ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

రెండొందల కాపీలు పోని చోట ముప్పైమూడు వేలు ఎలా అమ్మారు!

ABN, Publish Date - Aug 19 , 2024 | 12:34 AM

‘అమ్మ డైరీలో కొన్ని పేజీలు’ నవల ఇరవై ఐదు వేల కాపీలు అమ్ముడై ముప్పై వేలకు దగ్గరవుతుండటం మాకు ఇప్పటికీ ఆశ్చర్యంగానే ఉంది. ఇందులో పబ్లిషర్స్‌గా మేమేం చేశామని ఆలోచిస్తే...

మూడు ప్రశ్నలు

మీ ప్రచురణ సంస్థ అజు పబ్లికేషన్స్ విడుదల చేసిన రవి మంత్రి నవల ‘అమ్మ డైరీలో కొన్ని పేజీలు’ ముప్పైమూడువేల కాపీలు అమ్ముడై బెస్ట్ సెల్లర్‌గా నిలిచింది. ఇంతమంది పాఠకుల దాకా పుస్తకాన్ని తీసుకువెళ్ళటానికి మీరు ఎలాంటి ప్రయత్నాలు చేశారు?

‘అమ్మ డైరీలో కొన్ని పేజీలు’ నవల ఇరవై ఐదు వేల కాపీలు అమ్ముడై ముప్పై వేలకు దగ్గరవుతుండటం మాకు ఇప్పటికీ ఆశ్చర్యంగానే ఉంది. ఇందులో పబ్లిషర్స్‌గా మేమేం చేశామని ఆలోచిస్తే ఈ ఒక్క పుస్తకం కోసమే అని ప్రత్యేకంగా చేసిందేమీ లేదు. తెలుగులో ఒక పుస్తకం వెయ్యి కాపీలు అమ్ముడైతే చాలు అనుకుంటున్న రోజుల్లో ‘అజు పబ్లికేషన్స్’ పుట్టింది. నేనేమీ ఈ నెంబర్స్ మార్చాలని, వేల కాపీలు అమ్మాలని అనుకొని ఇది మొదలు పెట్టలేదు. నా పుస్తకాలు నేనే ప్రచురించుకుందామని మొదలుపెట్టాను. నాతోపాటు కో-పబ్లిషర్‌గా శ్వేత యర్రం జాయినయ్యాక వేరే రచయితల పుస్తకాల్ని కూడా ప్రచురించడం మొదలుపెట్టాం. అన్ని పుస్తకాలకూ ఎలా పని చేస్తామో అలాగే ‘అమ్మ డైరీలో కొన్ని పేజీలు’ పుస్తకానికీ చేశాం. 2023 జూన్‌లో ఈ పుస్తకం మార్కెట్లోకి వస్తే 2024 మే వరకు మూడు ఎడిషన్లు అయిపోయాయి. అప్పటికే మేము ఈ పుస్తకం బాగా వెళ్తోంది కదా అను కున్నాం. నాలుగో ఎడిషన్ వెయ్యి కాపీలు ప్రింట్ చేస్తే రెండే రెండు రోజుల్లో అయిపోయాయి. ఆ వెంటనే ఐదు, ఆరు, ఏడు – ఇలా ఎడిషన్‌కి రెండు వేల కాపీలు ప్రింట్ చేసినా వారంరోజుల్లోపే అయిపోతున్నాయి. ఎనిమిదో ఎడిషన్‌కి ఐదు వేలు, తొమ్మిదో ఎడిషన్‌కు పది వేలు, ఇప్పుడు పదో ఎడిషన్‌కు పది వేలు వేశాం. ఇలా- గత రెండు నెలలుగా పుస్తకం రీ-ప్రింటుకి వెళ్తూనే ఉంది.


