ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

రంగన్న ఆశలు నెరవేరుతాయా?

ABN, Publish Date - Dec 18 , 2024 | 02:07 AM

మహబూబ్‌నగర్‌ జిల్లాకు సాగునీరు సాధించటం అనే ఆశయానికి నిబద్ధమైన వ్యక్తి నల్లవెల్లి రంగారెడ్డి. 1951లో గన్యాగుల గ్రామంలో జన్మించాడు. మధ్య తరగతి కుటుంబం అనుభవించే ఈతిబాధలన్నీ అనుభవించాడు...

మహబూబ్‌నగర్‌ జిల్లాకు సాగునీరు సాధించటం అనే ఆశయానికి నిబద్ధమైన వ్యక్తి నల్లవెల్లి రంగారెడ్డి. 1951లో గన్యాగుల గ్రామంలో జన్మించాడు. మధ్య తరగతి కుటుంబం అనుభవించే ఈతిబాధలన్నీ అనుభవించాడు. 1976లో డిప్యూటీ ఇంజనీర్‌గా సాగునీటి శాఖలో ప్రవేశించి వనపర్తి, కొల్లాపూర్‌, నాగర్‌కర్నూల్‌, గద్వాల, హైదరాబాద్‌, శ్రీకాళహస్తి, నల్లగొండ తదితర చోట్ల విధులు నిర్వహించి, 38 సంవత్సరాలు వివిధ హోదాలలో పనిచేసి, సూపరింటెండెంట్‌ ఇంజనీర్‌గా ఉద్యోగ విరమణ చేశాడు.

ఉమ్మడి రాష్ట్రంలో అనేక ప్రాజెక్టులను, ఎత్తిపోతల పథకాలను పరిశీలించాడు. ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు ఎందుకు మహబూబ్‌నగర్‌ జిల్లాను వివక్షకు గురి చేస్తున్నాయని చింతించేవాడు. ఆర్థిక వెనుకబాటుతో ఇతర ప్రాంతాలకు వెళ్లి చదువుకోకపోవడం వల్ల విధాన నిర్ణయాలను ప్రభావితం చేసేచోట జిల్లా ప్రజలు లేరని, అందువల్ల లోపల ఏం జరుగుతుందో మనకు తెలియడం లేదని అనేవాడు. రాజకీయ నాయకులకే పట్టింపు లేనప్పుడు మనం ఏం చేయగలమని బాధపడేవాడు. అయితే వారిని చైతన్యం చేస్తే మాట్లాడతారని ఆశపడ్డాడు. దీనికి ఎలిమినేటి మాధవరెడ్డి ఎత్తిపోతల పథకం విజయం కలిసి వచ్చింది. స్వయంగా తోటి ఇంజనీర్లతో కలిసి బస్సుల్లో ఎ.ఎం.ఆర్‌ పథకం పనితీరును జిల్లా రాజకీయ నాయకులకు చూపించాడు.


అప్పటికే మేము కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్‌ ఎత్తిపోతల పథకాలు చేపట్టాలని పార్టీలు, రాజకీయ నాయకులపై పోరాడుతూ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నాం. అయినా పదేళ్ల పాటు చిన్న రాయి కూడా వేయకుండా కేవలం శంకుస్థాపనల తంతు నడిపారు. చివరికి 2005లో పనులు ప్రారంభించి 2012 నాటికి కొంత మేర పూర్తి చేశారు. కృష్ణానది జలసాధన ఉద్యమంలోంచే తెలంగాణ ఉద్యమం పుట్టినా, తెలంగాణ ఏర్పడి పదేండ్లు దాటినా మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి జిల్లాలకు సాగునీటి న్యాయం దక్కనే లేదు. తెలంగాణలో ఏర్పడిన తొలి ప్రభుత్వం జల వివాదాలున్న నీటి ఎద్దడి ప్రాంతం కోసం కాక, కాళేశ్వరం చేపట్టి నిధులు అటు మళ్లించిందని రంగారెడ్డి ఆవేదన చెందాడు.


