భారత్‌పై కెనడా ఆంక్షలు?
ABN, Publish Date - Oct 16 , 2024 | 01:31 AM
ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీ్‌పసింగ్ నిజ్జర్ హత్యపై భారత్, కెనడా మధ్య మొదలైన దౌత్య వివాదం మరింత ముదిరింది. ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్న నేపథ్యంలో భారత్‌పై ఆంక్షలు విధించే అవకాశాలను తోసిపుచ్చలేమని, ఈ విషయంలో నిర్ణయం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని కెనడా విదేశాంగ మంత్రి మెలానీ జోలీ తాజాగా వ్యాఖ్యలు చేశారు. రాయల్
విధించే అవకాశాలను తోసిపుచ్చలేం.. కెనడా మంత్రి మెలానీ జోలీ వ్యాఖ్యలు
కెనడియన్లపై దాడులకు దౌత్యవేత్తలను, వ్యవస్థీకృత నేర శక్తులను వాడుతున్నారు
ఇది భారత్ ఘోర తప్పిదం: ట్రూడో
న్యూఢిల్లీ/ఒట్టావా, అక్టోబరు 15: ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీ్‌పసింగ్ నిజ్జర్ హత్యపై భారత్, కెనడా మధ్య మొదలైన దౌత్య వివాదం మరింత ముదిరింది. ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్న నేపథ్యంలో భారత్‌పై ఆంక్షలు విధించే అవకాశాలను తోసిపుచ్చలేమని, ఈ విషయంలో నిర్ణయం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని కెనడా విదేశాంగ మంత్రి మెలానీ జోలీ తాజాగా వ్యాఖ్యలు చేశారు. రాయల్ కెనడియన్ మౌంట్ పోలీస్ (ఆర్‌సీఎంపీ) సేకరించిన ఆధారాలే భారత దౌత్యవేత్తను బహిష్కరించాలన్న నిర్ణయానికి కారణమని తెలిపారు. రెండు దేశాల పరస్పర ప్రయోజనాల కోసం జరుగుతున్న దర్యాప్తునకు సహకరించాలని భారత ప్రభుత్వాని జోలీ కోరారు. దౌత్యపరమైన ప్రత్యేక వెసులుబాట్లను రద్దుచేసి దర్యాప్తునకు సహకరించాలని భారత్‌ను కోరామని, కానీ వారు నిరాకరించారని చెప్పారు. ఈ విషయంలో భారత్‌పై ఒత్తిడి తెచ్చేలా భారత్‌పై ఒత్తిడి తెస్తూనే ఉంటామని, ఫైవ్ ఐస్ భాగస్వాములతో పాటు జీ7 దేశాలతో కూడా సంప్రదింపులు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. భారత్‌తో దౌత్యపరమైన ఘర్ణణలను తాము కోరుకోవడం లేదని తెలిపారు. కాగా, కెనడియన్లపై దాడి చేయడానికి, వారిలో భయాందోళనలు రేకెత్తించడానికి తమ దౌత్యవేత్తలను, వ్యవస్థీకృత నేరగాళ్లను వినియోగించడం ద్వారా భారత్ ఘోర తప్పిదానికి పాల్పడిందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించారు. కెనడాలో హత్యాకాండలు, హింసాత్మక ఘటనలకు పాల్పడటంలో భారత ఏజెంట్లు కీలక పాత్ర పోషిస్తున్నారని ఆరోపిస్తూ ఆర్‌సీఎంపీ చీఫ్ నివేదిక సమర్పించిన తర్వాత ట్రూడో మీడియాతో మాట్లాడారు. ఈ ధోరణి మా దేశ పౌరుల భద్రతకు తీవ్ర ముప్పు అని పేర్కొన్నారు. తమ భాగస్వామ్య దేశాలతోనూ ఈ అంశంపై చర్చించామని, అక్కడ కూడా వారు భారత్ నుంచి ఇలాంటి ప్రవర్తనను ఎదుర్కొన్నారని తెలిపారు. ‘భారత ఏజెంట్లు కెనడియన్ల భద్రతకు ముప్పు కలిగించే కార్యకలాపాల్లో నిమగ్నమై ఉన్నారని ఆర్‌సీఎంపీ తన నివేదికలో ఆధారాలతో సహా వెల్లడించిం’ అని ట్రూడో ఆరోపించారు. మరోవైపు బిష్ణోయ్ గ్యాంగ్‌తో చేతులు కలిపిన భారత ఏజెంట్లు తమ దేశంలో కోవర్టు ఆపరేషన్లు చేస్తున్నారని