ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

రాజ్యాంగ ఉల్లంఘనలకు తెరపడుతుందా?

ABN, Publish Date - Aug 02 , 2024 | 02:13 AM

మూడున్నర, నాలుగు మాసాల్లో పదవీ విరమణ చేయబోతున్న భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ రెండు కీలకమైన వివాదాలను విచారణకు చేపట్టారు. ఇందులో ఒకటి– రాజ్యాంగం ఆర్టికల్ 110 దుర్వినియోగంపై...

మూడున్నర, నాలుగు మాసాల్లో పదవీ విరమణ చేయబోతున్న భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ రెండు కీలకమైన వివాదాలను విచారణకు చేపట్టారు. ఇందులో ఒకటి– రాజ్యాంగం ఆర్టికల్ 110 దుర్వినియోగంపై దాఖలైన పిటిషన్లను ఏడుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనానికి నివేదించాలని తీసుకున్న నిర్ణయం. రెండవది రాష్ట్రాల గవర్నర్లకు కోర్టు కేసుల నుంచి రక్షణ కల్పిస్తున్న రాజ్యాంగ అధికరణ 361ను సమీక్షించాలని సంకల్పించడం.

ఎవరు అధికారంలోకి వచ్చినా రాజ్యాంగానికి లోబడి పాలించాలి. తాము మాత్రం ఇందుకు అతీతులమని బీజేపీ పాలకులు భావిస్తుంటారు. వివాదాస్పద బిల్లులను ద్రవ్య బిల్లుల (మనీ బిల్లు) మార్గంలో (ఆర్టికల్ 110 దారిలో) ఆమోదింప చేసుకునే జబర్దస్తీ పద్ధతిని బీజేపీ పాలకులు ఎంచుకొని చాలాకాలమైంది. ఆధార్ కార్డు బిల్లుకు ఈ విధంగానే పార్లమెంట్ అనుమతిని సాధించారు. అయితే ఇది ఇప్పుడు వివాదంలో కూరుకున్నది. మనీ బిల్లు లేదా ఆర్టికల్ 110 నిజానికి ప్రభుత్వ ధనసేకరణ, ఖర్చులకు మాత్రమే పరిమితమైనది. ఈ మనీ బిల్లు రాష్ట్రపతి, స్పీకర్ అదుపాజ్ఞలలో కేవలం లోక్‌సభ ఆమోదంతో శాసన రూపం ధరిస్తుంది. ఈ అంశాలతో ఏ మాత్రం సంబంధం లేని వివాదాస్పద ఆధార్ బిల్లును మనీ బిల్లుగా పరిగణింపజేసి చట్టం చేయించుకోడం రాజ్యాంగానికి తీవ్ర అపరాధం. బీజేపీకి రాజ్యసభలో ఇప్పటికీ మెజారిటీ సిద్ధించలేదు. అందుచేత మనీ బిల్లు మార్గాన్ని మళ్ళీ దుర్వినియోగం చేయగలరనే భయాలు కొనసాగుతున్నాయి. 2024–25 కేంద్ర బడ్జెట్ ప్రవేశపెడుతున్నందున మనీ బిల్లు మార్గం మళ్ళీ దురుపయోగం కావొచ్చుననే భయాన్ని వ్యక్తం చేస్తూ ఇటీవల సీనియర్ అడ్వకేట్లు కపిల్ సిబల్, అభిషేక్ మను సింఘ్వి, ఇందిరా జైసింగ్‌లు సిజెఐని ఆశ్రయించారు. ఆధార్‌ను ఆసరా చేసుకొని పంపిణీ చేస్తున్న సబ్సిడీలు సంఘటిత నిధి నుంచి తీసుకొంటున్నందున ఆధార్ బిల్లు మనీ బిల్లు కిందికే వస్తుందని కేంద్రం బుకాయించింది. అయితే ఆధార్ బిల్లుకు మనీ బిల్లు హోదా కల్పించి చట్టం చేయించుకోడాన్ని 4-1 మెజారిటీ తీర్పుతో 2018లో సుప్రీంకోర్టు ధ్రువీకరించింది.


