పులిహోరలో పోషకాలున్నాయా...
ABN, Publish Date - Nov 10 , 2024 | 08:40 AM
పండగలప్పుడు పులిహోర తప్పక చేసుకుంటాం. పులిహోరలో పోషకాలేమిటి? ఏవైనా ఆరోగ్యప్రయోజనాలు ఉంటాయా..
పండగలప్పుడు పులిహోర తప్పక చేసుకుంటాం. పులిహోరలో పోషకాలేమిటి? ఏవైనా ఆరోగ్యప్రయోజనాలు ఉంటాయా..
- రాగిణి, చెన్నై
పులిహోరలో పులుపు కోసం వాడే పదార్థాన్ని బట్టి వివిధ రకాలు ఉంటాయి. పులిహోర తయారీలో ఎక్కువగా చింతపండును వాడతారు. దీనికి బదులుగా పచ్చి మామిడికాయ, నిమ్మకాయ, గోంగూర లాంటి పుల్లటి పదార్థాలను కూడా పులిహోర తయారీకి వాడతారు. పచ్చి మామిడి, నిమ్మ
రసంతో చేసిన పులిహోరలో విటమిన్ సీ కొంతవరకు ఉంటుంది. గోంగూర పులిహోరలో కొంత ఐరన్ లభించే అవకాశం ఉంది. పులిహోరలో నూనె, ఉప్పు, మిరపకాయ వంటివి అధికంగానే ఉంటాయి. కొంతమంది వేరుశెనగ, జీడి పప్పు వంటివి కూడా వాడతారు. రుచి కోసం వీటన్నింటిని వాడినా అధిక భాగం అన్నమే కాబట్టి పులిహోర నుండి లభించే పోషకాల్లో పిండి పదార్థాలు ఎక్కువ. నూనె, పల్లీలు, జీడిపప్పు లాంటి గింజల వల్ల కొవ్వు పదార్ధాలు కూడా అధికంగా ఉంటాయి. ప్రోటీన్ మాత్రం తక్కువే. విటమిన్లు ఖనిజాలు ఉండే అవకాశం లేదు. ఉప్పు, కారం, నూనె ఎక్కువగా తింటే అధిక రక్తపోటు ఉన్నవారికి రక్తపోటు పెరగడం, డయాబెటీస్ ఉన్నవారికి రక్తంలో గ్లూకోజు పెరగడం లాంటి పరిణామాలు ఏర్పడతాయి. కాబట్టి పండగలప్పుడు, ఏదైనా ప్రత్యేకమైన రోజుల్లో పరిమిత మోతాదుల్లో కేవలం వాటి రుచిని ఆస్వాదించడానికి తినాలి తప్ప పోషకాల కోసం తినే ఆహారంలా తినకూడదు.
ఇటీవల రక్త పరీక్షల్లో విటమిన్ డీ తక్కువ ఉన్నట్టు తేలింది. ఎండలో కొంత సమయం గడపడంతో పాటు ఆహారంలో కూడా ఏవైనా మార్పులు చేసుకోవాలా?
- కావ్య, నిజామాబాద్
విటమిన్ డీ ఎముకల నిర్మాణానికి కీలకమైనది. క్యాల్షియం, ఫాస్ఫరస్ ఖనిజాలను ఎముకల్లోనికి శోషించుకొనేందుకు విటమిన్ డీ అవసరం. శరీరంలో డీ విటమిన్ తగినంత లేనప్పుడు ఆహారంలోని క్యాల్షియం కేవలం పది నుంచి పదిహేను శాతం మాత్రమే శరీరం శోషించుకోగలుగుతుంది. ఇన్ఫెక్షన్లను దూరంగా ఉంచడంలో, రక్తంలో గ్లూకోజు స్థాయిలు నియంత్రించడంలో, ఇన్‌ఫ్లమేషన్ తగ్గించడంలో కూడా విటమిన్ డీ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. విటమిన్ డీ కేవలం కొవ్వులో మాత్రమే కరిగే పదార్థం.
