Presidential Election : హోరాహోరీ..!
ABN, Publish Date - Nov 05 , 2024 | 04:30 AM
ఎన్నికల్లో పార్టీల అనుకూల-ప్రతికూల-తటస్థ అంశాలకు అనుగుణంగా అమెరికాలోని రాష్ట్రాలను మూడుగా విభజించారు. అవి.. రెడ్, బ్లూ, స్వింగ్ రాష్ట్రాలు. 1980 నుంచి రిపబ్లికన్లు విజయం సాధిస్తూవస్తున్న రాష్ట్రాలను రెడ్ స్టేట్స్ అంటారు.
స్వింగ్ రాష్ట్రాల్లో ట్రంప్‌నకు స్వల్ప మొగ్గు.. కమల వెనుకబాటు
గెలుపునకు 7 రాష్ట్రాలే కీలకం
సర్వేలు మాజీ అధ్యక్షుడి వైపే
ఉత్కంఠగా అమెరికా ఎన్నికలు
నేడు అగ్రరాజ్యంలో పోలింగ్
11వ తేదీలోగా ఫలితాలు
రూ.6 లక్షల కోట్లు ఉఫ్
భారీగా పతనమైన మార్కెట్
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో క్షణక్షణం ఉత్కంఠ నెలకొంటోంది..! ‘నువ్వా-నేనా’ అన్నట్లుగా రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, డెమొక్రాటిక్ అభ్యర్థి కమలాహ్యారిస్ మధ్య పోరు హోరాహోరీ కొనసాగుతోంది. చివరి రెండ్రోజుల్లో స్వింగ్ రాష్ట్రాలపై ఇరువురు అభ్యర్థులు దృష్టి సారించగా.. ఓటర్లు స్వల్పంగా ట్రంప్ వైపు మొగ్గుచూపుతున్నట్లు సర్వేలు పేర్కొంటున్నాయి. తాజా సర్వేలతోపాటు, నేట్ సిల్వర్ వంటి ఎన్నికల వ్యూహకర్తలు ట్రంప్‌కే స్వింగ్ అని చెబుతుండగా.. ఆయన ఆధిక్యం 1-4% వరకే ఉందని, కమల తిరిగి పుంజుకోవచ్చనే అంచనాలు వెలువడుతున్నాయి. ఈ పరిణామాలు సోమవారం ప్రపంచ మార్కెట్లపై తీవ్ర ప్రభావాన్ని చూపించాయి. ముంబైలోని దలాల్ స్ట్రీట్ కూడా బేర్‌మనడంతో సెన్సెక్స్, నిఫ్టీ నష్టాలను చవిచూశాయి.
న్యూయార్క్, నవంబరు 4: ఎన్నికల్లో పార్టీల అనుకూల-ప్రతికూల-తటస్థ అంశాలకు అనుగుణంగా అమెరికాలోని రాష్ట్రాలను మూడుగా విభజించారు. అవి.. రెడ్, బ్లూ, స్వింగ్ రాష్ట్రాలు. 1980 నుంచి రిపబ్లికన్లు విజయం సాధిస్తూవస్తున్న రాష్ట్రాలను రెడ్ స్టేట్స్ అంటారు. 1992 నుంచి డెమొక్రాట్లకు కంచుకోటలుగా ఉన్న రాష్ట్రాలను బ్లూ స్టేట్స్ అని పిలుస్తారు. అయితే.. ఓటర్లు ఏ పార్టీకి మద్దతిస్తారనే అంచనాకు అందని అరిజోనా, జార్జియా, మిషిగాన్, నెవడా, నార్త్ కరోలినా, పెన్సిల్వేనియా, విస్కాన్సిన్ రాష్ట్రాలను స్వింగ్ స్టేట్స్‌గా చెబుతారు.
స్వింగ్ రాష్ట్రాల్లో మెజారిటీ సాధించే పార్టీకే అధికార పీఠం దక్కుతుంది. రెడ్ స్టేట్స్‌లో కమలకు 226 స్థానాలు దక్కుతాయని, బ్లూ స్టేట్స్‌లో 219 స్థానాలు ట్రంప్ ఖాతాలోకి చేరుతాయని అంచనా. అయితే.. మ్యాజిక్ ఫిగర్ 270 సీట్లను సాధించేందుకు స్వింగ్ రాష్ట్రాల్లో కమల 44, ట్రంప్ 51 సీట్ల దూరంలో ఉన్నారు. దాంతో.. ట్రంప్, కమల ఈ ఏడురాష్ట్రాల్లో కాళ్లకు బలపం కట్టుకున్నట్లు తిరుగుతూ.. ప్రచారాన్ని వేగవంతం చేశారు. గత నెలాఖరు వరకు కమలకు అనుకూలంగా ఉన్న స్వింగ్ రాష్ట్రాలు ఇప్పుడు ట్రంప్ వైపు మళ్లాయని తాజా సర్వేలు చెబుతున్నాయి.
