జీవో 117 రద్దుతోనే ప్రాథమిక విద్యకు ప్రాణం
ABN, Publish Date - Jul 11 , 2024 | 02:06 AM
విద్యా సంస్కరణల్లో భాగంగా ఏర్పాటయిన విద్య కమిషన్‌ల నివేదికలలో ప్రాథమిక విద్య ఒకటి నుంచి ఐదవ తరగతి వరకు ప్రతి పల్లెలోనూ; మూడు కిలోమీటర్ల పరిధిలో ప్రాథమికోన్నత...
విద్యా సంస్కరణల్లో భాగంగా ఏర్పాటయిన విద్య కమిషన్‌ల నివేదికలలో ప్రాథమిక విద్య ఒకటి నుంచి ఐదవ తరగతి వరకు ప్రతి పల్లెలోనూ; మూడు కిలోమీటర్ల పరిధిలో ప్రాథమికోన్నత; ఐదు కిలోమీటర్ల పరిధిలో ఉన్నత పాఠశాలలు అనతికాలం నుంచి నడుస్తున్నాయి. కానీ విద్యా సంస్కరణల పేరుతో తెచ్చిన జీవో 117తో ప్రాథమిక విద్య నిట్టనిలువుగా చీలింది. ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు కూడా సబ్జెక్టు నిపుణుల బోధన ఉండాలని, ఆంగ్ల విద్యను బలోపేతం చేయాలని విలీన విధానాన్ని తీసుకొచ్చి ఉన్నత పాఠశాలల్లో 3,4,5 తరగతుల విలీనం చేశారు. అక్కడి నుంచే ప్రాథమిక విద్య విచ్ఛిన్నానికి దారితీసింది. ఈ ప్రక్రియను నిరసిస్తూ పలు ప్రాంతాల్లో తల్లిదండ్రులు ధర్నాలు, నిరసనలు చేసినా ఫలితం లేకుండా పోయింది. దీంతో ప్రజలు చేసేదేమీ లేక తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల నుండి ప్రైవేటుకు మళ్ళించాల్సిన పరిస్థితి వచ్చింది.
ప్రాథమిక స్థాయి విద్యార్థులకు స్కూల్ అసిస్టెంట్ల స్థాయి ఉపాధ్యాయులు బోధించడంతో ఆశించిన స్థాయిలో విద్యా లక్ష్యాలను చేరలేదు. దీంతోపాటు ఇతర గ్రామాల నుంచి వేరే గ్రామాలకు వెళ్లి చదవాల్సిన పరిస్థితి ఏర్పడడంతో డ్రాపౌట్లు పెరగడంతో పాటు క్రమం తప్పకుండా పాఠశాలలకు వెళ్లే విద్యార్థుల సంఖ్య తగ్గిపోయింది. తల్లిదండ్రులు ప్రైవేటు పాఠశాలలకు తమ పిల్లలను పంపడంతో ప్రభుత్వ పాఠశాలల్లో ప్రాథమిక స్థాయి విద్యార్థుల సంఖ్య తగ్గిపోయింది. సంస్కరణలు అంటే ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి వెళ్ళాలి తప్ప, తిరోగమనం చెందకూడదన్న ప్రాథమిక సిద్ధాంతం పాఠశాలల విలీనంతో కనుమరుగయ్యింది.
117 జీవో ఉన్నత పాఠశాలలపై కూడా ప్రభావం చూపింది. ఉపాధ్యాయులపై 42 పీరియడ్ల తీవ్రమైన పని భారం పెరగడం వల్ల ఉన్నత తరగతుల విద్యార్థులకు కూడా న్యాయం జరగలేదు. అంతేకాకుండా ఉన్నత పాఠశాలల విద్యార్థుల నమోదు 93 కంటే తక్కువ ఉంటే ప్రధానోపాధ్యాయ, వ్యాయామ ఉపాధ్యాయ పోస్టులు రద్దు, 137 మంది కంటే తక్కువ ఉంటే విలీన ఉన్నత పాఠశాలలో సైతం వ్యాయామ, ప్రధానోపాధ్యాయ పోస్టులను తీసేయడంతో ఉన్నత పాఠశాల విద్య అతలాకుతలమయింది. పీజీ, బీఈడీ స్థాయి అర్హతలు ఉన్న స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయులు 3,4,5 తరగతులకు బోధించడంలో తికమకకు గురికావడం వల్ల సాధించాలన్న లక్ష్యాలు అధః పాతాళంలోకి వెళ్లాయి.
ఇప్పుడు ప్రభుత్వం మారింది. దీంతో జీవో 117 రద్దు చేసి పాఠశాలల విలీనం విధానాన్ని ఆపివేసి, ప్రాథమిక విద్య 5వ తరగతి వరకు ఉన్న ఊరిలోనే చదువుకునేలా చర్యలు చేపట్టాల్సి ఉంది. కొత్త విద్యా సంవత్సరంలో ప్రాథమిక పాఠశాలల్లోనే 3వ తరగతి కొనసాగేందుకు వెంటనే ఆదేశాలు ఇవ్వాలి. ప్రాథమిక స్థాయిలో టిటిసి స్థాయి ఉపాధ్యాయులే బోధించేలా, స్కూల్ అసిస్టెంట్ బోధన పీరియడ్లు వారానికి 32 గరిష్ఠంగా ఉండేలా, ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు 1,3,5 కిలోమీటర్ల పరిధిలో ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. సమాంతరంగా తెలుగు మాధ్యమాన్ని ప్రవేశపెట్టాలి. రేషనలైజేషన్ విధానాన్ని కూడా సమీక్షించాలి. గతంలాగా ఉన్నత పాఠశాలల్లో పనివేళలు ఉదయం 10 నుంచి సాయంత్రం 4:30 వరకు ఉండేలా మార్పు చేయాలి. ఈ చర్యలన్నీ అమలు అయితే ప్రాథమిక, ఉన్నత విద్య గాడిన పడుతుంది.
సివి ప్రసాద్,
రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ, ఏపీటీఎఫ్
Updated Date - Jul 11 , 2024 | 02:06 AM