కెనడా తీవ్ర ఆరోపణలు చేసింది. కెనడాలో నివసించే దక్షిణాసియా సమాజాన్ని ప్రత్యేకించి ఖలిస్థానీ మద్దతుదారులను భారత ఏజెంట్లు లక్ష్యంగా చేసుకున్నారని రాయల్ కెనడియన్ మౌంట్ పోలీస్ (ఆర్‌సీఎంపీ) ఆరోపించింది. ఈ సందర్భంగా బిష్ణోయ్ గ్యాంగ్ గురించి కూడా ప్రస్తావించింది. ‘కొన్ని ముఠాల సాయంతో భారత ఏజెంట్లు కెనడా భూభాగంపై వ్యవస్థీకృత నేరాలకు పాల్పడుతున్నారు. ప్రత్యేకించి ఇందులో బిష్ణోయ్ గ్రూపు కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. ఈ గ్యాంగ్‌కు భారత ఏజెంట్లతో సంబంధాలు ఉన్నాయని విశ్వసిస్తున్నాం’ అని ఆర్‌సీఎంపీ అసిస్టెంట్ కమిషనర్ బ్రిగెట్టె గౌవిన్ వ్యాఖ్యానించారు. అయితే కెనడాలోని క్రిమినల్ ముఠాలతో భారత ఏజెంట్లకు సంబంధాలను అంటగడుతూ ఆ దేశ అధికారులు చేస్తున్న ప్రయత్నాలను భారత్ ఖండించింది. నిజ్జర్ కేసులో భారత్‌కు సాక్ష్యాధారాలు అందించామని ఒట్టావా చేస్తున్న వాదనలో ఏమాత్రం వాస్తవం లేదని ఇక్కడి అధికార వర్గాలు స్పష్టం చేశాయి. కెనడాలో పౌరులను లక్ష్యంగా చేసుకొని భారత్ కోవర్టు ఆపరేషన్లు నిర్వహిస్తోందంటూ ఆ దేశ ప్రధాని ట్రూడో చేసిన ఆరోపణలను కూడా ఆ వర్గాలు తోసిపుచ్చాయి. అస్పష్ట ఆరోపణలు చేయడం, తిరస్కరిస్తే నిందలు మోపడం అనే విధానాన్ని కెనడా మొదటినుంచీ అవలంబిస్తోందని మండిపడ్డాయి.
వ్యతిరేకతను తప్పించుకోవడానికేనా?
కెనడాలో ప్రజలతో పాటు సొంత పార్టీలో పెరిగిపోతున్న వ్యతిరేకతను తప్పించుకోవడానికే ప్రధాని జస్టిన్ ట్రూడో హఠాత్తుగా నిజ్జర్ హత్య కేసును తవ్వి తీశారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అధికారంపై క్రమంగా పట్టు సడలిపోతుండటంతో భారత్‌పై వ్యూహాత్మకంగా నిందలకు పాల్పడుతున్నారని నిపుణులు పేర్కొంటున్నారు. రెండు రోజుల క్రితం ట్రూడోకు వ్యతిరేకంగా ఆ దేశ పార్లమెంట్ హాల్‌లో సొంత పార్టీ నేతలే సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టినట్లు సమాచారం. లిబరల్ పార్టీ ఎంపీలు పెద్దసంఖ్యలో ఇందులో పాల్గొన్నట్లు తెలిసింది. వచ్చే అక్టోబరులో జరిగే ఫెడరల్ ఎన్నికలకు ట్రూడో నేతృత్వంలో బరిలోకి దిగితే ఓటమి తప్పదని సొంత పార్టీ నేతలే భావిస్తున్నారు. మరోవైపు ట్రూడో ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న న్యూ డెమొక్రటిక్ పార్టీ (ఎన్‌డీపీ) గత నెలలోనే తన మద్దతును ఉపసంహరించుకుంది. ఈ పార్టీ కోసమే భారత్‌తో ట్రూడో విరోధం పెట్టుకున్నారు. కాగా, కెనడాలో నివసిస్తున్న లక్షలాది మంది సిక్కు ఓటర్లను ఆకట్టుకోవడానికి ఇరు దేశాల మధ్య సంబంధాలను ఫణంగా పెట్టడానికి సైతం ట్రూడో వెనుకాడటం లేదు. గతేడాది భారత్‌లో నిర్వహించిన జి20 సమావేశాల తర్వాతే నిజ్జర్ హత్య వివాదం తెరపైకి వచ్చింది. భారత్‌పై ఆంక్షలు విధించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు ఆ దేశ విదేశాంగ మంత్రి మెలానీ జోలీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన వెంటనే దీనికి ఎన్‌డీపీ నేత జగ్మీత్ సింగ్ వంతపాడటం గమనార్హం.
Updated Date - Oct 16 , 2024 | 01:31 AM