ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

‘ఘీ’ టీ మంచిదేనా?

ABN, Publish Date - Oct 20 , 2024 | 07:48 AM

టీ వివిధ రూపాల్లో తీసుకోవచ్చు. బ్లాక్‌ టీ, గ్రీన్‌ టీలు ఎక్కువ ప్రాచుర్యం పొందినవి. టీని బ్లాక్‌ టీ, గ్రీన్‌ టీ లా కాకుండా పాలతో పాటు తీసుకుంటే పాలలోని కేసిన్‌ టీలోని ఫ్లేవనాయిడ్స్‌ శరీరానికి అందకుండా చేస్తాయి. కాబట్టి టీ ఉపయోగాలను పరిపూర్ణంగా పొందాలంటే దానిలో పాలు, చక్కెర కలపకుండా తీసుకోవడం ఉత్తమం.

ప్రస్తుతం ఘీ (నెయ్యి) టీ ట్రెండ్‌ నడుస్తోంది. ఇది మంచిదేనా?

ఏవైనా ఉపయోగాలున్నాయా?

- రష్మీ, గాజువాక

టీ వివిధ రూపాల్లో తీసుకోవచ్చు. బ్లాక్‌ టీ, గ్రీన్‌ టీలు ఎక్కువ ప్రాచుర్యం పొందినవి. టీని బ్లాక్‌ టీ, గ్రీన్‌ టీ లా కాకుండా పాలతో పాటు తీసుకుంటే పాలలోని కేసిన్‌ టీలోని ఫ్లేవనాయిడ్స్‌ శరీరానికి అందకుండా చేస్తాయి. కాబట్టి టీ ఉపయోగాలను పరిపూర్ణంగా పొందాలంటే దానిలో పాలు, చక్కెర కలపకుండా తీసుకోవడం ఉత్తమం. ఈ మధ్య కాలంలో బుల్లెట్‌ ప్రూఫ్‌ కాఫీ లాగానే, ఘీ టీ కూడా ప్రాచుర్యం పొందింది. బ్లాక్‌ టీ లో పాలకు బదు లుగా ఓ స్పూను నెయ్యి వేసి ఘీ టీ చేసుకోవచ్చు. నెయ్యిలో ఉండే బ్యుటిరిక్‌ యాసిడ్‌ అనే ఒక షార్ట్‌ చైన్‌ ఫాటీ ఆసిడ్‌ వల్ల పరిమిత మోతాదుల్లో నెయ్యి ఏ రూపంలో తీసుకొన్నా కొన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.


ముఖ్యంగా కాన్‌స్టిపేషన్‌ లేదా మలబద్దకం సమస్యను పరిష్క రించడం, పెద్ద పేగుల్లో మంచి బ్యాక్టీరియా వృద్ధికి తోడ్పడడం వంటి ప్రయోజనాలు నెయ్యితో ఉన్నాయి. టీ తో పాటుగా నెయ్యి తీసుకొంటే మాత్రమే ఈ ఫలితాలు ఉంటాయని భావించాల్సిన అవసరం లేదు. నెయ్యి కూడా నూనెల్లానే ఓ రకమైన కొవ్వు పదార్థం కాబట్టి క్యాలరీలు అధికం. జంతు సంబంధిత కొవ్వు పదార్థం కాబట్టి దీనిలో కొలెస్ట్రాల్‌ కూడా ఉంటుంది. పరిమితికి లోబడి టీ లో తీసుకొన్నా లేదా మరేదైనా రూపంలో తీసుకున్నా ఇబ్బంది లేదు.


మా అమ్మాయికి పద్దెనిమిదేళ్లు. అధిక బరువు ఉంటుంది. పీరియడ్స్‌ సమయంలో ఏడు నుంచి పది రోజుల వరకు బ్లీడింగ్‌ అవుతుంది. దీనివలన విపరీతంగా నీరసించి పోతోంది. ఎటువంటి ఆహారం ఇస్తే మంచిది?