కాబట్టి కొవ్వులు ఎక్కువ ఉండే కొన్ని రకాల చేపలు, కాలేయం, గుడ్డులోని పచ్చసొన , ఫార్టిఫై చేసిన పాలు, పాలపదార్థాల్లో కొంత విటమిన్ డీ లభిస్తుంది. సూర్యరశ్మిలో ఉండే యువీ-బీ కిరణాలు మన చర్మంపై పడినప్పుడు శరీరంలో విటమిన్ డీ తయారవుతుంది. అందుకే యువీ-బీ కిరణాలు అధికంగా ఉండే సమయం, ఉదయం పదకొండు నుంచి మధ్యాహ్నం మూడు గంటల మధ్యలో కనీసం ఇరవై నిమిషాలపాటు చర్మంపై నేరుగా ఎండపడేట్టు గడిపినట్టయితే శరీరానికి అవసరమైన విటమిన్ డీ ఉత్పత్తి అవుతుంది. విటమిన్ డీ ని పూర్తిగా వినియోగించుకోవాలంటే మెగ్నీషియం, జింక్, ఐరన్, క్యాల్షియం అవసరం. ఆహారంలో పప్పు ధాన్యాలు, పల్లీలు, బాదం, ఆక్రోట్ లాంటి గింజలు, గుడ్లు, ఆకుకూరలు మొదలైనవి తీసుకొంటే ఈ పోషకాలు కూడా లభించి, విటమిన్ డీ పనితీరు బాగుంటుంది.
ఇదివరకు హాస్పిటల్లో రోగులకు ఆహారంగా బ్రెడ్ ఇచ్చేవారు. బ్రెడ్ మైదాతో తయారవుతుంది, మంచిది కాదు అని విన్నాను. మరి దీనివల్ల రోగులకు తగిన పోషకాలు అందుతాయా? శక్తి వస్తుందా?
- అస్మి, విజయవాడ
బ్రెడ్ మైదాతో చేస్తారన్నమాట నిజమే. మైదా గోధుమల నుంచి తయారవుతుంది. మైదా తయారీ విధానంలో గోధుమల పై పొట్టులో ఉండే పీచుపదార్థాలు, బీ విటమిన్లు మొదలైనవి తొలగిస్తారు. కేవలం పిండిపదార్థాలు, కొంత వరకు ప్రోటీన్ ఉండే భాగం మాత్రమే మైదాగా మనకు లభ్యమవుతుంది. మైదాతో చేసిన బ్రెడ్‌లో పిండి పదార్థాలు అధికంగా, పీచుపదార్థాలు, కొవ్వులు తక్కువగా ఉంటాయి. కాబట్టి అరుగుదలకు ఎలాంటి ఇబ్బందీ ఉండదు, క్యాలరీల రూపంలో శక్తి తేలికగా లభిస్తుంది.
కానీ విటమిన్లు, ఖనిజాలు లాంటి ఆవశ్యక పోషకాలు మాత్రం బ్రెడ్ నుంచి అందవు. ఆరోగ్యం బాగుండక అరుగుదల ఇబ్బందిగా ఉండి, తేలికపాటి ఆహారం తీసుకోవాల్సిన పరిస్థితుల్లో కొద్ది రోజులపాటు బ్రెడ్ తీసుకోవడం తప్పేమీ కాదు. అయితే వైద్యులు, హాస్పిటల్‌లోని పోషకాహార నిపుణుల సలహాతో బ్రెడ్ ద్వారా లభించని పోషకాలను వేరే ఆహారం ద్వారా తీసుకోవాలి కూడా. కేవలం అనారోగ్యమప్పుడే కాకుండా సౌకర్యం కోసం రోజువారీ ఆహారంలో బ్రెడ్‌ను భాగం చేసుకుందామనుకునే వారు మైదాతో చేసిన బ్రెడ్ కంటే ముడి గోధుమ పిండితో తయారు
చేసిన లేదా చిరు ధాన్యాలతో చేసిన బ్రెడ్ పరిమిత మోతాదులో తీసుకోవడం వల్ల నష్టం ఉండదు.
Updated Date - Nov 10 , 2024 | 08:40 AM