అసమ్మతి తీర్పు చెప్పిన ఏకైక న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ దానిని రాజ్యాంగ విరుద్ధ చర్యగా పేర్కొన్నారు. ఆధార్ బిల్లులో మన స్వేచ్ఛలను అరికట్టే అంశాలున్నాయని అన్నారు. సాధారణ బిల్లును మనీ బిల్లు మార్గంలో చట్టం చేయించుకోడం శాసన నిర్మాణంలో రాజ్యసభ పాత్రను పరిమితం చేయడమే అవుతుందనీ పేర్కొన్నారు. వాస్తవానికి ఈ వివాదంపై ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం సిఫార్సు మేరకు ఏడుగురు జడ్జీల ధర్మాసనం నియామక నిర్ణయం ఎప్పుడో జరిగిపోయింది. ఈ ముడిని పూర్తిగా విప్పే వైపుగా సిజెఐ హోదాలో చంద్రచూడ్ ఇప్పుడు కీలక నిర్ణయం తీసుకున్నారు.

ఈ పద్ధతిని సవాలు చేస్తున్న పిటిషన్లను రాజ్యాంగ ధర్మాసనం వచ్చే అక్టోబర్‌లో విచారణకు చేపడుతుందని ప్రకటించారు. చంద్రచూడ్ చేసిన ప్రకటనను కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జై రామ్ రమేష్ స్వాగతించారు. గత పదేళ్లలో చాలా బిల్లులను మనీ బిల్లుల పేరిట ఆర్టికల్ 110 ద్వారా బుల్డోజ్ చేశారన్నారు. వచ్చే నవంబర్‌లో తాను రిటైర్ అయ్యేలోగానే దీనిపై చంద్రచూడ్ స్పష్టమైన అంతిమతీర్పును ప్రకటించాలని జైరాం రమేష్ కోరారు.


సుప్రీంకోర్టు నుంచి చంద్రచూడ్ ఇచ్చిన తీర్పుల్లో ప్రముఖమైనది వ్యక్తి గోప్యత హక్కుకు సంబంధించినది. ఇది రాజ్యాంగం హామీ ఇస్తున్న హక్కు అని, వ్యక్తికి వ్యక్తిగత గోప్యత హక్కు ద్వారానే ఆత్మ గౌరవం, స్వేచ్ఛ స్వాతంత్ర్యాలు లభిస్తాయని జస్టిస్ కెఎస్ పుట్టస్వామి, ఎఎన్అర్ వెర్సెస్ భారత యూనియన్ కేసులో స్పష్టం చేశారు. ఈ తీర్పు ఫ్యూడల్ సమాజ దుర్మార్గ విలువల పట్టును బద్దలు గొట్టి సమాజంలో వ్యక్తి గౌరవానికి పట్టం కట్టింది. ఈ తీర్పుతోనే తొమ్మిది మంది న్యాయమూర్తుల విస్త్తృత ధర్మాసనం పౌరుల వ్యక్తిగత గోప్యతా హక్కును రాజ్యాంగం 21 అధికరణ కింద ప్రాథమిక హక్కుల్లో చేర్చింది. పరస్పర సమ్మతితో సాగే స్వలింగ సంపర్కానికి ఆమోద ముద్ర వేసి మానవ సంబంధాల్లో విప్లవాత్మక మార్పును చంద్రచూడ్ ఆవిష్కరించారు. బ్రిటిష్ హయాంలో శిక్షాస్మృతిలో చేర్చిన 377 సెక్షన్ కోరలను పెకిలించారు. స్వలింగ సంపర్క హక్కును నిరాకరించడం వ్యక్తి గోప్యత హక్కును ఉల్లంఘించడమేనని స్పష్టం చేశారు. సైన్యంలో మహిళలకు పురుషులతో సమానంగా పూర్తి స్థాయి సైనిక బాధ్యతలు అప్పగించాలని ఇచ్చిన మరో తీర్పు సైతం చరిత్రాత్మకమైనదే. ఇలా చంద్రచూడ్ తన పదవీకాలంలో న్యాయవ్యవస్థకు మరింత సునిశితమైన మానవీయ చూపును కల్పించారు. మహిళకు తన శరీరంపై పూర్తి అధికారం ఉండాలని చెబుతూ ఆమె తాను ధరించిన గర్భం వద్దనుకుంటే 20-–24 వారాల పిండాన్ని కూడా తొలగింపజేసుకోవచ్చని తీర్పు ఇచ్చారు. ఎన్నికల ప్రక్రియకు అపూర్వ స్థాయిలో కార్పొరేట్ ధన కాలుష్యాన్ని చేర్చిన ఎలక్టోరల్ బాండ్ల పద్ధతి గుట్టు రట్టు చేసి దానికి తెరదించారు. ఇప్పుడు మనీ బిల్లు మార్గం దురాక్రమణను కూడా అరికట్టిస్తారని చంద్రచూడ్‌పై ఆశలు పెట్టుకోడం సహజం.


