ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

నక్సల్‌ సమస్యకు పరిష్కారమెలా?

ABN, Publish Date - Oct 20 , 2024 | 12:12 AM

నక్సలైట్లపై పోరులో తన విజయాలను కేంద్రం ఇటీవల చాలా బిగ్గరగా ప్రకటిస్తోంది. కర్కశంగా మాట్లాడుతోంది. యుద్ధ సమాప్తికి చేరువయ్యామని కూడా గట్టిగా చెప్పుతోంది. హతులు, అరెస్టయినవారు, లొంగిపోయినవారి విషయమై...

నక్సలైట్లపై పోరులో తన విజయాలను కేంద్రం ఇటీవల చాలా బిగ్గరగా ప్రకటిస్తోంది. కర్కశంగా మాట్లాడుతోంది. యుద్ధ సమాప్తికి చేరువయ్యామని కూడా గట్టిగా చెప్పుతోంది. హతులు, అరెస్టయినవారు, లొంగిపోయినవారి విషయమై కేంద్రం ఏకరువుపెడుతున్న గణాంకాలు ఉత్తేజకరంగా ఉన్నప్పటికీ నక్సలైట్‌ సమస్యను అవి పరిష్కరించగలవా అన్నది ప్రశ్నార్థకమే.

ఈ నెల 7న నక్సల్‌ ప్రభావిత రాష్ట్రాల సమావేశంలో కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా మాట్లాడుతూ ఛత్తీస్‌గఢ్‌లో 85 శాతం వామపక్ష తీవ్రవాదులను, మావోయిస్టు పార్టీ అగ్రనాయకులు 14 మందిని నిర్మూలించామని వెల్లడించారు. ఈ ఏడాది ఇప్పటికే 237 మంది మావోయిస్టులు హతమయ్యారని, 812 మందిని అరెస్ట్‌ చేశామని, 732 మంది లొంగిపోయారని ఆయన తెలిపారు నక్సలైట్ల హింసాకాండ 2014–24 సంవత్సరాల మధ్య, 2004–14 సంవత్సరాల మధ్య కాలంతో పోలిస్తే 53 శాతం తగ్గిందని అమిత్‌ షా చెప్పారు.


నక్సలైట్ల ఉద్యమం కచ్చితంగా వెనుకంజలో పడింది. అక్టోబర్‌ 4న బస్తర్‌లోని అబూజ్‌మడ్‌ అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 31 మంది మావోయిస్టు కార్యకర్తలు హతమవడం వారికి కోలుకోని నష్టమే. మార్చి 2026 నాటికల్లా మావోయిస్టు తీవ్రవాద కంటక భూతం నుంచి దేశాన్ని విముక్తం చేస్తామని కేంద్ర హోం మంత్రి తెలిపారు. 2010లోను, అప్పటి కేంద్ర హోంమంత్రి పి. చిదంబరం నక్సలైట్ల సమస్యను రాబోయే మూడేళ్లలో అధిగమించగలుగుతామని చెప్పడం గమనార్హం. చిదంబరం తడబడిన చోట అమిత్‌ షా సఫలమవుతారా? ఏ పరిస్థితులు నక్సలైట్ల ప్రభావ ప్రాబల్యాలకు కారణమవుతున్నాయనే విషయమై సమగ్ర అవగాహన కొరవడిన దృష్ట్యా పై ప్రశ్నకు ఇదమిత్థమైన సమాధానమివ్వడం కష్టం.

గత ఆగస్టు 24న నక్సలైట్ల ప్రభావిత రాష్ట్రాల సమావేశానికి అధ్యక్షత వహించిన అమిత్‌ షా మాట్లాడుతూ వామపక్ష తీవ్రవాదాన్ని నిర్ధాక్షిణ్యంగా తడిచిపెట్టాల్సిన సమయమాసన్నమయిందని అన్నారు. దృఢ సంకల్పం ప్రశస్తమే కాని మన సొంత ప్రజలతో కనికరం లేని రీతిలో వ్యవహరించడం ఎంత మాత్రం శ్రేయస్కరం కాదు. వామపక్ష తీవ్రవాదాన్ని చావుదెబ్బ తీయడంలో సఫలమయినట్టు భారత రాజ్య వ్యవస్థ ఇంతకు ముందు రెండుసార్లు విశ్వసించింది. తొలుత 1972లో చారు మజుందార్‌ మరణించిన తరువాత, రెండోసారి 1990ల నడిమి కాలంలో కొండపల్లి సీతారామయ్య నాయకత్వం బలహీనపడిన తరువాత. అయితే ఈ రెండు సందర్భాలలోను నక్సలైట్‌ ఉద్యమం మరింత శక్తితో, మరింత చురుగ్గా పునర్‌ విజృంభించింది.