ఆయనను తీవ్రంగా కలచివేసిన విషయం... పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని 2013 ఆగస్టులో సాధించుకున్న 72 జీవోతో కాక, 2015 జూన్‌ 11న కేసీఆర్‌ విడుదల చేసిన 105 జీవోతో చేపట్టి, వంచించటం. ఇది సరి కాదని రామకృష్ణారెడ్డి, మల్లయ్య, రవీందర్‌రెడ్డి వంటి నిపుణులైన మహబూబ్‌నగర్‌ ఇంజనీర్లు ఎంత మొత్తుకున్నా కేసీఆర్‌ వినలేదు. ఏకపక్షంగా నిర్ణయం తీసుకుని అరకొర నిధులతో పనులు నానబెట్టారు. ఈ పనుల కోసం ఆయన రంగారెడ్డినే ఓఎస్డీగా నియమించాడు. కానీ, ఎప్పటికప్పుడు వాస్తవాలు తెల్పటాన్ని జీర్ణించుకోలేక, రెండోసారి ఆయన పదవీకాలాన్ని పొడిగించలేదు. మూడేళ్లలో పూర్తి కావలసిన పథకం ఇంకా మూలన పడి ఉన్నది. పనులు పూర్తి కాకుండానే ఒక పంపు నీరు దుంకించి మన జిల్లాను అవమానించాడని రంగన్న బాధపడ్డాడు. మహబూబ్‌నగర్‌ రిటైర్డ్‌ ఇంజనీర్ల ఫోరం ఏర్పడాలనే మా సంకల్పానికి సహకరించాడు.

పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి ఇన్‌టేక్‌ పాయింట్‌ను జూరాల నుంచి కాక శ్రీశైలానికి మార్చడంతోనే వివాదాలు చుట్టుకున్నాయి. శ్రీశైలం అంతర్రాష్ట్ర ప్రాజెక్టు కావటం వల్ల ఆంధ్రా అడ్డుకుంది. ఎ.ఎం.ఆర్‌, ఎస్‌.ఎల్‌.బి.సి నీరు తీసుకునే అవకాశం ఉన్నా, ఒకరిద్దరు స్వార్థపరులు పాలమూరు–డిండి అనే కొత్త పథకం ముందుకు తెచ్చారు. డిండి ఎత్తు పెంచి నార్లాపూర్‌ లేదా ఏదుల లేదా వట్టెం నుంచి నీరు తరలించుకుపోయే ప్రతిపాదన తెచ్చారు. దీనిపై జిల్లా ప్రజలు పెద్ద ఎత్తున పోరాడవలసి వచ్చింది. ఈ అంశంపై ప్రభుత్వానికి లేఖ రాయడానికి ఎమ్మెల్యేలను ఒప్పించడంలో రంగన్న పాత్ర ఉంది. కేసీఆర్‌ కూడా అసెంబ్లీలో ఆ ప్రతిపాదన ఉండదన్నారు. పాలమూరు పథకంలో చివరిదైన లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్‌ ఎందుకు చేపట్టలేదో రంగన్న వివరంగా చెప్పాడు. ప్రభుత్వం రియల్‌ ఎస్టేట్‌ లాబీ చేతిలో ఉందన్నాడు. బిఆర్‌ఎస్‌ ప్రభుత్వం పోయి కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చినా, భట్టి విక్రమార్క స్వయంగా హామీ ఇచ్చినా లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్‌ పనుల్లో చలనం లేదు.