ఇంత డిమాండ్‌కి కారణం ఏంటని అన్ని కోణాల్లోంచి విశ్లేషిస్తూనే ఉన్నాం. కచ్చితంగా ఇక్కడ మొదలైందని చెప్పలేం గానీ, ఇన్‌స్టాగ్రాంలో కొన్ని మీమ్ పేజీలు ఈ పుస్తకాన్ని చదివి రీల్స్ చేశాయి. అందులో కొన్నింటికి యాభై అరవై లక్షల వ్యూస్ వచ్చాయి. అదే టైంకి ఇన్‌స్టాగ్రాంలో ఈ పుస్తక రచయిత రవి మంత్రి కూడా కంటెంట్ క్రియేటర్‌గా బాగా పాపులర్ అయ్యాడు. అన్నీ కలిసి రెండు నెలల క్రితం ఈ పుస్తకానికి ఒక క్రేజ్ తీసుకొచ్చాయని అనుకుంటాను. ఆ క్రేజ్ చూసి కొన్నవాళ్ళంతా చదివి బాగుందంటూ షేర్ చెయ్యడం మొదలుపెట్టాక ఇంక ఈ పుస్తకం ఆగింది లేదు. మేమెప్పుడూ పేర్లు కూడా వినని చిన్న చిన్న బుక్‌ షాప్‌ల నుంచి రోజూ ఫోన్లు వస్తున్నాయి. అమెజాన్‌లో వచ్చే ఆర్డర్లను ప్యాక్ చెయ్యడానికి వర్క్ ఫోర్స్ సరిపోక రోజుకి ఐదొందల ఆర్డర్లకు మించి తీసుకో లేని పరిస్థితి. ఈ రెండు నెలలుగా మేం చూస్తున్న ప్రతిదీ మాకు కొత్తదే. ఈ పుస్తకం ఎంత దూరం వెళ్తుందని అడిగితే మాకైతే ఇంకా ఏ అంచనా రాలేదు.

మీరడిగిన ప్రశ్న దగ్గరికే మళ్ళీ వెళ్దాం. పబ్లిషర్స్‌గా మేం చేసింది ఏంటంటే, మొదట్నుంచీ మేం కట్టుబడి ఉన్న విషయాలు కొన్ని ఉన్నాయి:

1) పుస్తకానికి వీలైనంత తక్కువ ధర పెట్టడం. (కొన్ని పుస్తకాలకు మొదటి ఎడిషన్ అయిపోయిన తర్వాత కూడా బ్రేక్ ఈవెన్ రాలేదు)


2) కొత్త పాఠకులను చేరే మార్గాలను వెతుకుతూనే ఉండటం. ఈ క్రమంలోనే ట్విట్టర్‌లో, ఇన్‌స్టాగ్రాంలో మా ప్రెజెన్స్‌ను ఈ మూడేళ్ళలో ఇరవై రెట్లు పెంచగలిగాం. మాకొచ్చే ఆర్డర్లలో ఎక్కువ శాతం సోషల్ మీడియా ద్వారా వచ్చేవే. ఇప్పుడు అమ్మ డైరీలో.. పుస్తకాన్ని చదివి ఓన్ చేస్కొని ఇంత దూరం తీసుకొచ్చింది కూడా ఇన్‌స్టాగ్రాం బాగా వాడే పాతికేళ్ళలోపు వయసున్నవాళ్ళే. వీళ్ళలో చాలామందికి ఇది మొదటిపుస్తకం. వాళ్ళంతా మొదటిసారి ఒక పుస్తకం చదువుతుంటే కలిగే అనుభూతి గురించి చెప్తుంటే బాగుంది. మాకు నెంబర్స్ కంటే ఈ కొత్త పాఠకులను తయారుచెయ్యడం ఎక్కువ సంతోషాన్నిస్తోంది. అలాగే ఈ కొత్త రీడర్స్‌లో మేము గమనించింది ఏంటంటే, ఏదైనా నచ్చితే దాన్ని తమకు నచ్చిన పద్ధతిలో ఫ్రెండ్స్‌కి షేర్ చేస్తారు. అందువల్లే ఈ పుస్తకం ఒకరి నుంచి ఒకరికి పాకి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.

3) కంటెంట్‌ విషయంలో క్వాలిటీ అన్నది ఎలాగో మా బేసిక్ రూల్. ప్రింట్ క్వాలిటీ కూడా బాగుండాలని బలంగా నమ్ముతాం. అలాగే ఎవరైనా పుస్తకం కోసం వెతికితే అది వెంటనే దొరికేలా అమెజాన్ స్టోర్‌ఫ్రంట్‌ను నడిపిస్తున్నాం.