రాష్ట్రాల గవర్నర్లపై కేసులు పెట్టకుండా నిరోధించడం తగదంటూ దాఖలైన పిటిషన్ కూడా ఎంతో ముఖ్యమైనది. రాష్ట్రపతి, గవర్నర్లు పదవిలో ఉన్నంతకాలం వారిపై ఎటువంటి కోర్టు కేసులు పెట్టరాదని ఆర్టికల్ 361(2) నిర్దేశిస్తున్నది. గత పదేళ్లలో ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల గవర్నర్లు ఇష్టావిలాసంగా రాజకీయ విమర్శలు చేసి అక్కడి ప్రభుత్వాలను ఇరకాటంలో పెట్టిన సంగతి తెలిసిందే. ఈ ధోరణి ఇంకా కొనసాగుతున్నది. ప్రతిపక్ష రాష్ట్రాల్లో ప్రభుత్వాలు శాసనసభలో ఆమోదింప జేసుకున్న బిల్లులకు మాసాలు, ఏళ్ల తరబడిగా ఆమోదం తెలపకుండా రాజ్‌భవన్‌లు కోల్డ్ స్టోరేజ్‌లో ఉంచాయి. కేరళ, తమిళనాడు వంటి రాష్ట్రాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. తమిళనాడు గవర్నరు ఎన్.రవి రాజ్యాంగ విరుద్ధ ప్రవర్తన పట్ల చంద్రచూడ్ సారథ్యంలోని ధర్మాసనం మొన్న మార్చి నెలలోనే తీవ్ర అభ్యంతరం తెలిపింది. ఆయన రాజ్యాంగాన్ని ఉల్లంఘించి మాట్లాడుతుంటే మేము కళ్ళు మూసుకొని కూర్చోవాలా అని చంద్రచూడ్ ప్రశ్నించారు. డిఎంకె నాయకుడు కె.పొన్ముడి శిక్షపై సుప్రీంకోర్టు స్టే విధించిన తర్వాత ముఖ్యమంత్రి స్టాలిన్ సిఫార్సు మీదట ఆయన చేత తిరిగి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించడానికి గవర్నర్ నిరాకరించడాన్ని సిజెఐ తప్పుపట్టారు. ఆయన సుప్రీంకోర్టునే ధిక్కరిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఒకరోజులో పొన్ముడి చేత పదవీ ప్రమాణ స్వీకారం చేయించాలని అల్టిమేటమ్ ఇచ్చారు.

గవర్నర్లు దారి తప్పి రాష్ట్ర ప్రభుత్వాల పాలనను అడ్డుకుంటున్నప్పుడు వారిని సరి చేయించాల్సిన బాధ్యత గల కేంద్ర పాలకులు నిమ్మకు నీరెత్తినట్టు కూచుంటున్నారు. పైపెచ్చు అలా ప్రవర్తించడంలో అగ్రేసరులు అనిపించుకొంటున్న గవర్నర్లకు మరింత ఉన్నత పదవులిచ్చి గౌరవిస్తున్నారు. తనను రాజ్‌భవన్‌లోనే లైంగికంగా వేధించారని పశ్చిమ బెంగాల్ గవర్నర్ సివి ఆనంద బోస్ మీద ఇటీవల ఒక మహిళ చేసిన ఆరోపణ తెలిసిందే.


దీనిపై విచారణ జరిపి న్యాయం ప్రసాదించవలసిందిగా కోరుతూ ఆమె సుప్రీంకోర్టుకు ఎక్కారు. సిజెఐ చంద్రచూడ్ సారథ్యంలో ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం ఏర్పాటైంది. గవర్నర్లు కోర్టు కేసుల నుంచి రాజ్యాంగం 361(2)ద్వారా పొందుతున్న పూర్తి రక్షణ ఉచితానుచితాల నిగ్గు తేల్చాలంటూ ఆ మహిళ అర్థించారు. దీనిని మన్నించిన ధర్మాసనం ఇప్పుడు ఆర్టికల్ 361(2) మంచి చెడ్డలపై దృష్టి సారించింది.

రాజ్యాంగ అధికరణ 110 దుర్వినియోగానికి తెరదించడం, గవర్నర్ల 361(2) కవచాన్ని తొలగించడం నేటి అవసరం. మొన్నటి లోక్‌సభ ఎన్నికల్లో రాజ్యాంగంపై జరిగిన చర్చకు దీనివల్ల సార్థకత కలుగుతుంది.

జి. శ్రీరామమూర్తి

సీనియర్‌ జర్నలిస్ట్‌

Updated Date - Aug 02 , 2024 | 02:13 AM

Advertising
Advertising
<