అయితే.. ట్రంప్ సాధించేది స్వల్ప ఆధిక్యమేనని స్పష్టం చేస్తున్నాయి. గత నెలాఖరులో స్వింగ్ రాష్ట్రాల్లో కమలకు 44%, ట్రంప్‌నకు 43% ఓట్లు దక్కుతాయని సర్వేలు వెలువడగా.. ఇప్పుడు ట్రంప్‌తో పోలిస్తే.. కమల 1.8% వెనకబడ్డట్లు చెబుతున్నాయి. అట్లా్‌స-ఇంటెల్ ఈ నెల 1, 2 తేదీల్లో నిర్వహించిన సర్వే గణాంకాలు సోమవారం విడుదలయ్యాయి. ఈ సర్వే ప్రకారం.. స్వింగ్ రాష్ట్రాల్లో 48% మంది ఓటర్లు ట్రంప్ వైపు మొగ్గుచూపుతున్నారు. కమలకు 46.2% ఓట్లు దక్కే అవకాశాలున్నాయి. మరో సర్వేలో ట్రంప్-కమల మధ్య హోరాహోరీ పోరు జరుగుతున్నా.. రిపబ్లికన్లదే పైచేయిగా వెల్లడైంది. నెవెడాలో ట్రంప్ 51.4%, కమల 45% ఓట్లను సాధిస్తారని ఆ సర్వే తేల్చింది. ట్రంప్ నార్త్ కరోలినాలో 50.4%, నెవడాలో 51.4% ఓట్లతో ముందంజలో ఉంటారని తెలిపింది. అదే సమయంలో.. పెన్సిల్వేనియాలో కమల స్వల్పంగా వెనకంజలో ఉన్నట్లు వివరించింది. డెమొక్రాట్లకు 1948 నుంచి పెన్సిల్వేనియా అత్యంత కీలకమైన రాష్ట్రంగా ఉంది. ఆ ప్రాంతంలో పాగా వేయకుండా.. ఆ పార్టీ వైట్‌హౌ్‌సలోకి అడుగు పెట్టిన దాఖలాలు లేవు.
దీంతో డెమొక్రాట్లకు పెన్సిల్వేనియా ఓ సెంటిమెంట్‌గా కొనసాగుతోంది. ‘ఫైవ్‌థర్టీఎయిట్’ సర్వే కూడా స్వింగ్ రాష్ట్రాల్లో ఓటర్లు ట్రంప్ వైపే ఉన్నట్లు స్పష్టం చేసింది. అయితే.. ట్రంప్-కమల మధ్య తేడా చాలా స్వల్పమని పేర్కొంది. మరోవైపు ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త నేట్ సిల్వర్ ‘హోరా-హోరీ’ పోరు జరుగుతుందని చెబుతూనే.. ట్రంప్‌నకు విజయావకాశాలున్నట్లు వెల్లడించారు.
ట్రంప్ 51.5%, కమల 48.1% ఓట్లను సాధిస్తారని ఆయన అంచనా వేశారు. నార్త్ కరోలినా, పెన్సిల్వేనియా, నెవడా, జార్జియా, అరిజోనాల్లో ట్రంప్ స్వల్ప ఆధిక్యంలో ఉన్నారని, మిషిగాన్, విస్కాన్సిన్‌లో హ్యారిస్ ఆధిక్యాన్ని చూపుతున్నట్లు వివరించారు. అయితే.. ఏబీసీ న్యూస్, న్యూయార్క్ టైమ్స్, సైనా కాలేజ్ సర్వేలు మాత్రం కమలకు జైకొట్టాయి. పెన్సిల్వేనియాలో కమల వెనకబడ్డారని న్యూయార్క్ టైమ్స్ స్పష్టం చేసింది. కాగా.. ట్రంప్ కంచుకోటగా పేరున్న ఐయోవాలో కమలాహ్యారిస్ దూసుకుపోతున్నారని సెల్జెర్ అండ్ కో, దెస్-మోయిన్స్, మీడియాకామ్ సర్వేలు స్పష్టం చేశాయి. ఇక్కడ కమలకు 47%.. ట్రంప్‌నకు 44% ఓట్లు దక్కుతాయని ఈ సర్వేలు వెల్లడించాయి.
మ్యాజిక్ ఫిగర్ దక్కకుంటే..?
