ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

సృజనకారుల్లో విధ్వంస వాంఛ ఎందుకు?

ABN, Publish Date - Sep 23 , 2024 | 12:50 AM

‘‘ఇంకెన్ని రాసినా నేను డార్కర్ సైడ్ అఫ్ లైఫ్ గురించే రాస్తాను.... నేను చచ్చిపోయిం తర్వాత ఏమవుతానన్నది అస్తిత్వవాదం ప్రకారం నాకు సంబంధం లేదు. నా రచనలన్నీ నేను బతికుండగానే...

‘‘ఇంకెన్ని రాసినా నేను డార్కర్ సైడ్ అఫ్ లైఫ్ గురించే రాస్తాను.... నేను చచ్చిపోయిం తర్వాత ఏమవుతానన్నది అస్తిత్వవాదం ప్రకారం నాకు సంబంధం లేదు. నా రచనలన్నీ నేను బతికుండగానే తగలబెట్టి ఎవడన్నా దాని మీద ఒంటేలుకు పోయినా కూడా నాకేం ప్రాబ్లమ్ లేదు. I wanted to speak out my inner self’’ – కొద్దిరోజుల క్రితం చనిపోయిన రచయిత కాశీభట్ల వేణుగోపాల్ గురించి మెహెర్‌ రాసిన వ్యాసం, ‘ముసుగుల్ని సహించని అక్షరం’ (ఆంధ్రజ్యోతి, 26 ఆగష్టు 2024)లో పేర్కొన్న కాశీభట్ల మాటలు ఇవి. వేణుగోపాల్ మాటల్లో కనిపించేంత అసహనం అసాధారణంగా అనిపించవచ్చేమో గానీ, మైకెలాంజిలో నుంచి, కాఫ్కా, జాయిస్, సిల్వియా ప్లాత్... ఇంకా ఈ మధ్య మరణించిన జయంత మహాపాత్ర వరకూ ఎందరో సృజనకారులను పరిశీలించినప్పుడు– వారు కూడా తమ సృష్టిని తామే ధ్వంసం చేసిన లేదా మరణానంతరం ధ్వంసం చేయమని ఆదేశించినవారే. ఇంతకూ సృష్టికర్తలు తమ సృజనల్ని ఎందుకు ధ్వంసం చేయాలనుకుంటారు? సృష్టించే, విధ్వంసం చేసే ప్రక్రియలకు అవినాభావ సంబంధం ఉన్నదా?


ఒకప్పుడు సృజనకారులు తమను తాము దేవుళ్లుగానో, దైవశక్తి కలవారి గానో భావించే వారు. అందువల్ల సృష్టించడం లేదా సృష్టికి ప్రతిసృష్టి చేయడం తమకు మాత్రమే వీలవుతుందని భావించేవారు. కొంతమంది ఇంకాస్త ముందుకెళ్లి తమను తాము సృష్టి కారకులు గానే గాక, లయకారులుగా కూడా భావించి తమ సృజనలను ధ్వంసం చేసే అధికారం తమకే ఉందనుకున్నారేమో అనిపిస్తుంది. లేదా తమ సృజనలు తమ జీవితంతోనే, తమ మానసిక ప్రపంచంతోనే, ఇంకా తమ భౌతిక శరీరంతోనే ముడిపడినవనీ, తమ మరణానంతరం మరెవరికీ వాటితో సంబంధం లేదనీ భావించారా? తమ సృజనలను చాలామంది సృష్టికర్తలూ, రచయితలూ తమ సంతానంగా భావించినట్లు కూడా మనం గమనించవచ్చు.

కళాకారులు తమ సృష్టికి తాము సొంత దారులు గానూ, సృజనలను ఆస్తిగానూ భావించడం కాలక్రమంలో జరిగింది. పెట్టుబడిదారీ వ్యవస్థ దాన్ని పటిష్టం చేసింది. పర్యవసానంగా తమ సృజనలకు సంబంధించిన కాపీరైట్ హక్కులు ముందుగా తమకూ, తమ మరణానంతరం ఆ హక్కుల్ని వారు సంక్రమింప చేసిన వారికి రావటం జరిగింది.


సాహిత్య, కళా రంగాలలోని సృజనకారులు తమ సృజనలను ఎందుకు ధ్వంసం చేయాలనుకుంటారు అన్న ప్రశ్నతో మొదలెడదాం. కొన్నిసార్లు తాము చేసిన సృజనలపై తమకే కలిగిన అయిష్టత కావొచ్చు, సృజన చేసేటప్పుడే వాటిని చింపేసే ప్రవృత్తి చాలా మంది సృజనకారులలో గమనించవచ్చు. తాము చేస్తున్న సృజనలు తామనుకున్నంత గొప్పగా కుదరడంలేదని విసుగూ, కోపం కూడా దీనికి కారణమై ఉండవచ్చు. కొంతమంది తమ కొన్ని సృజనలను వద్దనుకున్న శిశువులుగా భావించి వాటిని ధ్వంసం చేయాలనుకోవచ్చు. ఐతే ప్రచురింపబడి, బహుళ ప్రాచుర్యం పొందిన తర్వాత కూడా వాటిని ధ్వంసం చేయాలనుకోవడం; ప్రచురణ కాని, ప్రకటింపబడని తమ రచనలను, సృజనలను తగలబెట్టమని తమ వారసులను ఆదేశించడం కూడా అక్కడక్కడా చూస్తున్నాం. తాము చేసిన రచనల చివరి డ్రాఫ్ట్‌లను అవి ప్రచురణ కావడానికి ముందు చూడలేకపోతామనే ఆలోచనే ఇందుకు కారణమేమో! లేదా తాము చేసిన రచనలకు మార్పులూ చేర్పులూ చేసి కాపీరైట్ హక్కుదారులు తమ మరణానంతరం ప్రచురిస్తారేమోననే అనుమానమేమో!


అయినా తమ రచనలపై, సృజనలపై వీళ్లకు ఎందుకంత వ్యామోహం? అసలు రచనలపై రచయితలకు యాజమాన్యపు హక్కులు ఎంతవరకు సమంజసం? ఏ రచనైనా, సృజన అయినా ఒక చోట, ఒక వ్యక్తిలో, ఒక వ్యక్తితో పుడుతుందా? ఒక రచయిత, సృజనకారుని మరణంతో అది అంతమొందుతుందా? రచయితలు, సృజనకారులు భాషలో, కళలో పుడతారు కదా? మరి భాషకు, కళకు పుట్టుక ఎప్పటిది, ఎవరితో జరిగింది? భాషకంటూ, కళకంటూ మరణం ఉంటుందా?

ఎమ్. శ్రీధర్

Updated Date - Sep 23 , 2024 | 12:50 AM