సోషల్ మీడియాలో సెన్సేషన్ అయిన అమ్మ డైరీలో కొన్ని పేజీలు పుస్తకానికి, ముందు నుంచీ మేము ఫాలో అవుతున్న ఈ అంశాలు ఒక ప్లాట్ఫాంగా పనిచేసి ఉండొచ్చు అనుకుం టున్నా.

పుస్తకంలో ఏ అంశం/ ఏ విధమైన శైలి పాఠకుల్ని ఇంతగా ఆకట్టుకుంది అనుకుంటున్నారు?

ఈ పుస్తకానికి బ్యాక్ కవర్లో రవి మంత్రి రాసినట్టు ‘ఇది అమ్మ ప్రేమ కథ’ అన్న అంశం ఎక్కువమందిని ఆకర్షించింది. చక్కటి శైలితో ఒక్కసారి మొదలుపెడితే చివరివరకు చదివింపజేసే కథనం అందరికీ నచ్చింది. ప్రేమలో అవతలి మనిషిని కోల్పోతామేమో అనే భయమూ, కోల్పోయినప్పుడు ఉండే బాధా ఈ నవలలో కనిపిస్తాయి. వాటిగురించీ ఎక్కువమంది మాట్లాడటం చూస్తుంటే, నిజాయితీగా ప్రేమలో ఉండే ఇన్నొసెన్స్‌ని పట్టుకొని రాయడం వల్ల కూడా ఈ నవలకు ఇంత పాపులారిటీ వచ్చి ఉండొచ్చు.


మీ ‘అజు పబ్లికేషన్స్’ దగ్గర నుంచి ఇప్పటిదాకా వచ్చిన టైటిల్స్ లో యంగ్ ఆడియన్స్‌ని ఆకట్టుకున్న ఇతర టైటిల్స్ ఏమిటి? పుస్తకాల్లోని ఏయే ఫాక్టర్స్ యంగ్ ఆడియన్స్ ని ఆకట్టుకుంటు న్నాయని మీరు భావిస్తున్నారు?

మేము ఇప్పటివరకు పద్నాలుగు పుస్తకాలు ప్రచురిస్తే అందులో ఏడు కొత్త రచయితల మొదటి పుస్తకాలే. ఇందులో దాదాపు అన్ని పుస్తకాల రీడర్ బేస్ కూడా యంగ్ రీడర్సే. నల్లగొండ కథలు, ఇరానీ కేఫ్, గాజుల సంచి, రామగ్రామ నుంచి రావణలంక దాకా, కాగితం పడవలు – ఈ పుస్తకాలన్నీ అమెజాన్‌లో బెస్ట్‌సెల్లర్స్ ప్లేసుకెళ్ళి కనీసం మూడు రీ-ప్రింట్‌లకు వెళ్ళాయి. సులువుగా ఉండే భాష, ఈతరం మాట్లాడుకునే సంభాషణలే ఉండటం వల్ల కూడా యంగ్ రీడర్స్‌కు ఈ పుస్తకాలు దగ్గరయ్యాయనుకుంటాను. సరిగ్గా చదివింపజేసే శైలితో వాళ్ళు రిలేట్ చేసుకోగలిగేలా రాస్తే ఎలాంటి థీమ్స్‌ని అయినా యాక్సెప్ట్ చేస్తున్నారు. అలాగే కొత్తగా పుస్తకాలు చదువుతున్న చాలామంది కథ కంటే నవలనే ఎక్కువ ఇష్టపడుతున్నారనిపిస్తోంది.

(వి. మల్లికార్జున్‌ రచయిత, ప్రచురణకర్త.

శ్వేత యర్రంతో కలిసి అజు పబ్లికేషన్స్‌ నడుపుతున్నారు.

అజు పబ్లికేషన్స్‌ ఇప్పటి దాకా ౧4 పుస్తకాలు ప్రచురించింది.)

వి. మల్లికార్జున్‌

Updated Date - Aug 19 , 2024 | 12:34 AM

Advertising
Advertising
<