ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఇంకా తెలవారదేమి? ఈ స్థితి గతి మారదేమి?

ABN, Publish Date - Sep 12 , 2024 | 12:46 AM

‘మంచి మిత్రులు’ సినిమాలో ‘ఇంకా తెలవారదేమి?’ అనే పాట ఉంది. విశ్వవిద్యాలయాల వీసీల నియామకాల గురించి ఆలోచిస్తుంటే ఆ పాట నాకు జ్ఞాపకమొచ్చింది....

‘మంచి మిత్రులు’ సినిమాలో ‘ఇంకా తెలవారదేమి?’ అనే పాట ఉంది. విశ్వవిద్యాలయాల వీసీల నియామకాల గురించి ఆలోచిస్తుంటే ఆ పాట నాకు జ్ఞాపకమొచ్చింది.

ఏళ్ల తరబడి విశ్వవిద్యాలయాలలో వీసీలను నియమించకుండా కొనసాగించడం ప్రభుత్వాలకు ఒక అలవాటైపోయింది. అసలు విద్యకే ఒక మంచి మంత్రిని నియమించడం కూడా చాలా అరుదైపోయింది. విద్యంటేనే చిన్నచూపు ఏర్పడింది. అందువల్ల విద్యారంగంలో సంస్కరణలు తెస్తామని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అడపాదడపా మాట్లాడినా అవి కార్యరూపం దాల్చడం లేదు. గతంలో కొఠారి కమిషన్‌ ఎన్నో మంచి ప్రతిపాదనలు చేసినా, వాటిలో కొన్నింటిని కూడా ప్రభుత్వాలు సీరియస్‌గా పట్టించుకోలేదు. ఈ మధ్య రాష్ట్ర ప్రభుత్వం ఒక ‘ఎడ్యుకేషన్‌ కమిషన్‌’ వేస్తే ‘‘రాజ్యాంగబద్ధమైన కమిషన్‌ల రిపోర్టులనే పట్టించుకునేవారు లేరు, ఇక జీఓ ద్వారా ఏర్పరచిన కమిషన్‌ సూచనలను ఎవరు పట్టించుకుంటారు’’ అని ఒక పత్రిక రాసింది.


రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఎన్నోసార్లు వీసీల నియామకాలు ‘ఇదిగో వచ్చె, అదిగో వచ్చె’ అన్నారు. మరి ఏవీ అవి? విశ్వవిద్యాలయాలకు వీసీలను నియమించకపోవడం వల్ల వాటిలో ఎన్నో అవకతవకలు జరుగుతున్నాయి. ఉదాహరణకు ‘బాసర’ లాంటి ప్రాంతంలో ఒక విశ్వవిద్యాలయంలో ఏళ్ల తరబడి అస్థిర పరిస్థితి కొనసాగుతోంది. అది ఇంకా ఒక ఇన్‌చార్జ్‌ వీసీకే కాని రెగ్యులర్‌ వీసీకి నోచుకోలేదు. ఇక ఇతర విశ్వవిద్యాలయాల మాట చెప్పేదేముంది? తెలుగు అకాడమీ లాంటి విశ్వవిద్యాలయాలతో ఎంతో సన్నిహిత సంబంధమున్న ఒక మంచి సంస్థను కూడా పదేళ్లుగా పర్మినెంట్‌ సంచాలకుడిని వేయకపోవడం అందరికీ తెలిసిందే. ఇలాగైతే విద్యావ్యవస్థ ఎలా బాగుపడుతుంది? ఈ వ్యవస్థే బాగుపడకపోతే ఇతర రంగాలు ఎలా బాగుపడతాయి? క్రమశిక్షణ, లా అండ్‌ ఆర్డర్‌ ఎలా బాగుంటుంది?


విద్యా వ్యవస్థ సక్రమంగా లేకపోవడం వల్ల నిరుద్యోగ సమస్య ప్రబలి, యువత విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నందునే కదా ప్రతిరోజూ ఎన్నో వినకూడని, కనకూడని అరాచకాలు, అసభ్య ప్రవర్తన తటస్థిస్తున్నాయి. ఎన్నో ఆత్మహత్యలు, అనాగరికపు చేష్టలు, ఆకతాయి పోకడలు సంభవిస్తున్నాయి. వీటన్నింటికీ కారణం విద్యలో విలువలు క్షీణించడమే. విద్యా వ్యవస్థను పాడుచేసుకొని, తద్వారా లా అండ్‌ ఆర్డర్‌ సమస్యలను సృష్టించుకొని... ప్రభుత్వాలు ఎలా సుస్థిరంగా సాగుతాయి? రక్షణ– సంరక్షణ, క్షేమ–సంక్షేమ పరిస్థితులను ఎలా నెలకొల్పుతాయి? విద్యాప్రమాణాలు దిగజారిపోతున్నందువల్లనే కదా అవినీతి కూడా అంతకంతకూ పెరిగిపోతోంది. దానిని ఎలా అరికడతారు? వీసీల నియామకాలలో కుల, మత, ప్రాంత ప్రాతినిధ్యాలను ఇవ్వక తప్పదు. అది రాజకీయంగా వీలుపడదు. కానీ ప్రతి కులంలో, మతంలో, ప్రాంతంలో ఎంతో కొంతమంది మంచివాళ్లు, యోగ్యులు ఉంటారు. వారిని నియమిస్తున్నారా లేక రాజకీయపరంగా కానివారిని నియమిస్తున్నారా అన్నదే ప్రశ్న.


విద్యామంత్రి తప్పనిసరిగా ఉండాలి. ఎందుకంటే, విద్యకు మించిన శాఖ మరొకటి లేదు. ఆ శాఖ అన్ని శాఖలకు మానవ వనరులను సమకూరుస్తుంది. ఈ శాఖను ముఖ్యమంత్రే చేబట్టాలి. అప్పుడే ఆ శాఖకు సరిపోయే వనరులు లభిస్తాయి, సరిపోయినంత స్వేచ్ఛ లభిస్తుంది. లేకపోతే విద్య కుంటుకుంటూ, గెంటుకుంటూ నడుస్తుంది. ముఖ్యమంత్రి మూడు వేర్వేరు శాఖలు నిర్వహించడం కన్నా, ఒక్క విద్యాశాఖను నిర్వహిస్తే అన్ని శాఖలకు మేలు చేసినవారవుతారు. మిగిలిన శాఖలకు మంచివారిని, యోగ్యులను సరఫరా చేయగలుగుతారు. ఇప్పుడు కావలసింది అదే!

డా. కొండలరావు వెల్చాల

పూర్వ సంచాలకులు, తెలుగు అకాడమీ

Updated Date - Sep 12 , 2024 | 12:46 AM

Advertising
Advertising