజేయడం, అధికారులను జవాబుదారీగా ఉంచడంపై దృష్టి సారిస్తుంది. చట్టపరమైన మద్దతు, అమలు విధానాలను కలిగి ఉంటుంది.
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న వ్యక్తికి ఒక నెంబర్ కేటాయిస్తారు. పరిష్కారానికి నిర్ణీత గడువు నిర్ణయిస్తారు. సకాలంలో ఆ సేవలు సంబంధిత అధికారి అందించాలి. ఆలస్యమైతే ఎందుకు ఆలస్యం అవుతుందో ముందుగానే సదరు అధికారి దరఖాస్తుదారునికి రాతపూర్వకంగా తెలియజేయాలి. లేకపోతే దరఖాస్తుదారుడు కాలయాపనకు జరిమానా చెల్లించాలని కోరుతూ అప్పిలేట్ అథారిటీకి అప్పీల్ చేసుకోవచ్చు. ఆలస్యం అయినందుకు సంబంధిత అధికారి దరఖాస్తుదారునికి జరిమానా చెల్లిస్తాడు. తమ పరిధిలో పౌరసేవలు ఎలా అమలు జరుగుతున్నాయో పర్యవేక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు ఒక ప్రత్యేక అథారిటీని నియమిస్తాయి. ఎవరైనా తమ దరఖాస్తులు సకాలంలో పరిష్కారం కాలేదని ఈ అథారిటీకి అప్పీలు చేస్తే, అది వాటిని పరిశీలించి అందుకు కారణాలను విశ్లేషిస్తుంది. సహేతుకమైన కారణం లేకుండా దరఖాస్తులను పెండింగులో పెట్టినట్లు రుజువైతే సంబంధిత అధికారికి, సిబ్బందికి అపరాధ రుసుం విధిస్తారు.
ప్రభుత్వ కార్యాలయంలో నిర్ణీత పని నిమిత్తం దరఖాస్తు చేసుకునేప్పుడు మాత్రమే సంబంధిత శాఖ అధికారిని కలవాల్సి ఉంటుంది. ఆ తర్వాత తమ ఫైలు పరిష్కారం కోసం ఏ అధికారినీ కలిసి విన్నవించాల్సిన అవసరం లేదు. పైగా ఇ–ఫైలింగ్ విధానంలోనే ప్రభుత్వ శాఖలన్నీ సేవలు అందించాల్సి ఉంది. అంతేకాదు దరఖాస్తులను పరిష్కరించేందుకు తీసుకున్న సమయం, ఏమైనా అభ్యంతరాలు, వాటిని నివృత్తి చేసుకునేందుకు చేసిన ప్రయత్నాలు వీటన్నింటి గురించి ఆన్‌లైన్‌లో అధికారులు వివరించాలి. పౌర సేవలకు సంబంధించి ఎంతో ప్రయోజనకారి అయిన ఈ చట్టాన్ని ప్రభుత్వం చిత్తశుద్దితో అమలు చేస్తే ప్రజల మెప్పు పొందడం ఖాయం.
ఆంధ్రప్రదేశ్‌లో పబ్లిక్ సర్వీసెస్ గ్యారెంటీ యాక్టును ప్రవేశపెట్టి ఏడేళ్లు పూర్తయినా, ఆచరణకు నోచుకోలేదు. రాష్ట్రంలో వివిధ విభాగాల్లో దీనిపై పురోగతిని పరిశీలిస్తే, ఏ ఒక్క శాఖలోనూ అమలు కాలేదు. ఏ ఒక్క సేవను సకాలంలో పరిష్కారం చేయలేదు. ఏ ఒక్క అధికారికి ఎటువంటి పెనాల్టీ విధించిన దాఖలాలు లేవు. సంబంధిత అర్జీదారునికి పరిహారం చెల్లించినట్లు ఒక్క ఉదంతం కూడా లేదు. అట్టహాసంగా ప్రారంభించినా అధికారులు, రాజకీయ నాయకులకు చిత్తశుద్ధి లేకపోవడంతో ఈ చట్టాన్ని అటకెక్కించారు. ఉన్న చట్టాలను బలోపేతం చేయడానికి ఎటువంటి ప్రయత్నం చేయడం లేదు. అనేక ప్రభుత్వ కార్యాలయాల్లో సిటిజన్ చార్టర్ కూడా పూర్తిస్థాయిలో అమలు కావడం లేదు. చాలా కార్యాలయాల్లో ప్రధానంగా కలెక్టరేట్, రెవెన్యూ, మున్సిపల్ కార్యాలయాల్లో అర్జీ తీసుకున్న తర్వాత రసీదు ఇచ్చే సంస్కృతి లేదు. ఇది అన్ని ప్రధానమైన ప్రభుత్వ కార్యాలయాల్లోనూ జరిగే తంతు. సమాచార హక్కు చట్టం కింద అడిగిన సమాచారాన్ని కూడా నెలరోజుల తరువాత మొక్కుబడిగా ఇస్తున్నారే తప్ప, చిత్తశుద్ధి లేదు. పబ్లిక్ సర్వీసెస్ గ్యారంటీ యాక్ట్ ఊసే లేదు. అది ఉన్న విషయం కూడా ప్రభుత్వ యంత్రాంగానికి తెలిసినట్లుగా లేదు. ఈ పరిస్థితుల్లో మనం ఆశించిన ప్రజా పరిపాలన సాధ్యమవుతుందా? రెండు రాష్ట్రాల్లోని నూతన ప్రభుత్వాలు పబ్లిక్ సర్వీసెస్ యాక్ట్ అమలుకు చిత్తశుద్ధితో ముందడుగు వేయాలి. అప్పుడే చెప్పే మాటలకు చేసే పనులకు పొంతన ఉందని ప్రజలు నమ్ముతారు.
