Donald Trump: ట్రంప్‌పై కాల్పుల కేసులో మరో షాకింగ్ విషయం.. ముందుగానే హింట్
ABN, Publish Date - Jul 18 , 2024 | 07:23 PM
యావత్ ప్రపంచాన్నే హడలెత్తించిన అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై కాల్పుల కేసులో రోజుకో షాకింగ్ విషయం వెలుగులోకి వస్తోంది. ఈ దాడి వెనుక నిందితుడు థామస్ మాథ్యూ క్రూక్స్ ఉద్దేశం ఏంటనేది..
యావత్ ప్రపంచాన్నే హడలెత్తించిన అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై (Donald Trump) కాల్పుల కేసులో రోజుకో షాకింగ్ విషయం వెలుగులోకి వస్తోంది. ఈ దాడి వెనుక నిందితుడు థామస్ మాథ్యూ క్రూక్స్ (Thomas Mathew Crooks) ఉద్దేశం ఏంటనేది ఇంకా వెలుగులోకి రాలేదు కానీ.. తాజాగా ఓ కీలక సమాచారాన్ని దర్యాప్తు అధికారులు వెలికి తీశారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా అధికారులు క్రూక్స్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ని పరిశీలించగా.. ఈ దాడి గురించి అతను ముందుగానే ఓ పోస్టు ద్వారా సంకేతం ఇచ్చినట్లు కనుగొన్నారు. ‘‘జులై 13వ తేదీ నాకు ఎంతో ముఖ్యమైంది. అదేంటో మీకు ఆరోజే తెలుస్తుంది’’ అంటూ క్రూక్స్ రాసుకొచ్చాడు. దీంతో.. మరింత సమాచారం సేకరించేందుకు గాను అధికారులు అతను వాడిన గన్ టెక్నాలజీతో పాటు మొబైల్ ఫోన్, లాప్‌టాప్‌లను క్షుణ్ణంగా శోధిస్తున్నారు.
కాగా.. దర్యాప్తులో భాగంగా క్రూక్స్ రెండు మొబైల్ ఫోన్లను కలిగి ఉన్నట్లు తేలింది. ఒక ఫోన్‌ను సంఘటనా స్థలంలోనే స్వాధీనం చేసుకున్నారు. మరో ఫోన్ అతని ఇంట్లో లభ్యమైంది. ఈ ఫోన్‌లో కేవలం 27 కాంటాక్ట్ నంబర్లు మాత్రమే ఉన్నాయని నివేదికలు పేర్కొన్నాయి. మొదటి ఫోన్‌లో మాత్రం డొనాల్డ్ ట్రంప్‌తో పాటు ప్రస్తుతం అధ్యక్షుడు జో బైడెన్ ఫోటోలు ఉన్నట్లు గుర్తించారు. అంతేకాదు.. పెన్సిల్వేనియాలో ట్రంప్ నిర్వహించిన ప్రచార కార్యక్రమానికి సంబంధించిన సమాచారం కూడా అందులో ఉంది. అంతకుముందు.. ట్రంప్‌పై కాల్పులు జరపడానికి ఒకరోజు ముందు అతను షూటింగ్ ప్రాక్టీస్ చేసినట్లు విచారణలో వెల్లడైంది. అంతేకాదు.. ఒక షాప్ నుంచి బుల్లెట్లతో పాటు ఐదు అడుగుల నిచ్చెన కొనుగోలు చేసినట్లు కూడా తేలింది. ఆ నిచ్చెన సహకారంతోనే అతను భవనంపైకి ఎక్కి.. ట్రంప్‌పై కాల్పులు జరిపినట్లు అధికారులు తేల్చారు.
అసలు ఆరోజు ఏం జరిగింది?
అది 2024 జులై 13వ తేదీ. అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో భాగంగా.. పెన్సిల్వేనియాలో డొనాల్డ్ ట్రంప్ ఓ ర్యాలీ నిర్వహించారు. ఆయన ప్రసంగిస్తున్న సమయంలో.. నిందితుడు క్రూక్స్ 130 మీటర్ల దూరంలో ఉన్న ఓ భవనంపై నుంచి కాల్పులు జరిపాడు. అయితే.. ట్రంప్ తన తలను పక్కకు తిప్పడం వల్ల బుల్లెట్ ఆయన చెవిని తాకుతూ దూసుకెళ్లింది. దీంతో.. ట్రంప్ ప్రాణాల నుంచి బయటపడ్డారు. ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించారు. మరోవైపు.. క్రూక్స్ కాల్చిన కొన్ని క్షణాల్లోనే సీక్రెట్ సర్వీస్ స్నైపర్లు అతనిని గుర్తించి కాల్చి చంపేశారు. ప్రస్తుతం ఈ కేసుని ఎఫ్‌బీఐ దర్యాప్తు చేస్తోంది. అయితే.. ఈ దాడి వెనుక క్రూక్స్ ఉద్దేశం ఏంటనేది మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది.
Read Latest International News and Telugu News
Updated Date - Jul 18 , 2024 | 07:23 PM