ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

అవును, ఉద్యమాలు అంతరించిపోకూడదు!

ABN, Publish Date - Oct 18 , 2024 | 02:48 AM

ప్రభుత్వాలకు, నిర్బంధంతో ఉద్యమాలని నిర్మూలించడం సాధ్యం కాదనే విషయాన్ని, కె. శ్రీనివాస్ రాసిన ‘సందర్భం’, బలమైన తర్కంతో, ఉత్తమ సహృదయంతో, శక్తివంతమైన శైలిలో, అనేక కోణాల్లో...

ప్రభుత్వాలకు, నిర్బంధంతో ఉద్యమాలని నిర్మూలించడం సాధ్యం కాదనే విషయాన్ని, కె. శ్రీనివాస్ రాసిన ‘సందర్భం’, బలమైన తర్కంతో, ఉత్తమ సహృదయంతో, శక్తివంతమైన శైలిలో, అనేక కోణాల్లో, వుంది! (ఆంధ్రజ్యోతి, అక్టోబరు 10). మావోయిస్టులు కూడా ‘వివేచన’తో, ‘(స్వయం) విమర్శ’తో సమీక్షించుకుంటే తప్ప, ‘ఉనికి సాధ్యం కాదని’ చేసిన సూచన కూడా సరైనదే. అయితే, ఒక చిన్న వివరణ అవసరం: ‘సందర్భం’లో ప్రస్తావించిన ఇతర ఉద్యమాలు– కాశ్మీరు, శ్రీలంక, నాగాలాండ్, మణిపూర్, ఖలిస్తాన్ వంటివి– శ్రామిక వర్గపోరాట ఉద్యమాలు కావు. వారు కోరుకునే పాలనలో, లాభాలూ, వడ్డీలూ, కౌళ్ళూ వంటి ‘దోపిడీ ఆదాయాలు’ సురక్షితంగా వుండేవే! అవి అలా ఉండాలనే! కమ్యూనిస్టు సిద్ధాంతాన్ని అనుసరించే ఉద్యమం అలాంటి తప్పుడు ఆదాయాలకి వ్యతిరేకం! మిగతా ఉద్యమాలు ‘శ్రమ దోపిడీ’కి వ్యతిరేకం కానివి.


ఈ ‘సందర్భం’ చదవగానే, ఇదే సమస్య మీద కొన్ని విషయాలు రాయాలనిపించింది నాకు. నిజానికి ఇక్కడ రాయబోయే విషయాలు కొత్తవేమీ కాదు. 2000 సంవత్సరంలో, పీపుల్స్‌వార్ పార్టీ వారు రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలన్నప్పుడూ, 2005లో ‘మళ్ళీ చర్చ’లన్నప్పుడూ, ఆ తర్వాత ఎన్నో ఎన్‌కౌంటర్లు జరిగినప్పుడూ, నేను రాసిన కొన్ని వ్యాసాల్లో చెప్పినవే, ఇప్పుడు చెప్పబోయేవి! అసలు, అవి ఆనాడు నా స్వంతం కాదు సుమా! శ్రామిక ఉద్యమాల విషయాలలో, కమ్యూనిస్టులు ఏ రకపు అవగాహనతో వుండాలో, మార్క్సూ–ఎంగెల్సులు చెప్పిన సూచనలనే, నేను తెలుసుకున్న వాటిని, గుర్తు చేశాను. ఇప్పుడు, దండకారణ్యంలోని మావోయిస్టులు గానీ, మైదాన ప్రాంతాల్లో పనిచేస్తున్న ఇతర కమ్యూనిస్టు గ్రూపుల వారు గానీ, ఆలోచించవలిసిన సూచనలు కొన్ని వున్నాయి:


(1) 1871లో, ‘పారిస్ కమ్యూన్’ పోరాటాన్ని, అక్కడి పాలకవర్గాలు రక్తపుటేరుల్లో ముంచినప్పుడు, మార్క్సు ఒక విషయం చెపుతాడు. ‘వర్గ పోరాటంలో, శ్రామికవర్గం వివిధ దశల గుండా నడవాలనీ’, ‘మరల మరల ఎదురు దెబ్బలూ, అడ్డంకులూ కలుగుతాయనీ’– అంటాడు. కాబట్టి, శ్రామికవర్గపు ప్రతినిధులుగా కమ్యూనిస్టులు కూడా, ఎంతటి క్రూర నిర్బంధాలు వున్నా నిలబడ్డారు, నిలబడతారు! (2) ‘సోషలిజం అనేది ఒక సైన్స్’ అయిందనీ, దానిని సైన్స్‌గా అధ్యయనం చేసి, కార్మిక జనాలలో వ్యాపింపజేయడం నాయకుల కర్తవ్యం అనీ, ఎంగెల్సు తన కాలపు కమ్యూనిస్టులకు చేసిన సూచన నించీ ఇప్పటి కమ్యూనిస్టులు నేర్చుకోవాలి! వాళ్ళు నేర్చుకుంటేనే, దానిని, వర్గచైతన్యం లేని శ్రామిక జనాలకు నేర్పగలరు. మార్క్సు ఒక చోట చెప్పినట్టు, ‘నేర్పేవాడు తప్పనిసరిగా నేర్చుకు తీరాలి’. (‘ఎడ్యుకేటర్ మస్ట్ బి ఎడ్యుకేటెడ్’). ‘కాపిటల్’ వంటి శ్రామికవర్గ సిద్ధాంత రచనను, అన్ని భాషలలోకీ అనువదించి వ్యాప్తి చెయ్యాలని, ఆనాటి ‘అంతర్జాతీయ కార్మిక సంస్థ’ చేసిన తీర్మానాన్ని గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే, సిద్ధాంతం అనేది, జనాలకు అర్థమైతే, అది ఒక భౌతిక శక్తిగా మారుతుందంటాడు మార్క్సు.


