Donald Trump: ట్రంప్‌ని ఇంటర్వ్యూ చేసిన ఎలాన్ మస్క్.. సంచలన వ్యాఖ్యలు
ABN, Publish Date - Aug 13 , 2024 | 08:23 AM
అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌ను టెస్లా, ఎక్స్‌ల అధినేత, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ఇంటర్వ్యూ చేశారు. ఎక్స్ వేదికగా టెలికాస్ట్ చేసిన ఈ ఇంటర్వ్యూలో ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌ను టెస్లా, ఎక్స్‌ల అధినేత, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ఇంటర్వ్యూ చేశారు. ఎక్స్ వేదికగా టెలికాస్ట్ చేసిన ఈ ఇంటర్వ్యూలో ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తిరుగుబాటు కారణంగానే అధ్యక్షుడు జో బిడెన్ అధ్యక్ష ఎన్నికలు-2024 రేసు నుంచి నిష్క్రమించారని తీవ్ర ఆరోపణలు గుప్పించారు. ‘‘డిబేట్‌లో బిడెన్‌ను నేను చిత్తుచిత్తుగా ఓడించాను. ఆ తర్వాత ఆయన బలవంతంగా ఎన్నికల రేసు నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఇప్పటివరకు జరిగిన గొప్ప డిబేట్‌లలో ఇదొకటి. బిడెన్ నిష్క్రమణ ఒక తిరుగుబాటు’’ అని వ్యాఖ్యానించారు. ట్రంప్ వ్యాఖ్యలకు ఎలాన్ మస్క్ మరింత మసాలా దట్టించారు. ‘‘ప్రాథమికంగా తెలిసిన దాన్ని బట్టి వాళ్లు అతడిని (బైడెన్) ఒక షెడ్ వెనుకకు తీసుకెళ్లి తుపాకీ గురిపెట్టారట’’ అని అన్నారు.
ఇక గత నెలలో తనపై జరిగిన హత్యాయత్నం ఘటనపై కూడా డొనాల్డ్ ట్రంప్ ట్రంప్ మాట్లాడారు. ‘‘ అది బుల్లెట్ అని నాకు వెంటనే అర్థమైంది. చెవిలోంచి దూసుకెళ్లినప్పుడే బుల్లెట్ అని పసిగట్టాను. దేవుడిని నమ్మని వారి గురించి మనమందరం ఆలోచించడం మొదలుపెట్టాలని నేను భావిస్తున్నాను’’ అని ఈ సందర్భంగా ట్రంప్ వ్యాఖ్యానించారు.
ఇంటర్వ్యూ ప్రసారంపై టెక్నికల్ దాడి
ఎక్స్ వేదికగా ప్రసారమైన డొనాల్డ్ ట్రంప్ ఇంటర్వ్యూ ప్రసారంపై డీడీవోఎస్ (distributed denial-of-service ) ఎటాక్ జరిగింది. ఇంటర్వ్యూ ట్రాఫిక్‌ను దెబ్బతీయడమే లక్ష్యంగా ఈ దాడి జరిగింది. ఒక సర్వర్, సేవ లేదా నెట్‌వర్క్ సాధారణ ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించడమే లక్ష్యంగా చేసే ఈ దాడి కారణంగా ఇంటర్వ్యూ షెడ్యూల్ సమయానికంటే కాస్త ఆలస్యంగా జరిగింది. దీంతో తక్కువ మంది యూజర్లు మాత్రమే ట్రంప్-ఎలాన్ మస్క్ ఇంటర్వ్యూ చూడగలిగారు. తొలుత సాంకేతిక సమస్య అనుకున్నారు. ఆ తర్వాత దాడి జరిగినట్టు గుర్తించారు. దీంతో చాలా మంది ఎక్స్ యూజర్లు ఇంటర్వ్యూను చూడలేకపోయారు.
ఎక్స్‌లోె లైవ్ టెలికాస్ట్ అయిన ఈ ఇంటర్వ్యూను ప్రారంభంలో ఏకంగా 1 మిలియన్ కంటే ఎక్కువ మంది వీక్షించారు. దీనిపై ట్రంప్ స్పందిస్తూ.. అన్ని రికార్డులు బద్దలు కొట్టినందుకు సంతోషంగా ఉందని అన్నారు. ఇది శతాబ్దపు ఇంటర్వ్యూ అని ట్రంప్ వ్యాఖ్యానించారు.
Updated Date - Aug 13 , 2024 | 08:26 AM