ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

పండ్లు, జ్యూస్‌... ఏది బెస్ట్‌?

ABN, Publish Date - Nov 17 , 2024 | 08:26 AM

తాజా పండ్లలో పిండిపదార్థాలు, పీచు, విటమిన్‌ సి, యాంటీఆక్సిడెంట్లు, పాలీఫీనాల్స్‌ వంటి ఎన్నో పోషకాలుంటాయి. పిండిపదార్థాల నుంచి క్యాలరీల రూపంలో శక్తి వస్తుంది. పండ్లలోని పీచు వల్ల మితంగా తీసుకున్నా ఆకలి తీరుతుంది. అదే పండ్లను జ్యూస్‌ చేసి వడపోసినప్పుడు వాటిలోని పీచుపదార్థాలు పోతాయి.

పండ్ల రసాలు తాగడం కన్నా పండ్లు తినడం మంచిది అనే సలహాను చాలామంది పోషక నిపుణుల నుంచి వింటున్నాం. పండు తినడం కంటే రసం తాగడం తేలిక కదా, ఇలా చేయడం వలన ఏమైనా ఇబ్బందా?

- లత, కృష్ణాపురం

తాజా పండ్లలో పిండిపదార్థాలు, పీచు, విటమిన్‌ సి, యాంటీఆక్సిడెంట్లు, పాలీఫీనాల్స్‌ వంటి ఎన్నో పోషకాలుంటాయి. పిండిపదార్థాల నుంచి క్యాలరీల రూపంలో శక్తి వస్తుంది. పండ్లలోని పీచు వల్ల మితంగా తీసుకున్నా ఆకలి తీరుతుంది. అదే పండ్లను జ్యూస్‌ చేసి వడపోసినప్పుడు వాటిలోని పీచుపదార్థాలు పోతాయి. పండ్లలో ఉండే నీటి శాతాన్ని బట్టి ఒక గ్లాసు రసం కోసం రెండు నుంచి మూడు వందల గ్రాముల పైనే పండ్లు కావాలి. అందువలన పండ్ల రసంలో క్యాలరీలు కూడా అధికమే. పండ్లు రసం తీసే ప్రక్రియలో కొన్ని విటమిన్లు, యాంటీఆక్సిడెంట్ల పరిమాణం తగ్గుతుంది కూడా. జ్యూస్‌ షాపుల్లో, మార్కెట్లో సీసాల్లో లభించే ఫ్రూట్‌ జ్యూస్‌లలో సాధారణంగా అదనపు తీపి కోసం చక్కెర కూడా చేర్చబడి ఉంటుంది. దీనివలన కూడా క్యాలరీలు పెరుగుతాయి. ముఖ్యంగా మధుమేహం ఉన్నవారు పండ్లకు బదులు పండ్ల రసాలు తీసుకొంటే రక్తంలో గ్లూకోజు పరిమాణం మరింత పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే పండ్లరసాలు తీసుకోవడం కన్నా పండ్లు తీసుకొంటేనే ఆరోగ్య ప్రయోజనాలు అధికం.


నా వయసు 60 ఏళ్ళు. నాకు ధూమపానం, మద్యపానం వంటి అలవాట్లు లేవు. స్వీట్లు, జంక్‌ఫుడ్‌కి దూరంగా ఉంటా. బీపీ, షుగర్‌, కొలెస్ట్రాల్‌ వంటి ఆరోగ్య సమస్యలు కూడా ఏమీ లేవు. ప్రతిరోజూ గంటసేపు వేగంగా నడుస్తాను. రోజుకు రెండు ఉడికించిన గుడ్లు (పచ్చ సొనతో సహా) తీసుకుంటా. మూడు స్పూనుల నెయ్యి కూడా. ఇవే అలవాట్లను నేను కొనసాగిస్తే నా ఆరోగ్యాన్ని ఇలాగే కాపాడుకోవచ్చా?

