Viral: ఎక్కువసేపు నిలుచున్నా ప్రమాదమే! తాజా అధ్యయనంలో వెల్లడి
ABN, Publish Date - Oct 21 , 2024 | 10:00 PM
గంటలకు గంటలు కూర్చోవడం కంటే నిలబడటమే బెటరనే భావన తప్పని శాస్త్రవేత్తలు తాజాగా తేల్చారు. ఈ తీరుతోనూ సమస్యలు తప్పవని హెచ్చరించారు. ఈ మేరకు యూనివర్సిటీ ఆఫ్ సిడ్నీ శాస్త్రవేత్తలు తాజాగా ఓ అధ్యయనాన్ని ప్రచురించారు.
ఇంటర్నెట్ డెస్క్: ఆఫీసుల్లో గంటలకు గంటలు కూర్చుని పనిచేస్తూ, శారీరక శ్రమ లేకుండా గడిపేసే వారు అనేక అనారోగ్యాలకు గురవుతారన్న విషయం తెలిసిందే. దీనికి పరిష్కారం ఎక్కువ సేపు నిలబడటమనే భావన ప్రపంచవ్యాప్తంగా వ్యాపించింది. దీంతో, అనేక కార్యాలయాల్లో ఇప్పుడు స్టాండింగ్ డెస్కులు కనిపిస్తున్నాయి. షాపింగ్ మాల్స్‌లో కూడా సిబ్బంది నిలబడే కనిపిస్తుంటారు. అయితే, ఇలా ఎక్కువ సేపు నిలబడటం వల్ల ఉపయోగాలు లేకపోగా కొత్త సమస్యలు వస్తాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ మేరకు యూనివర్సిటీ ఆఫ్ సిడ్నీ శాస్త్రవేత్తల అధ్యయనం ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఎపిడెమియొలాజీలో ప్రచురితమైంది (Health).
Coconut Oil: రోజూ ఒక టీ స్పూన్ కొబ్బరి నూనె తాగితే కలిగే ప్రయోజనాలు!
ఈ అధ్యయనంలో భాగంగా శాస్త్రవేత్తలు సుమారు 83 వేల మంది యూకే దేశస్తులను ఎనిమిదేళ్ల పాటు పరిశీలించారు. చేతులకు తొడుక్కునే వైద్య పరికరాలతో వారి ఆరోగ్యం తీరుతెన్నులను పరిశీలించారు. ఈ క్రమంలో పలు కీలక విషయాలు వెలుగు చూశాయి. రోజులో 10 గంటలు కదలకుండా కుర్చీల్లో కూర్చుని పనిచేసేవారికి గుండె, రక్తప్రసరణకు సంబంధించిన జబ్బులు వచ్చే అవకాశాం పెరిగినట్టు తేలింది. అయితే, కూర్చునే బదులు నిలబడ్డ వారిలో ప్రత్యేక ప్రయోజనాలు ఏమీ లేవని కూడా వెల్లడైంది. నిలబడటం వల్ల కూర్చునే సమయం తగ్గడం మినహా మరే మార్పూ కనిపించలేదు. అధిక సమయం కూర్చువడంతో శరీరం క్రియారహితంగా మరుతుంది. తద్వారా వచ్చే దుష్ఫరిణామాలను నిలబడటంతో అడ్డుకోలేమని అధ్యయనకర్తల్లో ఒకరైన డా. మాథ్యూ అహ్మదీ తెలిపారు. పైపెచ్చు దీని వల్ల రక్తప్రసరణకు సంబంధించిన సమస్యలు వస్తాయని అన్నారు. వెరికోస్ వెయిన్స్ వంటి ఇబ్బందులు రావచ్చని అన్నారు.
Cakes: కేక్ అంటే ఇష్టపడే వారికి నిపుణులు చేస్తున్న హెచ్చరిక ఇదే!
కాబట్టి, ఆరోగ్యం బాగుండాలంటే శారీరక శ్రమ అవసరమని అధ్యయన కర్తలు తేల్చి చెప్పారు. కూర్చుని పని చేసే వాళ్లు అప్పుడప్పుడూ విరామం తీసుకుని కాస్త నడవాలని అన్నారు. ఒకే చోట నిలబడటం కంటే అటూ ఇటూ నడవడం, లేదా నడుస్తూ ఇతరులతో మాట్లాడటం, మెట్లు ఎక్కి దిగడం వంటివి ఆరోగ్యానికి ఎన్నో రెట్లు మేలు చేస్తాయట. రోజులో ఆరు నిమిషాలు తీవ్రంగా కసరత్తు చేసినా లేక 30 నిమిషాల పాటు ఓ మోస్తరు ఎక్సర్‌సైజులు చేసినా మంచి ఫలితం ఉంటుందని చెబుతున్నారు.
Updated Date - Oct 21 , 2024 | 10:37 PM