ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఉద్యోగ శిక్షణతో యువత సాధికారత

ABN, Publish Date - Oct 25 , 2024 | 02:55 AM

భారత్‌లోని ఒక తృతీయ శ్రేణి నగరంలో– రాష్ట్ర విశ్వవిద్యాలయానికి చెందిన కళాశాల నుంచి రీనా అనే అమ్మాయి కామర్స్‌లో డిగ్రీ చేసింది. ఆమె చదువుకున్న కాలేజీలో ప్లేస్‌మెంట్ సెల్ లేదు. విద్యార్థినిగా అత్యుత్తమ ప్రతిభ కనబరిచినప్పటికీ...

భారత్‌లోని ఒక తృతీయ శ్రేణి నగరంలో– రాష్ట్ర విశ్వవిద్యాలయానికి చెందిన కళాశాల నుంచి రీనా అనే అమ్మాయి కామర్స్‌లో డిగ్రీ చేసింది. ఆమె చదువుకున్న కాలేజీలో ప్లేస్‌మెంట్ సెల్ లేదు. విద్యార్థినిగా అత్యుత్తమ ప్రతిభ కనబరిచినప్పటికీ చదువు పూర్తయిన తర్వాత ఆమెకు లభించే అవకాశాలు స్వల్పం. ప్రభుత్వ ఉద్యోగ పరీక్షలకు సిద్ధం కావడం, ఇరుగుపొరుగున ఉన్న పాఠశాలలో ఉపాధ్యాయినిగా పనిచేయడం (దీనిపై ఆమెకు ఆసక్తి ఉండవచ్చు, లేకపోవచ్చు) లేదా పెళ్లి చేసుకోవడం లాంటి వాటికి ఆమె పరిమితమైపోతుంది. ఇలా దేశవ్యాప్తంగా ఉన్న యువతలో మూడింట ఒక వంతు మంది (15 నుంచి 29 ఏళ్ల మధ్య వయసున్నవారు. వీరిలో సగానికి కంటే ఎక్కువ మంది అమ్మాయిలే) చదువు, ఉద్యోగం, శిక్షణకు దూరంగా ఉన్నారు. ఇప్పటికీ మన దేశంలోని యువత అధిక భాగం ప్రైవేటు సంస్థల్లో నియామకాలకు అందనంత దూరంలోనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇటీవలే ప్రారంభించిన పీఎం ఇంటర్న్‌షిప్ పథకం(పీఎంఐఎస్) మార్కెట్ –ఆధారిత, యువత–కేంద్రీకృత పరిష్కారాన్ని అందిస్తుంది. ఇది యువత సాధికారతను సాధించేందుకు ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతను తెలియజేస్తుంది.


నిర్దేశిత వయసుకు చెందిన కొంతమంది యువతకు 500 కంపెనీల్లో 12 నెలలపాటు ఇంటర్న్‌షిప్ చేసేందుకు పీఎంఐఎస్ అవకాశాన్ని కల్పిస్తోంది. 21 నుంచి 24 ఏళ్ల మధ్య వయసు, అల్పాదాయ కుటుంబాలకు చెందినవారు, మెట్రిక్యులేషన్ నుంచి గ్రాడ్యుయేషన్ (ఐఐటీ గ్రాడ్యుయేట్లు, సీఏలు తదితరులను మినహాయించి) పూర్తి చేసినవారు ఈ పథకానికి అర్హులు. దీని ద్వారా నెలకు రూ.5000 స్టైఫండ్ లభిస్తుంది. ఈ మొత్తాన్ని ప్రభుత్వం (రూ.4,500), సంబంధిత సంస్థ (రూ.500) సంయుక్తంగా అందిస్తాయి. అలాగే ఇతర ఖర్చుల కోసం అదనంగా మరో రూ.6,000 లభిస్తుంది. ప్రయోగాత్మక దశలో భాగంగా 2024 ఏడాదికి గాను 1.25 లక్షల మందికి ప్రయోజనం చేకూర్చాలని, అయిదేళ్లలో కోటి మందికి ఇంటర్న్‌షిప్ అందించాలని లక్ష్యంగా నిర్దేశించారు. దీని కోసం సంస్థలు తమ సీఎస్‌ఆర్ (కార్పొరేట్‌ సోషియల్‌ రెస్పాన్సిబిలిటీ కార్పొరేట్‌ సామాజిక బాధ్యత) నిధులను ఖర్చు చేసుకోవచ్చు.