- మమత, ఖమ్మం

పీరియడ్స్‌ సమయంలో బ్లీడింగ్‌ ఎక్కువ రోజులు కావడానికి కారణమేమిటో ముందుగా వైద్యులను సంప్రదించి తెలుసుకోవాలి. చికిత్స పొందాలి. ఇలా అధికంగా రక్తం పోవడం వలన నీరసించి పోవడం, శరీరంలో రక్తం తక్కువ అవడం, అనీమియా లేదా రక్తహీనత ఏర్పడవచ్చు. రక్తం ద్వారా ఐరన్‌ కూడా పోతుంది కాబట్టి ఆహారంలో తగినంత ఐరన్‌ ఉండేలా చూసుకోవాలి. ఆకుకూరలు అధికంగా ప్రతిరోజూ తీసుకోవడం, సెనగలు, అలసందలు, సోయా చిక్కుడు వంటి గింజలను ఆహారంలో చేర్చుకోవడం, ఇలా ఐరన్‌ ఎక్కువ ఉండే ఆహారం తీసుకునేప్పుడు


వాటితో పాటు విటమిన్‌ సి ఉండే నిమ్మ రసం చేర్చుకోవడం లేదా కనీసం తాజా కాయగూరల సలాడ్‌ తీసుకోవడం చేసినట్టయితే ఆహారంలోని ఐరన్‌ సరిగా వంటపడుతుంది. తరచూ అధిక మొత్తంలో రక్తం కోల్పోవడం జరుగుతున్నప్పుడు... తీసుకునే ఆహారంలో ప్రోటీన్లు కూడా సరిగా ఉండేలా చూసుకుంటే నీరసం రాకుండా ఉంటుంది. ప్రొటీన్‌ కోసం మాంసం, గుడ్లు, పాలు, పెరుగు, పప్పు ధాన్యాలు తప్పనిసరిగా తీసుకోవాలి. కొన్నిసార్లు అధిక బరువు మూలంగా వచ్చే హార్మోను అసమతుల్యత కూడా ఇలా ఎక్కువ రోజులు బ్లీడింగ్‌ అయ్యేందుకు కారణమవుతుంది. బరువు నియంత్రణలో ఉండేందుకు సమతులాహారంతో పాటు క్రమం తప్పకుండా వ్యాయామం, శారీరక శ్రమ కూడా చేయడం అలవర్చుకుంటే మంచిది.


గుండె ఆరోగ్యంగా ఉండి, సమర్ధవంతంగా పనిచేయాలంటే ఎటువంటి ఆహారం తీసుకోవాలి?

- వెంకట భాను ప్రసాద్‌, తిరుపతి

మంచి ఆహారం, జీవన శైలి గుండె ఆరోగ్యానికి ఎంతో ముఖ్యం. ఆహారంలో సాచ్యురేటెడ్‌ ఫ్యాట్స్‌ అధికంగా ఉండే వెన్న, నెయ్యి, కొబ్బరి నూనె మానెయ్యడం మంచిది. రెడ్‌ మీట్‌ బదులుగా కొవ్వు తక్కువగా ఉండే చికెన్‌ , చేప వంటివి మాత్రమే తినాలి. గుడ్డులోని పచ్చసొనలో కొలెస్ట్రాల్‌ ఉన్నప్పటికీ అందులో మరెన్నో గుండెకు మేలు చేసే పోషకాలు ఉన్నందున వారానికి 4-5 మించకుండా గుడ్లు (పచ్చ సొనతో సహా) తీసుకోవచ్చు. చెడు కొలెస్ట్రాల్‌ వల్ల గుండెపోటు వచ్చే అవకాశాలు పెరుగుతాయి. చెడు కొలెస్ట్రాల్‌ పెరగకుండా ఉండాలంటే యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే అన్ని రకాల కాయగూరలు, ఆకుకూరలను రోజుకు కనీసం 300 గ్రాములైనా తీసుకోవాలి.


బరువు ఎక్కువ ఉన్నవారు కొంత బరువు తగ్గాలి. అన్ని రకాల పండ్లు తీసుకోవచ్చు. మంచి కొవ్వులు ఉండే ఆక్రోట్‌, అవిసెగింజల వంటి వాటిని రోజూ ఆహారంలో భాగం చేసుకోవాలి. అలవాటు లేని వ్యాయామాలు అకస్మాత్తుగా ఎక్కువగా చేయడం కంటే వైద్యుల సలహా మేరకు తక్కువ శ్రమతో కూడుకున్న నడక, ఈత వంటి తేలికపాటి వ్యాయామాలు చేయవచ్చు. సమయానికి ఆహారం తీసుకోవడం, నిద్ర పోవడం ముఖ్యం. మానసిక ఆందోళనలను తగ్గించుకునేందుకు ఏవైనా వ్యాపకాలు ఎంచుకోవడం, ధ్యానం చేయడం కూడా పనికొస్తాయి.

డా. లహరి సూరపనేని

న్యూట్రిషనిస్ట్‌, వెల్‌నెస్‌ కన్సల్టెంట్‌

nutrifulyou.com

(పాఠకులు తమ సందేహాలను

sunday.aj@gmail.com కు పంపవచ్చు)

Updated Date - Oct 20 , 2024 | 07:48 AM