అసలు మహబూబ్‌నగర్‌ సాగునీటి పథకాలు చాలా చిన్నవి. ఆర్డీఎస్‌ పథకం దెబ్బతినిపోయింది. సుంకేశుల ఆనకట్టను భారీగా నిర్మించారు కానీ, ఆర్టీఎస్‌ను వదిలేశారు. కోర్టు తీర్పు ప్రకారం ఇవ్వాల్సిన నీరు కూడా ఇవ్వడం లేదు. జూరాల నిర్వహణ సరిగా లేదు. కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్‌ పథకాల పంపుల సామర్థ్యం, కాలువల సామర్థ్యం, రిజర్వాయర్ల సామర్థ్యం చాలా చిన్నవి. వాటి స్థాయి మెరుగుదలకు ఏం చేయాలో కేసీఆర్‌ ఒక్కసారి కూడా సమీక్ష జరపలేదు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చినా ఏమీ చేయలేదు. ఒక ఇంజనీర్ల బృందంతో అధ్యయనం చేయించి వారి సూచనలు అమలు చేయాలని కోరినా ఎవరూ పట్టించుకోలేదు.

పాలమూరు–రంగారెడ్డి పథకానికి కేటాయించిన 90 టిఎంసిల నీటిని రెండు భాగాలుగా విభజించి, సగం నీటిని జూరాలకు వచ్చే తొలి వరద నుంచి, మిగతా సగం నీటిని శ్రీశైలం నుంచి తీసుకుని కల్వకుర్తి పథకంతో సమన్వయపరచి నిర్వహించాలని కోరాం. మన వాటా నీరు నిలుపుకోవడానికి వెల్టూరు–గొందిమల్ల గ్రామాల మధ్య జోగులాంబ రిజర్వాయర్‌ నిర్మించాలని కోరాం. అమ్రాబాద్‌కు చంద్రసాగర్‌ నుంచి కల్వకుర్తి పథకం నీరు తరలించాలని చెప్పాం. ఈ ప్రతిపాదనలన్నీ గొప్పగా ఉన్నాయి. మున్ముందు కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే సాధించుకోవచ్చేమో అని నల్లవెల్లి రంగారెడ్డి ఆశ పడ్డాడు. ఆయనను మహబూబ్‌నగర్‌ సాగునీటి పథకాల సలహాదారుగా 2024 మే 14న రేవంత్‌రెడ్డి ప్రభుత్వం నియమించింది. అయితే అనారోగ్యంతో బాధ్యతలు చేపట్టకుండానే మే 27న రంగన్న మరణించాడు. ఇంజనీర్‌ రఘురాంరెడ్డి, ఇతర మిత్రులు రంగన్న మరణం వారి కుటుంబానికి, బంధువులకు మాత్రమే కాదు ఎంతో కాలంగా మోసపోతున్న మహబూబ్‌నగర్‌ రైతాంగానికి నష్టం అని కంటతడి పెట్టుకున్నారు. పోరాడి తెలంగాణ సాధించుకున్నాం కానీ, జిల్లాకు నీరు సాధించుకోలేకపోయాం, ఇప్పుడైనా అవుతుందేమో అనుకుంటే ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది అని టీజేఏసి మాజీ చైర్మన్‌ జి. రాజేందర్‌రెడ్డి బాధపడ్డారు.


ఐదు దశాబ్దాల వృత్తి, ప్రవృత్తి జీవితానుభవంతో రంగారెడ్డి చివరికి ఒక ప్రతిపాదన చేశాడు. ఏటా వేల టిఎంసిల నీరు సముద్రం పాలవుతోంది. జూరాల ఎగువ నుంచి 200 టిఎంసిల నీరు తీసుకుని, నిలువ చేసుకునే వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటే మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి జిల్లాలు బాగుపడతాయి. నీరు లేనప్పుడు లెక్క ప్రకారమే వాడుకోవచ్చు. ఉన్నప్పుడు తీసుకోకపోవడం ప్రభుత్వాల అసమర్థత కాదా అన్నాడు. ఈ సవాలును స్వీకరించి నిజాయితీగా పనిచేసే శక్తి రాష్ట్ర ప్రభుత్వానికి ఎప్పటికైనా వస్తుందా? ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ విషయం మీద దృష్టి సారిస్తారా? రంగన్న ఆశలు, కలలు నెరవేరుతాయా?

ఎం. రాఘవాచారి

పాలమూరు అధ్యయన వేదిక

Updated Date - Dec 18 , 2024 | 02:07 AM