ఇంటర్న్‌షిప్‌ – ఇటు ఉద్యోగార్థులకూ, అటు యాజమాన్యాలకూ పరస్పర ప్రయోజనాన్ని కలిగించేదిగా అనేక అధ్యయనాల్లో తేలింది. పని ఆధారిత అభ్యాస ప్రాధాన్యాన్ని విద్యా పరిశోధకులు, ఆ రంగానికి చెందిన శాస్త్రవేత్తలు గుర్తించారు. డేవిడ్ కోల్బ్స్‌, జాన్ డ్యూయి, కర్ట్ లూయిస్ సహా పలువురు పండితులు ఈ అంశంపై విస్తృతంగా అధ్యయనం చేశారు. పనిచేస్తూ నేర్చుకోవడం శ్రామికశక్తిని తయారు చేయడానికి ఉపకరించే ముఖ్య సాధనంగా అంతర్జాతీయ పరిశోధనల్లో తేలింది. భావవ్యక్తీకరణ, సహకారం, సృజనాత్మకత, నిర్ణయాత్మక ఆలోచనలను ఇంటర్న్‌షిప్‌లు మెరుగుపరుస్తాయి.

పీఎంఐఎస్ ద్వారా లభించే ఇంటర్న్‌షిప్– ఒక అవకాశాన్ని కల్పించేదిగా మాత్రమే కాకుండా, యువ ఔత్సాహికుల్లో గొప్ప మార్పును తెస్తుంది. కార్పొరేట్ ప్రపంచంలోని వాస్తవ పని విధానం అనుభవంలోకి వస్తుంది. ఇందుకు భిన్నంగా కళాశాలల్లో విద్యా బోధన నిర్మాణాత్మకంగానూ, స్థిరంగానూ ఉంటుంది. ఇంటర్న్‌షిప్ ద్వారా వారికి సరిపోయే కెరీర్ మార్గాన్ని గుర్తించి, అభివృద్ధి చేయడంతో పాటు బాధ్యతల నిర్వహణ, సమస్య–పరిష్కారం, నిర్ణయం తీసుకోవడం, సంఘటితంగా పనిచేయడం, సమయపాలనలో సైతం శిక్షణ పొందవచ్చు. ప్రతిభ, నిజాయితీ, అంకితభావం ఉన్నా, చిన్న పట్టణాలు, గ్రామాల నుంచి వచ్చేవారు ఉద్యోగాల్లో ప్రవేశించడానికి తొలినాళ్లలో పడే ఇబ్బందులను ఇంటర్న్‌షిప్‌లు తొలగిస్తాయి. ఇంగ్లీషులో సంభాషణా నైపుణ్యాలు, ఈ–మెయిల్ సంప్రదాయాలు, కంప్యూటర్ ఉపయోగించడం, ఎంఎస్ ఆఫీస్‌లో ప్రావీణ్యం లేదా ఇంటర్నెట్‌లో విశ్వసనీయ సమాచారాన్ని శోధించే ప్రాథమిక నైపుణ్యాలను వారు నేర్చుకుంటారు. భారతదేశంలోని ప్రముఖ విద్యాసంస్థలు, వృత్తిపరమైన కోర్సుల్లో ప్రవేశించేందుకు ఇంటర్న్‌షిప్ చేయడం తప్పనిసరి. కానీ కొన్ని రాష్ట్ర విశ్వవిద్యాలయాలు, అంతగా ప్రాధాన్యం లేని కళాశాలల్లో కెరీర్ కౌన్సెలింగ్, జాబ్– ఆధారిత వ్యవస్థ లేకపోవడం వల్ల ఇంటర్న్‌షిప్ చేసే అవకాశం ఎక్కువ శాతం యువతకు దక్కడం లేదు. పీఎంఐఎస్ ద్వారా పెద్ద మొత్తంలో లభించే ఇంటర్న్‌షిప్ సదుపాయాలు మెట్రోయేతర నగరాల్లోని యువతకు సమాన అవకాశాలు అందేలా చేసి ఉద్యోగావకాశాలను మెరుగుపరుస్తాయి. వ్యక్తిగతంగా, కొత్తగా లభించిన ఆర్థిక స్వేచ్ఛ వారి ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. మరింత మెరుగ్గా పనిచేసేలా, ఉన్నత లక్ష్యాలను అందుకునేందుకు యువతకు స్ఫూర్తిని అందిస్తుంది.


