Donald Trump: అమెరికా చరిత్రలో తొలిసారి.. కీలక పదవికి మహిళ పేరు ప్రకటించిన డొనాల్డ్ ట్రంప్
ABN, Publish Date - Nov 08 , 2024 | 09:13 AM
అమెరికా అధ్యక్ష ఎన్నికలు-2024లో గ్రాండ్ విక్టరీ సాధించిన రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్.. తన పాలనా యంత్రాంగాన్ని సిద్ధం చేసుకోవడంపై దృష్టిసారించారు. ఈ మేరకు గురువారం కీలక ప్రకటన చేశారు. అమెరికా చరిత్రలో తొలిసారి వైట్ హౌస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా సూసీ వైల్స్ పేరుని ప్రకటించారు.
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికలు-2024లో గ్రాండ్ విక్టరీ సాధించిన రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్.. తన పాలనా యంత్రాంగాన్ని సిద్ధం చేసుకోవడంపై దృష్టిసారించారు. ఈ మేరకు గురువారం కీలక ప్రకటన చేశారు. అమెరికా చరిత్రలో తొలిసారి వైట్ హౌస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా ఒక మహిలను ఎంపిక చేశార. సూసీ వైల్స్ పేరుని ఆయన ప్రకటించారు. ఈ పదవిని చేపట్టనున్న తొలి మహిళగా ఆమె రికార్డు సృష్టించనున్నారు. 67 ఏళ్ల సూసీ వైల్స్.. ట్రంప్ ఎన్నికల ప్రచారంలో కీలక భూమిక పోషించారు.
‘‘అమెరికన్ చరిత్రలో గొప్ప రాజకీయ విజయాలలో ఒక దానిని సాధించడంలో సూసీ వైల్స్ నాకు ఎంతగానో సాయపడ్డారు. 2016, 2020లో విజయవంతమైన ఎన్నికల ప్రచారాలలో కూడా ఆమె భాగస్వామిగా ఉన్నారు. సూసీ వైల్స్ చాలా ధృడమైన, తెలివైన, వినూత్నమైన వ్యక్తి. అందరూ ప్రశంసించదగిన, గౌరవించదగిన మనిషి. అమెరికా చరిత్రలో మొట్టమొదటి మహిళా చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా సూసీ అర్హత కలిగిన వ్యక్తి’’ అని డొనాల్డ్ ట్రంప్ మెచ్చుకున్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన రెండు రోజుల తర్వాత ట్రంప్ ఈ ప్రకటన చేశారు. వైల్స్‌ను తామంతా ‘ఐస్ బేబీ’ అని పిలుస్తుంటామని, ఆమె బ్యాక్‌గ్రౌండ్‌లో ఉండడానికి ఇష్టపడతారని అన్నారు.
కాగా ట్రంప్ చేసిన ఈ ప్రకటనపై అమెరికా ఉపాధ్యక్షుడిగా త్వరలోనే బాధ్యతలు స్వీకరించబోతున్న జేడీ వాన్స్ స్పందించారు. ‘గ్రేట్ న్యూస్’ అని అభివర్ణించారు. ఎన్నికల ప్రచారంలో ట్రంప్‌కు సూసీ కీలకంగా వ్యవహరించారని గుర్తుచేశారు.
‘‘ ఆమె వైట్‌హౌస్‌లో కూడా ఒక పెద్ద అసెట్ అవుతారు. ఆమె నిజంగా చాలా మంచి వ్యక్తి’’ అని కొనియాడారు. కాగా సూసీ వైల్స్ మే 14, 1957న జన్మించారు. సుదీర్ఘకాలంగా రాజకీయ వ్యూహకర్తగా ఉన్నారు. ఆమె గతంలో రోనాల్డ్ రీగన్ ‘1980 అధ్యక్ష ఎన్నికల’ ప్రచారంలో పనిచేశారు. 2018లో జరిగిన ఎన్నికలలో ఫ్లోరిడా రిపబ్లికన్ గవర్నర్ రాన్ డిసాంటిస్ విజయం సాధించడంలో కూడా ఆమె కీలకంగా వ్యవహరించారు. తన కెరీర్ ప్రారంభంలో రిపబ్లికన్ యూఎస్ ప్రతినిధులు జాక్ కెంప్, టిల్లీ ఫౌలర్‌ల వద్ద కూడా ఆమె పనిచేశారు. ట్రంప్‌కు 2016, 2020 ఎన్నికల సమయంలో కూడా సీనియర్ సలహాదారుగా బాధ్యతలు నిర్వర్తించారు.
Updated Date - Nov 08 , 2024 | 09:14 AM