భారతదేశంలో ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, ఒడిశా, సిక్కింతో సహా వారి సొంత ఓపెన్ డేటా పోర్టల్‌ను పాక్షికంగా కలిగివున్నాయి. అన్ని శాఖల పూర్తి ఆదాయ వ్యయాలు ఈ పోర్టల్ ద్వారా అందుబాటులో లేవు. అదేవిధంగా ప్రభుత్వ రికార్డులు, ఆర్థిక, పర్యావరణ, రవాణా, విద్య, ఆరోగ్యం, నేరం, భద్రత, మౌలిక సదుపాయాలు, భౌగోళిక సమాచార వ్యవస్థలు, వ్యాపారం, లైసెన్స్... మొదలైన డేటా పూర్తి సమాచారం ప్రజలకి అందుబాటులో లేదు.
ఈ డేటా పోర్టల్‌లో పైన చెప్పిన సమాచారంతో పాటు వివిధ ప్రభుత్వ విభాగాలు, ప్రభుత్వ గ్రాంట్‌తో అనుబంధంగా పనిచేసే అన్ని సంస్థలు, శాఖలు తమ నెలవారీ ఖర్చుల వివరాలు, చేసిన పనులు, సంబంధిత కాంట్రాక్టర్ చేసిన వ్యయం వంటి పూర్తిస్థాయి సమాచారం ప్రజలకు అందుబాటులో ఎప్పటికప్పుడు ఉంచాలి. అప్పుడే పాలనలో పారదర్శకత సాధ్యమవుతుంది. స్థానిక సంస్థల దగ్గర నుంచి వివిధ ప్రభుత్వ శాఖలు, రోడ్లు భవనాలు, వ్యవసాయం, నీటిపారుదల, గనులు, అటవీ, ఇతర అన్ని ప్రభుత్వ శాఖలు తాము చేసిన పనుల జాబితాను, వ్యక్తుల జాబితాను పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంచాలి. దీనివలన ప్రజాధనం దుర్వినియోగం కాకుండా ఉంటుంది.
దీనికి అనుబంధంగా సిటిజెన్ ఫీడ్‌బ్యాక్ మెకానిజం వ్యవస్థను ఏర్పాటు చేస్తే ఓపెన్ డేటా పోర్టల్‌లో ఉన్న సమాచారంపై తమ సూచనలు, సలహాలు ఇవ్వటానికి, తప్పులను ఎత్తి చూపటానికి ప్రజలకి వీలవుతుంది. కనుక ఈ రెండింటిని మేళవించి ఒక వ్యవస్థను ఏర్పాటు చేస్తే ప్రజలే ధర్మకర్తలుగా జరుగుతున్న ప్రతి పనిని గమనిస్తూ దుబారాను అరికట్టడానికి, అవినీతికి ఆస్కారం లేని ప్రజాపాలనా వ్యవస్థ ఏర్పడడానికి అవకాశం ఏర్పడుతుంది. ప్రజలే ప్రభువులు. ప్రజలకు తెలిసి పరిపాలన కొనసాగాలి. ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు ప్రజల కంటే తక్కువే కానీ ఎక్కువ కాదు. ఈ స్ఫూర్తితో పౌరసేవా పత్రం, ప్రభుత్వ సేవల పంపిణీ హామీ చట్టం, ఓపెన్ డాటా పోర్టల్, సిటిజన్ ఫీడ్ బ్యాక్ అన్నింటిని మిళితం చేస్తూ అధికారులపై అజమాయిషీ చేస్తూ, రాజకీయ ప్రమేయం లేని ఒక వ్యవస్థని ఏర్పాటు చేస్తే తప్పనిసరిగా ప్రజా పరిపాలన సాధ్యమవుతుంది. ఆ దిశగా రెండు నూతన ప్రభుత్వాలు అడుగులు వేస్తాయని ఆశిద్దాం.
సంక్రాంతి వికె
Updated Date - Oct 29 , 2024 | 12:44 AM