అభ్యర్థికి దీర్ఘకాలిక ఉద్యోగ అవకాశాన్ని కల్పించే విషయంలో అతని నైపుణ్యాలను పరీక్షించడానికి యాజమాన్యాలకు తక్కువ ఖర్చుతో చేసే ప్రయోగమే కాకుండా, ఇంటర్న్‌షిప్ నైపుణ్యాల అంతరాన్ని తగ్గిస్తుంది. సీఎస్‌ఆర్ లక్ష్యాన్ని కూడా అవి అధిగమించగలుగుతాయి. 12 నెలల పాటు ఇంటర్న్‌కు సంబంధించిన ఐక్యూ, ఈక్యూలను గమనించే అవకాశం వాటికి దక్కుతుంది. ‘స్వభావం ఆధారంగా ఉద్యోగం ఇవ్వడం, నైపుణ్యాల కోసం శిక్షణ ఇవ్వడం’ అనే వ్యూహాన్ని సంస్థ అమలు చేసుకోవచ్చు.

ఆర్థిక వ్యవస్థ విస్తరణకు, జాతీయ విద్యా విధానం–2020కు అనుగుణంగా పీఎంఐఎస్ ఉంది. యువతకు ఉపాధి, వెనుకబడిన నేపథ్యాలకు చెందిన వారికి సమాన అవకాశాలను వేగంగా అందించే చర్యగా దీన్ని పేర్కొనవచ్చు. యువతకు విద్యానంతర శిక్షణాలయంగా వ్యవహరిస్తూ, ‘నైపుణ్య రహిత ఉపాధి’ వల్ల ఆర్థిక వ్యవస్థకు జరిగే నష్టాన్ని తగ్గించడంలో ఈ ఇంటర్న్‌షిప్ దోహదపడుతుంది. రానున్న ఏఐ యుగంలో విద్య నుంచి ఉపాధి వరకు ఈ విధానం కీలకంగా మారనుంది. జీవనసరళిలో వస్తున్న మార్పులకు అనుగుణంగా పెంచుకునే నైపుణ్యాలు ఉద్యోగ అవకాశాలను నిర్ణయిస్తాయి. దీర్ఘకాలంలో ఉత్పాదక రంగంలో మూలధన–కార్మిక నిష్పత్తిని సైతం ఇది ప్రభావితం చేస్తుంది.

పెద్ద సంఖ్యలో ఇంటర్న్‌లకు సంస్థల్లో అవకాశాలు కల్పించడం, అగ్రశ్రేణికి చెందిన 500 సంస్థల్లో ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు చెందిన యువతను నియమించడం, సంస్థ ఉన్న ప్రదేశానికి మారాల్సి వస్తే స్టైఫండ్ సరిపోకపోవడం లాంటి వాస్తవిక సవాళ్లు ఇందులో ఉన్నాయి. రిమోట్ తరహా పని విధానం, నాన్–మెట్రో కార్యాలయాలు, పరిశ్రమల్లో నియామకాలు, సంస్థలు స్టైపెండ్ పెంచడం ద్వారా ఈ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది.


విస్తృత ప్రచారం, కచ్చితమైన అమలు ద్వారా ఉపాధి కల్పనలో పీఎంఐఎస్ ఒక ఉత్ర్పేరకంగా పనిచేస్తుంది. భారత్‌లో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఇది లక్ష్యాలను నిర్దేశించుకుంటుంది. భారతీయ యువతలో నైపుణ్యం పెంచడం, ఉద్యోగ అవకాశాలు మెరుగుపరచడం, వారి జీవనోపాధిని పెంపొందించడమే లక్ష్యంగా ఉన్న ఈ పథకాన్ని విజయవంతం చేసే దిశగా, ప్రారంభం నాటి నుంచీ కార్పొరేట్‌ కంపెనీలు పెద్ద ఎత్తున ఆసక్తి చూపిస్తున్నాయి.

వి. అనంత నాగేశ్వరన్

భారత ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు

దీక్షా సుప్యాల్ బిష్ట్

ఇండియన్ ఎకనమిక్ సర్వీస్ అధికారిణి

Updated Date - Oct 25 , 2024 | 02:55 AM