- జె.వి. రమణ, గుంటూరు

ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేకుండా, ఎత్తుకు తగ్గ బరువుతో ఉన్నప్పుడు రోజూ రెండు గుడ్లు, రెండు స్పూనుల నెయ్యి ఆహారంలో భాగం చేసుకోవడం వలన ఎటువంటి ఇబ్బంది ఉండకపోవచ్చు. ప్రతిరోజూ వ్యాయామంగా నడక కూడా మంచిదే. వయసు పెరిగే కొద్దీ జీవక్రియ వేగం (మెటబాలిక్‌ రేట్‌) తగ్గడం వలన క్యాలరీల అవసరం కూడా నెమ్మదిగా తగ్గుతుంది. అందుకే తీసుకునే ఆహారంలో మార్పులు చేయకపోయినా క్రమేణా బరువు పెరిగే అవకాశం ఉంది. వయసు పెరిగే కొద్దీ ప్రోటీన్‌ అవసరం కూడా పెరుగుతుందని శాస్త్రీయ పరిశోధనలు తెలియచేస్తున్నాయి. జీర్ణ వ్యవస్థలో వచ్చే మార్పుల వల్ల తీసుకునే ఆహారంలోని కొన్ని విటమిన్లు, ఖనిజాలను శోషించుకునే శక్తీ కూడా నెమ్మదిస్తుంది. వీటన్నింటి వల్ల ఇబ్బంది రాకుండా ఉండడానికి ఎప్పటికప్పుడు బరువు చూసుకుంటూ, వైద్యుల సలహాతో తగిన ఆరోగ్యపరీక్షలు చేయించుకుంటూ దానికి తగ్గట్టు ఆహారాన్ని, జీవన శైలిని మార్చుకున్నట్టయితే ఎక్కువకాలం పాటు ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. అవసరాన్ని బట్టి వైద్యుల సలహాతో సప్లిమెంట్లను తీసుకోవాలి కూడా.


నాకు 70 ఏళ్ళు. సుమారు 40 ఏళ్లుగా బ్రాంకైటీస్‌, ఆస్తమా ఉంది. అయితే అదుపులోనే ఉంటుంది. రాత్రిపూట భోజనం చేసిన తర్వాత పాలు తాగే అలవాటు ఎన్నో ఏళ్లుగా ఉంది. గత ఆరేడు నెలల నుంచి కఫం అధికమవుతోంది. పాలు మానేస్తేగానీ కఫం తగ్గదని అంటున్నారు, నిజమేనా?

- సూర్యనారాయణ, విజయవాడ

ఆస్తమా వంటి శ్వాసకోశ సంబంధిత సమస్యలున్నప్పుడు మందులతో పాటు ఆహారంలోనూ జాగ్రత్తలు తీసుకొంటే మంచిదే. కఫం అధికంగా రావడానికి డీహైడ్రేషన్‌ కూడా కారణమవ్వొచ్చు. కేవలం మంచినీళ్లు తాగడం మాత్రమే కాకుండా ఆహారంలోనూ ద్రవ పదార్థాలు ఉండేలా చూసుకోండి. సాధారణంగా అందరి శరీరం అన్ని రకాల ఆహారానికి ఒకేలా స్పందించదు. మీకు పాలు తాగే అలవాటు ఎప్పటినుంచో ఉన్నప్పుడు అకస్మాత్తుగా పాల వల్ల కఫం పెరిగే అవకాశం తక్కువ. కానీ, ఒకవేళ ఏదైనా వేరే కారణం వల్ల కఫం అప్పటికే ఉన్నట్టయితే పాలు తీసుకోవడం వలన సమస్య ఎక్కువ కావొచ్చు. కొన్ని రోజులపాటు పాలకు విరామమిస్తే మీ సమస్య పరిష్కారమవుతుందేమో చూడొచ్చు. పాలలో పసుపు, మిరియాల పొడి వేసుకుని తాగడం వల్ల కూడా కఫం సమస్య తగ్గొచ్చు. ఏదేమైనా ఇటువంటి సమస్యలకు మీ ఆరోగ్య చరిత్ర (హెల్త్‌ హిస్టరీ) పూర్తిగా అర్థమైతేనే తగిన పరిష్కారం చూపొచ్చు.

డా. లహరి సూరపనేని

న్యూట్రిషనిస్ట్‌, వెల్‌నెస్‌ కన్సల్టెంట్‌

nutrifulyou.com

Updated Date - Nov 17 , 2024 | 08:26 AM