538 స్థానాలకు గాను.. మ్యాజిక్ ఫిగర్-- 270 సీట్లు సాధించిన వారే అమెరికా అధ్యక్ష పదవిని చేజిక్కించుకుంటారు. అయితే.. ఇరువురు అభ్యర్థుల్లో ఎవరికీ మ్యాజిక్ ఫిగర్ దక్కకుంటే..? అమెరికా ఎన్నికల్లో ఇలా జరగడం చాలా అరుదు. 1824లో ఇలాంటి పరిస్థితి నెలకొంది. దిగువ సభ(హౌస్ ఆఫ్ రిప్రెజెంటేటివ్స్) అధ్యక్షుడిని ఎన్నుకుంటుంది. ఎగువ సభ(సెనేట్)కు ఈ ఎన్నికతో సంబంధం ఉండదు. అయితే.. ఉపాధ్యక్షుడు/ఉపాధ్యక్షురాలిని సెనేట్ ఎన్నుకుంటుంది. దిగువ సభలో అధ్యక్ష ఎన్నికకు 26 రాష్ట్రాల ప్రతినిధుల మద్దతు ఉండాలి. 1924లో సంఖ్యాపరంగా ఆండ్రూ జాక్సన్‌కు అధిక స్థానాలు దక్కినా.. ఆయన ప్రత్యర్థి జాన్ క్విన్సీ ఆడమ్స్‌ను దిగువ సభ ఎన్నుకుంది.
ట్రంప్.. బెటర్ చాయిస్: నిక్కీ హేలి
భారతీయ అమెరికన్, ఐక్య రాజ్య సమితి(ఐరాస)లో అమెరికా మాజీ ప్రతినిధి నిక్కీ హేలి ట్రంప్ బెటర్ చాయిస్ అంటూ వాల్‌స్ట్రీట్ జర్నల్‌లో ఆదివారం ఓ వ్యాసం రాశారు. ‘‘నేను ట్రంప్‌తో ఎన్నడూ 100% ఏకీభవించలేదు. అయితే.. కొన్ని సార్లు ఆయన విధానాలతో ఏకీభవించాను. కానీ, కమలాహ్యారి్‌సతో నేను 100% విభేదిస్తాను’’ అని అందులో పేర్కొన్నారు. ట్రంప్ వల్ల అమెరికాకు మేలు జరుగుతుందని, తటస్థ ఓటర్లు ఈ విషయాన్ని గుర్తించి, ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆమె కోరారు. కాగా, కమలకు మద్దతుగా వస్తున్న ఓ యాడ్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఇది మహిళా ఓటర్లు స్వతంత్రంగా ఓటుహక్కును వినియోగించుకోవాలనే ఉద్దేశంతో చిత్రీకరించినా.. ట్రంప్ మద్దతుదారులు దీనిపై విమర్శలు చేస్తున్నారు.
హోరాహోరీ ఇలా..
రాష్ట్రం ట్రంప్ కమల
అరిజోనా 49.1% 46.5%
విస్కాన్సిన్ 48.2% 47.4%
జార్జియా 48.2% 47.1%
మిషిగాన్ 47.9% 47.1%
నెవడా 47.9% 47.3%
పెన్సిల్వేనియా 47.9% 47.7%
నార్త్‌కరోలినా 48.4% 47.2%
ఫలితాలు ఎప్పుడు?
మంగళవారం(5వ తేదీ) ఎన్నికలు జరుగుతాయి. సాయంత్రం 6 గంటలకు పోలింగ్ ముగియగానే.. కౌంటింగ్ ప్రారంభమవుతుంది. భారత్ మాదిరిగా అమెరికాలో దేశమంతటికీ ఒకే ఎన్నికల సంఘం ఉండదు. అమెరికాలో.. సమాఖ్య వ్యవస్థలో భాగంగా ప్రతి రాష్ట్రానికి ఎన్నికల ఏజెన్సీలుంటాయి. ఆ ఏజెన్సీలే రాష్ట్రాల వారీగా ఎన్నికలను నిర్వహిస్తాయి. అయితే.. కొన్ని సందర్భాల్లో మినహాయిస్తే.. చాలా వరకు ఫలితాలు ఎన్నికల రోజు అర్ధరాత్రిలోగా.. లేదంటే తర్వాతి రోజు మధ్యాహ్నం వరకు వస్తాయి. ఈ సారి మాత్రం ఈ నెల 11వ తేదీ వరకు పూర్తిస్థాయి ఫలితాలు వస్తాయని అంచనా. కొత్త అధ్యక్షుడు వచ్చే ఏడాది జనవరి 20న ప్రమాణ స్వీకారం చేస్తారు.
బ్యాలెట్‌లో బెంగాలీ
న్యూయార్క్ నగరంలో బ్యాలెట్‌పై ఇంగ్లి్‌షతోపాటు.. చైనీస్, స్పానిష్, కొరియన్, బెంగాలీ భాషలకు చోటు కల్పించారు. ఈ విషయాన్ని న్యూయార్క్ రాష్ట్ర ఎన్నికల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మైఖేల్ రియాన్ వెల్లడించారు. గతంలో ఓ కోర్టు కేసు సందర్భంగా వచ్చిన తీర్పునకు అనుగుణంగా.. ఈ సారి బ్యాలెట్‌పై బెంగాల్‌కు చోటు దక్కింది. ఈ తరహా వెసులుబాటు న్యూయార్క్ నగరానికి మాత్రమే పరిమితం.
Updated Date - Nov 05 , 2024 | 09:34 AM