Obesity: అకస్మాత్తుగా బరువు పెరిగిపోయారా.. అయితే వీర్య కణాల సంఖ్య తగ్గుతున్నట్లే
ABN, Publish Date - Jul 22 , 2024 | 07:38 AM
స్థూలకాయం(Obesity).. హైపోథాలమస్‌పై(మెదడులోని ఓ భాగం) ప్రభావం చూపడం ద్వారా వీర్య కణాల సంఖ్యను తగ్గిస్తోందని జర్నల్ ఆఫ్ న్యూరోసైన్స్ అధ్యయనం హెచ్చరించింది.
ఇంటర్నెట్ డెస్క్: స్థూలకాయం(Obesity).. హైపోథాలమస్‌పై(మెదడులోని ఓ భాగం) ప్రభావం చూపడం ద్వారా వీర్య కణాల సంఖ్యను తగ్గిస్తోందని జర్నల్ ఆఫ్ న్యూరోసైన్స్ అధ్యయనం హెచ్చరించింది. హైపోథాలమస్‌లో మార్పులు టెస్టోస్టిరాన్, వీర్య కణాలను తయారు చేసేందుకు అవసరమైన హార్మోన్ల ఉత్పత్తికి ఆటంకం కలిగిస్తాయని పరిశోధకులు కనుగొన్నారు.
ఎలుకలపై చేసిన ఈ అధ్యయనంలో ఆందోళనకర విషయాలు బయటపడ్డాయి. యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా రివర్‌సైడ్, అమెరికాలోని పరిశోధకులు ఎలుకలకు అధిక కొవ్వు ఉన్న ఆహారం ఇచ్చారు. తద్వారా ఎలుకల మెదడులో చాలా మార్పులు వచ్చాయి.
ఆ ఆహారం తిన్న తరువాత ఎలుకలకు శక్తి తగ్గిపోయిందని.. ఆహారం తినాలనే కోరిక చనిపోయినట్లు గుర్తించారు. వీటితోపాటు ఎలుకలలో టెస్టోస్టిరాన్ స్థాయిలు తగ్గాయని, వీర్య కణాల సంఖ్య తగ్గిందని తేలింది.
పునరుత్పత్తి అవయవాలలోని గోనాడ్‌లతో పాటు మెదడులోని హైపోథాలమస్, పిట్యూటరీ గ్రంథిని కలిగి ఉన్న ఫీడ్‌బ్యాక్ లూప్ ద్వారా పునరుత్పత్తి ప్రక్రియ కంట్రోల్ అవుతుందని ప్రధాన శాస్త్రవేత్త జుర్డ్‌జికా కాస్ వివరించారు. పునరుత్పత్తి ప్రక్రియను నియంత్రించడానికి హైపోథాలమస్ బాధ్యత వహిస్తుంది. పిట్యూటరీ గ్రంథి మగవారిలో టెస్టోస్టెరాన్, స్పెర్మ్, ఆడవారిలో ఈస్ట్రోజెన్, అండాల ఉత్పత్తికి ఉపయోగపడుతుంది.
టెస్టోస్టెరాన్ లేదా ఈస్ట్రోజెన్ స్థాయిలను నియంత్రించే హార్మోన్ల ఉత్పత్తిని కంట్రోల్ చేయడానికి హైపోథాలమస్.. పిట్యూటరీ గ్రంథితో కమ్యూనికేట్ చేస్తుంది. ఊబకాయం ఉన్న ఎలుకలలో ఈ కమ్యూనికేషన్ బలహీనంగా ఉన్నట్లు కనుగొన్నారు.
తద్వారా పిట్యూటరీ గ్రంథి ద్వారా హార్మోన్ ఉత్పత్తితోపాటు, టెస్టోస్టెరాన్ స్థాయిలు తగ్గినట్లు గుర్తించారు. తాజా ఫలితాలను అర్థం చేసుకోవడానికి మరిన్ని అధ్యయనాలు అవసరమని పరిశోధకులు తెలిపారు. ఊబకాయం ఉండటం వల్ల వీర్య కణాల సంఖ్య తగ్గడం పక్కా అంటున్నారు. మరికొన్ని పరిశోధనలతో ఊబకాయం అనర్థాలను కనుక్కుంటామని తెలిపారు.
Updated Date - Jul 22 , 2024 | 07:38 AM