ఒక సంక్లిష్ట సమస్య పట్ల మన దృక్పథంలోని మౌలిక లోపాలను అక్టోబర్‌ 7 సమావేశం బయల్పరిచింది. సత్వర సత్ఫలితాలను సాధించేందుకు కేంద్ర హోం శాఖ భద్రతా దళాలపై పెద్ద ఎత్తున ఆధారపడుతోంది. కేంద్ర సాయుధ పోలీసు దళాలు (సిఎపిఎఫ్‌) తనకు అప్పగించిన బాధ్యత నిర్వహణలో సమర్థంగా పనిచేస్తోంది. అయితే ఆ భద్రతా దళాలు చేయగలిగేదానికి ఒక పరిమితి ఉన్నది. భద్రతాదళాలు ఒకసారి ఒక ప్రాంతంలో నక్సల్స్‌ను ఏరిపారేసిన తరువాత, అక్కడి గిరిజనుల జీవితాలను మెరుగుపరిచే సదుపాయాలను అభివృద్ధిపరచడం ప్రభుత్వ బాధ్యత. దురదృష్టవశాత్తు ఇదే జరగడం లేదు. ఫలితంగా ఆ ప్రాంతాలను నక్సలైట్లు పునరాక్రమించుకుంటున్నారు. ఈ పరిస్థితిని నివారించేందుకు అవసరమయిందేమిటి? సమస్య పరిష్కారానికి సమస్త ప్రభుత్వ విభాగాల సమష్టి సమన్వయ కృషి (హోల్‌ ఆఫ్‌ గవర్నమెంట్‌ అప్రోచ్‌). సరిగ్గా ఇవే కనిపించడం లేదు. మరో ముఖ్య లోపం రాష్ట్ర పోలీసు దళాలు సిఆర్‌పిఎఫ్‌కు సహాయక పాత్ర మాత్రమే వహించడం. అలా కాకుండా నక్సలైట్ల వ్యతిరేక పోరులో రాష్ట్ర పోలీసులు అగ్రస్థానంలో ఉండాలి. రాష్ట్ర పోలీసులు భూమి పుత్రులు. తాము పనిచేస్తున్న ప్రాంతం పట్ల వారికి సమగ్ర అవగాహన ఉంటుంది. అలాగే అక్కడి ప్రజల గురించి కూడా. కనుక నక్సల్‌ వ్యతిరేక పోరాటాలు ప్రారంభించేందుకు వారు మెరుగైన యోగ్యతలు కలిగివుంటారు. అయితే రాష్ట్రాల ప్రతినిధులు మరిన్ని కేంద్ర భద్రతా దళాలు కావాలని అభ్యర్థించడం నిరుత్సాహం కలిగిస్తోంది.