(3) వర్గ చైతన్యం లేని శ్రామిక జనాలకు, అతి కొద్దిమంది చైతన్యవంతులైన వారు మాత్రమే నాయకత్వం వహించి విప్లవ పోరాటాలు చేసే కాలం గతించిందనీ, శ్రామికజనాలు తమంతట తాము వర్గపోరాటాలలో వుండితీరాలనీ, తన కాలపు ‘అరాచకవాద’ ఉద్యమకారులను ఉద్దేశించి, ఎంగెల్సు చెప్పిన మాటలు తమకు ఎంతవరకూ వర్తిస్తాయో ఉద్యమాలలో వున్న కమ్యూనిస్టులు స్వయం విమర్శ చేసుకోవాలి. (4) దళాలు చేసే ఆకస్మిక దాడుల్నే విప్లవ కార్యాచరణగా భ్రమించకూడదు. శతృవు మీద కొన్ని దాడులు చేసి, విప్లవోద్యమం ‘శరవేగం’తో పురోగమిస్తున్నదని భ్రమించకూడదు. (5) సిద్ధాంత గ్న్యానం లేకుండా, మిలిటెన్సీ పేరుతో, దూకుడుగా వుండేవారిని పార్టీలలో చేర్చుకుంటే, వాళ్ళు పార్టీకే హాని చేసిన సందర్బాలు వున్నాయి. అనుభవాలనించీ నేర్చుకోవాలి. నయీం, కత్తుల సమ్మయ్య, జడల నాగరాజు, వంటి వారి ఉదంతాలను ఎన్నో చదివాం, వార్తల్లో అప్పట్లో. (6) తగిన జాగ్రత్తలు తీసుకోవాలే గానీ, ఇన్ఫార్లనే అనుమానంతో, తోటివారినో, సాధారణ ప్రజలనో, చిత్రవధలు చేయడం, చంపడం జరగకూడదు. ఒంటరిగా కనిపించే పోలీసుల్నో, పాలకవర్గ ప్రతినిధుల్నో, వర్గ శతృవు అనే పేరుతో కిడ్నాప్ చేయడం, ‘ఖతం’ చేయడం వంటి కార్యక్రమాలు ఉండకూడదు! ‘నూతన సమాజం’ కోసం పనిచేస్తున్నామని చెప్పుకునే కమ్యూనిస్టులు చెయ్యాల్సిన పనులు కావు అవి. అనాదిగా, పాలకవర్గాలూ, వాటి ప్రభుత్వ బలగాలూ చేస్తున్న క్రూర చర్యల వంటివే అవి.


(7) దేశంలో, వ్యవసాయ రంగంలో, పరిశ్రమలలో, రవాణా రంగంలో, కోట్లాది మంది శ్రామిక జనాలకు వర్గ సంఘాలు (‘క్లాస్ ఆర్గనైజేషన్స్’) లేవు. అలాగే, వేరు వేరు స్తితిగతుల నించీ వచ్చే స్త్రీలూ, విద్యార్థులూ, టీచర్లూ, ప్రభుత్వ ఉద్యోగులూ వంటి వారిని ప్రజా సంఘాలలోకి (‘మాస్ ఆర్గనైజేషన్స్’) సమీకరించడం చాలా అవసరం! అవేవీ సరిగా లేకపోవడం వల్ల, బూటకపు ఎన్‌కౌంటర్లు ఎన్ని జరిగినా, ప్రజలకి పట్టడం లేదు. (8) శ్రీనివాస్ గారు శ్రామిక వర్గ ఉద్యమకారుల్ని ‘అస్త్ర సన్యాసం’ చెయ్యమని చెప్పడం లేదు. ఉద్యమాలు నడపవలిసిందే! కొందరు చెపుతున్నట్టు, దోపిడీ రాజ్యాంగ ఎన్నికల నాటకాలు, వర్గ ఉద్యమకారులకు మార్గం కాదు. కానీ, ‘సాయుధ పోరాటమే ఏకైక మార్గం’ అనే యాంత్రిక అవగాహనతో, ‘ఉన్నదొక్కటే దారి! చారూమజుందారీ’ అన్నట్టు తక్షణ కార్యక్రమాలు ఉండకూడదు. కార్మిక వర్గం, సంస్తాపరంగా పురోగమించి వుండకపోతే, పాలకవర్గాల రాజకీయ అధికారానికి వ్యతిరేకంగా కార్మికులలో నిరంతరం ప్రచారం చేస్తూ, వారికి శిక్షణ ఇచ్చితీరాలనీ, లేకపోతే, వారు పాలకవర్గాల చేతిలో ఆటవస్తువులుగా మారతారని, గతంలో, కార్మిక వర్గ నాయకులకు మార్క్సు చేసిన సూచనను ఏ క్షణమూ మరిచిపోకూడదు!

రంగనాయకమ్మ

Updated Date - Oct 18 , 2024 | 02:48 AM