High Cholesterol: అధిక కొలెస్టెరాల్! ముఖం, కళ్లల్లో ఈ మార్పులు కనిపిస్తే డేంజరే!
ABN, Publish Date - Dec 26 , 2024 | 11:17 AM
రక్తంలో కొలెస్టెరాల్ ఎక్కువైనప్పుడు చర్మం, కళ్లల్లో కొన్ని ముందస్తు సంకేతాలు కనిపిస్తాయి. ఈ మార్పులు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదిస్తే సమస్య ముదరకుండా తగు జాగ్రత్తలు తీసుకోవచ్చు.
ఇంటర్నెట్ డెస్క్: ఆధునిక జీవన శైలి కారణంగా తలెత్తే అనేక సమస్యల్లో అధిక కొవ్వులు, కొలెస్టెరాల్ ప్రధానమైనవి. వైద్య పరిభాషలో దీన్ని హైపర్‌లిపిడేమియా అని అంటారు. రక్తనాళాల్లో లోపలివైపు పేరుకుపోయే ఎల్‌డీఎల్ కొలెస్టెరాల్, ట్రైగ్లిజరైడ్స్ అనే కొవ్వుల కారణంగా రక్తప్రసరణకు అడ్డంకులు ఏర్పడతాయి. ఇవి చివరకు హార్ట్ ఎటాక్ లేదా స్ట్రోక్‌కు దారి తీయొచ్చు. కొలెస్టెరాల్ సమస్య ముదిరే వరకూ సాధారణంగా ఎలాంటి సమస్యలు ఉండవు. అయితే, కొన్ని సందర్భాల్లో మాత్రం ముందస్తు సంకేతాలు కనిపిస్తాయని వైద్యులు చెబుతున్నారు (Health) .
అధిక కొలెస్టెరాల్ కారణంగా కనురెప్పలపై తెల్లని మచ్చలు ఏర్పడతాయి. దీన్ని శాస్త్ర పరిభాషలో జాంథెలెస్మా అని అంటారు. కనురెప్పల చర్మంలో కొలెస్టెరాల్ పేరుకోవడంతో ఈ సమస్య వస్తుంది. దీంతో ఎటువంటి సమస్య ఉండకపోయినప్పటికీ రక్తంలో అధిక కొవ్వులకు ఇది సంకేతంగా భావించాలని నిపుణులు చెబుతున్నారు. దీంతో, హృద్రోగావకాశాలు పెరుగుతాయని హెచ్చరిస్తున్నారు. కాబట్టి, ఈ సమస్య మొదలైన వెంటనే డాక్టర్లను సంప్రదించాలి.
Health: దీర్ఘాయుష్షు కోసం ఈ రక్త పరీక్షలు తప్పనిసరి!
ఇక కంటిలోని కార్నియా చుట్టూ తెల్లని వలయం ఏర్పడటం కూడా అధిక కొలెస్టెరాల్‌కు ఒక సంకేతం. రక్తంలోని అధిక కొవ్వులు కార్నియాలో ఇలా తెల్లని వలయాకారంలో పేరుకుంటాయని వైద్యులు వివరిస్తున్నారు. 45 ఏళ్ల లోపు వాళ్లల్లో ఈ సమస్య కనబడుతుందని చెబుతున్నారు.
హైపర్ లిపిడేమియా కారణంగా చర్మం రంగులో కూడా మార్పులు వస్తాయి. ముఖ్యంగా ముఖం, కళ్ల చుట్టూ పసుపుపచ్చని మచ్చలు కనిపిస్తాయి. కొలెస్టెరాల్ పేరుకోవడంతో ఇలా జరుగుతుందని వైద్యులు చెబుతున్నారు.
Health: ఊహించని ప్రమాదంలో పడ్డ మహిళ! ఉదయాన్నే ఒకేసారి 4 లీటర్ల నీరు తాగితే..
ఇక చర్మం కింద కొన్ని ప్రత్యేకమైన కణాల్లో కొలెస్టెరాల్ పేరుకున్నప్పుడు పసుపుపచ్చ రంగులో పింపుల్స్ ఏర్పడతాయి. వీటి సైజు ఆకృతుల్లో కూడా తేడాలు ఉంటాయి. చెంపలపైనా, కళ్లు చుట్టూరా ఇవి ఏర్పడతాయి. వీటితో ఎటువంటి నొప్పి ఉండకపోయినా లిపిడ్ మెటబాలిజంలో లోపాలకు వీటిని సంకేతంగా భావించాలని నిపుణులు చెబుతున్నారు.
ఛాతిలో నొప్పి, శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది, నిత్యం అలసటగా అనిపించడం, నడుస్తున్నప్పుడు కాళ్లల్లో అకస్మాత్తుగా నొప్పి వచ్చి పోవడం వంటివన్నీ అధిక కొలెస్టెరాల్‌కు సంకేతాలు. రక్తనాళాల్లో కొవ్వులు పేరుకోవడంతో తలెత్తే ఇబ్బందులు. కాబట్టి, ఈ విషయంలో నిత్యం అప్రమత్తంగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు ఈ సమస్యలను గుర్తించిన వెంటనే వైద్యులను సంప్రదిస్తే తీవ్ర అనారోగ్యాలు కలగకుండా నివారించవచ్చని చెబుతున్నారు.
Eye Health: కంటి ఆరోగ్యం కోసం వివిధ వయసుల వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు!
Updated Date - Dec 26 , 2024 | 11:46 AM