అభివృద్ధి సాధనకు ప్రభుత్వం ఎనలేని ప్రాధాన్యమిస్తోంది. ఇక్కడ ఒక హెచ్చరిక చేయవలసిన అవసరం ఉన్నది. అభివృద్ధి అనేది గిరిజనులకు మౌలిక అవసరాలు తీర్చుతూనే వారి సంప్రదాయ జీవనశైలిని చిందరవందర చేయకూడదు. ఇది చాలా ముఖ్యం. స్థానిక హస్తకళలను ప్రోత్సహించాలి. గిరిజన కళలు, సంస్కృతి, భాషలను అభివృద్ధిపరచాలి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రాథమిక పాఠశాలలు నెలకొల్పవచ్చు. అయితే అడవుల విధ్వంసానికి, ఆదివాసీలు నిర్వాసితులు కావడానికి దారితీసే మెగా ప్రాజెక్టుల నిర్మాణాన్ని అనుమతించకూడదు. ఆ ప్రాజెక్టుల వల్ల ఆదివాసీలు తమ భూములను కోల్పోవలసివస్తుంది. భూముల నుంచి దూరమయిన ఆదివాసులు అశాంతికి లోనవుతారు. పర్యావరణ మంత్రిత్వ శాఖ నివేదిక ప్రకారం ఏప్రిల్‌ 1, 2018 – మార్చి 31, 2023 మధ్య 88,903 హెక్టార్ల అటవీ భూమి అటవీయేతర ప్రయోజనాలకు మళ్లించబడింది. భూమిని కోల్పోవడమనేది గిరిజనులకు చాలా బాధాకరమైన విషయం. ‘గిరిజనులు పూర్తిగా అలసిపోయారు, నిరుపేదలుగా కునారిల్లుతున్నారు, తీవ్ర మనోవ్యాకులతకు గురవుతున్నారు’ అని గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ నివేదిక ఒకటి పేర్కొంది.


నక్సలైట్ల సమస్య గత ఐదు దశాబ్దాలుగా తీవ్ర స్థాయిలో ఉన్నది. ఈ హింసాకాండ, రక్తపంకిల చరిత్ర అంతమవ్వాలని అందరూ ఆశిస్తున్నారు. అయితే నక్సలైట్లను అంతమొందించడం ద్వారా మీరు ఆ సమస్యను పరిష్కరించలేరు. నిజానికి అటువంటి చర్యలు ప్రతికూల ఫలితాలనే ఇస్తాయి. దాదాపుగా ప్రతి నక్సలైట్‌కూ రాజ్యవ్యవస్థపై తీవ్ర అసంతృప్తి ఉన్నది. నక్సల్స్‌ను రాజ్యం అనేక ఇక్కట్లపాలు చేస్తోంది. వివక్ష, వేధింపుల, దోపిడీల గాథ అది. ఆ దురాగతాలను ప్రతిఘటించకుండా వారు ఎలా ఉంటారు. మార్గాంతరమేమిటి? పాత ఆలోచనా రీతులను విడనాడి కొత్త పద్ధతులలో ఆలోచించాలి. నక్సల్‌ ప్రభావిత రాష్ట్రాలలో రెండునెలల పాటు ఏకపక్షంగా కాల్పుల విరమణ ప్రకటించే విషయాన్ని భారత ప్రభుత్వం పరిశీలించాలి. లొంగిపోవాల్సిందిగా నక్సల్స్‌కు విజ్ఞప్తి చేయాలి. లొంగిపోయినవారికి కేసుల నుంచి రక్షణ కల్పించి, వారి పునరావాసానికి పూర్తిగా తోడ్పడతామని అభయమివ్వాలి, అదే సమయంలో నక్సలైట్‌ నాయకులను శాంతి చర్చలకు ఆహ్వానించాలి. వారి ఇబ్బందులు, వ్యధలను సావధానంగా వినాలి. వాటిని వీలైనంతవరకు పరిష్కరించాలి, ప్రధానస్రవంతిలో కలిసిపోవాలని వారికి నచ్చజెప్పాలి. ఇటువంటి దృక్పథంతో వ్యవహరించినప్పుడు, బహుశా నక్సలైట్ల సంఖ్య తగ్గేందుకు అవకాశమున్నది. సాయుధ చర్యల కంటే ఆ మానవీయ పద్ధతే నక్సల్‌ ప్రభావం తగ్గేందుకు తోడ్పడుతుంది. ఎంతో రక్తపాతం జరిగింది, ఇంకా జరుగుతోంది. రాజ్య వ్యవస్థ కాఠిన్యం నుంచి నక్సలైట్లకు ఉపశమనం కలిగించాలి. వారి మనస్సులు, హృదయాలు గెలుచుకోవాలి. అది మాత్రమే నక్సల్‌ సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని ఖాయం చేస్తుంది.

ప్రకాష్‌ సింగ్‌

సరిహద్దు భద్రతా దళాల మాజీ డైరెక్టర్‌ జనరల్‌

(టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా సౌజన్యం)

Updated Date - Oct 20 , 2024 | 12:12 AM