Russia-Ukraine War: రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగిస్తా.. డొనాల్డ్ ట్రంప్ హామీ
ABN, Publish Date - Jul 20 , 2024 | 07:24 PM
రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం ప్రారంభమై రెండేళ్లపైనే అవుతున్నా.. ఇంకా కొనసాగుతూనే ఉంది. ఆ రెండు దేశాలు పరస్పర దాడులతో ఈ యుద్ధాన్ని మరింత ఉధృతం చేస్తూనే ఉన్నాయి.
రష్యా, ఉక్రెయిన్ (Russia-Ukraine War) మధ్య యుద్ధం ప్రారంభమై రెండేళ్లపైనే అవుతున్నా.. ఇంకా కొనసాగుతూనే ఉంది. ఆ రెండు దేశాలు పరస్పర దాడులతో ఈ యుద్ధాన్ని మరింత ఉధృతం చేస్తూనే ఉన్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్ని బట్టి చూస్తే.. ఈ యుద్ధం ఇప్పుడప్పుడే ఆగేలా కనిపించడం లేదు. సుదీర్ఘకాలం కొనసాగే అవకాశం ఉంది. అయితే.. తాను అమెరికా ఎన్నికల్లో గెలిస్తే, ఈ యుద్ధాన్ని ముగిస్తానని డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) పేర్కొన్నారు. ఈ మేరకు తాను ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్‌స్కీకి (Volodymyr Zelenskyy) హామీ ఇచ్చినట్లు తెలిపారు.
‘‘శుక్రవారం జెలెన్‌స్కీతో ఫోన్‌లో మాట్లాడటం జరిగింది. రిపబ్లికన్ పార్టీ జాతీయ సదస్సు విజయవంతం అయినందుకు నాకు అభినందనలు తెలిపారు. నాపై జరిగిన దాడిని కూడా ఖండించారు. నేను తదుపరి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే.. ఎంతోమందిని బలి తీసుకున్న యుద్ధాన్ని చర్చల ద్వారా ముగించేందుకు ప్రయత్నిస్తాను. ప్రపంచ శాంతిని తీసుకొస్తాను. ఇరు పక్షాల వారు కలిసొచ్చి.. హింసను అంతం చేసి, శ్రేయస్సుకు మార్గం సుముగం చేసే ఒప్పందంపై చర్చలు జరిపేందుకు ముందుకు వస్తాయని నేను ఆశిస్తున్నాను’’ అని సోషల్ మీడియా వేదికగా ట్రంప్ చెప్పుకొచ్చారు. అసలు 2022లో తాను అధికారంలో ఉండి ఉంటే.. ఈ యుద్ధమే జరిగేది కాదని పేర్కొన్నారు.
ఇదే సమయంలో.. జెలెన్‌స్కీ సైతం ట్రంప్‌తో జరిగిన ఫోన్ సంభాషణ గురించి ఎక్స్ వేదికగా ఓ పోస్టు పెట్టారు. ఉక్రెయిన్ స్వేచ్ఛ, స్వాతంత్రాన్ని రక్షించడంలో అమెరికా మద్దతుని తాను గుర్తించానని అన్నారు. రష్యా దాడులను ఎదుర్కునేందుకు తమకు సహాయం అందిస్తున్న యునైటెడ్ స్టేట్స్‌కి కృతజ్ఞతలు అని తెలిపారు. అయితే.. ఇప్పటికీ రష్యా తమ నగరాలు, గ్రామాలపై ప్రతిరోజూ దాడులు చేస్తూనే ఉందన్నారు. ఏదేమైనప్పటికీ.. ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించి, శాంతిని నెలకొల్పేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న విషయాలపై చర్చించేందుకు తాము ట్రంప్‌తో అంగీకరించామని అన్నారు. మరి.. దీనిపై రష్యా ఎలా స్పందిస్తుందో చూడాలి.
Read Latest International News and Telugu News
Updated Date - Jul 20 , 2024 | 07:24 PM