WHO: ఫోన్లు వాడితే బ్రెయిన్ క్యాన్సర్ వస్తుందా.. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏమందంటే
ABN, Publish Date - Sep 04 , 2024 | 12:53 PM
ఫోన్‌లను ఉపయోగించడం వల్ల బ్రెయిన్ క్యాన్సర్(Brain Cancer) వచ్చే ప్రమాదం ఉందా? ఈ ప్రశ్న ఎంతో మంది మెదళ్లను తొలచివేసేది. ఈ ప్రశ్నకు ప్రపంచ ఆరోగ్య సంస్థ సమాధానామిచ్చింది.
ఇంటర్నెట్ డెస్క్: ఫోన్‌లను ఉపయోగించడం వల్ల బ్రెయిన్ క్యాన్సర్(Brain Cancer) వచ్చే ప్రమాదం ఉందా? ఈ ప్రశ్న ఎంతో మంది మెదళ్లను తొలచివేసేది. ఈ ప్రశ్నకు ప్రపంచ ఆరోగ్య సంస్థ సమాధానామిచ్చింది. ఎన్విరాన్‌మెంట్ ఇంటర్నేషనల్ జర్నల్‌లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం.. ఫోన్లు వాడితే బ్రెయిన్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ తేల్చి చెప్పింది. తరచూ ఫోన్ కాల్స్ మాట్లాడేవారితోపాటు, దశాబ్దానికిపైగా ఫోన్‌ని వినియోగిస్తున్న వారికీ ప్రమాదమేమీ లేదని తేల్చింది. ప్రపంచవ్యాప్త అధ్యయనాలను పరిశీలించిన WHO... వైర్‌లెస్ టెక్నాలజీని విస్తృతంగా ఉపయోగించినప్పటికీ, మెదడు క్యాన్సర్ కేసుల్లో పెరుగుదల నమోదు కాలేదని చెప్పింది.
10 దేశాలు.. 11 మంది నిపుణులు..
1994 - 2022 మధ్య నిర్వహించిన 63 అధ్యయనాలను డబ్ల్యూహెచ్‌వో విశ్లేషించింది. పరిశోధన బృందంలో 10 వేర్వేరు దేశాల నుంచి 11 మంది నిపుణులు పాల్గొన్నారు. వీరిలో ఆస్ట్రేలియా రేడియేషన్ ప్రొటెక్షన్ అథారిటీ ప్రతినిధులూ పాల్గొన్నారు. ఈ పరిశోధనలో రేడియో ఫ్రీక్వెన్సీ ప్రభావాలపై అధ్యయనం దృష్టి సారించింది. మొబైల్ ఫోన్‌లే కాకుండా టీవీలు, బేబీ మానిటర్లు, రాడార్ వంటి పరికరాలకు సంబంధించి కూడా నివేదిక ప్రచురించింది.
న్యూజిలాండ్ ఆక్లాండ్ విశ్వవిద్యాలయంలోని సహ రచయిత, క్యాన్సర్ ఎపిడెమియాలజీ ప్రొఫెసర్ మార్క్ ఎల్‌వుడ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఫోన్లకు సంబంధించి ఏ అంశమూ క్యాన్సర్‌కి దారి తీయదు. పెద్దలు, పిల్లలలో మెదడును ప్రభావితం చేసే వివిధ రకాల క్యాన్సర్‌లను, పిట్యూటరీ గ్రంథి, లాలాజల గ్రంథులు, లుకేమియా క్యాన్సర్‌లు సహా వివిధ రకాల క్యాన్సర్‌లను ఈ అధ్యయనం పరిశీలించింది. మొబైల్ రేడియేషన్ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తుందనడానికి ఎటువంటి ఆధారాలు లేవని ప్రపంచ ఆరోగ్య సంస్థతోపాటు ఇతర అంతర్జాతీయ ఆరోగ్య విభాగాలు గతంలోనే వెల్లడించాయి. అయితే, వీటిపై మరింత అధ్యయనం అవసరమని నిపుణులు చెప్పారు.
For Latest News click here
Updated Date - Sep 04 , 2024 | 12:53 PM