Joe Biden: తదుపరి తరానికి దారి ఇవ్వాల్సిన సమయం ఇదీ: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్
ABN, Publish Date - Jul 25 , 2024 | 09:10 AM
అమెరికా అధ్యక్ష ఎన్నికలు-2024 రేసు నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించిన అనంతరం ప్రెసిడెంట్ జో బిడెన్ తొలిసారి బుధవారం స్పందించారు. అమెరికా మార్గదర్శకత్వాన్ని యువతరానికి అందిస్తున్నానంటూ ఆయన వ్యాఖ్యానించారు.
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికలు-2024 రేసు నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించిన అనంతరం ప్రెసిడెంట్ జో బిడెన్ తొలిసారి బుధవారం స్పందించారు. అమెరికా మార్గదర్శకత్వాన్ని యువతరానికి అందిస్తున్నానంటూ ఆయన వ్యాఖ్యానించారు. యువ గళాలకు కాగడాను అందించాల్సిన తరుణం ఆసన్నమైందని ఆయన అన్నారు. ఈ మేరకు అమెరికన్లను ఉద్దేశించి ‘ఓవల్ ఆఫీస్’ నుంచి ఆయన చారిత్రాత్మకమైన ప్రసంగం చేశారు. డెమొక్రాటిక్ పార్టీని, దేశాన్ని ఏకం చేసేందుకే తాను 2024 ఎన్నికల నుంచి వైదొలగుతున్నట్టు ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. ప్రజాస్వామ్యం సంరక్షణ అన్నింటి కంటే ముఖ్యమైనదని, నవ తరానికి కాగడాను అందించడమే ఉత్తమ మార్గం అని తాను నిర్ణయించుకున్నానని, అమెరికాను ఐక్యం చేయడానికి అదే ఉత్తమ మార్గమని ఆయన అన్నారు. కష్టపడే సామర్థ్యం ఉన్న వైస్ ప్రెసిడెంట్ కమలా హారీస్ డెమొక్రాటిక్ పార్టీ ప్రెసిడెన్షియల్ నామినీగా ఎంపికయ్యారని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు.
డొనాల్డ్ ట్రంప్‌తో పోల్ డిబేట్‌లో జో బైడెన్ వెనుకబడడం, ఆ తర్వాత ట్రంప్‌పై హత్యాయత్నం నేపథ్యంలో ఎన్నికల రేసు నుంచి తప్పుకోవాలంటూ డెమొక్రాటిక్ శ్రేణులు బైడెన్‌పై తీవ్రమైన ఒత్తిడి తీసుకొచ్చాయి. దాదాపు రెండు వారాల తర్వాత ఆయన రేసు నుంచి వైదొలిగారు. దీంతో భారతీయ మూలాలు ఉన్న కమలా హ్యారీస్ రేసులోకి వచ్చిన విషయం తెలిసిందే.
అమెరికా రాజకీయాల్లో ప్రతీకారాలకు ముగింపు పలకాలని, దేశం కంటే ఏ నియంతృత్వం, నిరంకుశం ఎక్కువ కాదు అంటూ బైడెన్ పవర్ ఫుల్ ప్రసంగం ఇచ్చారు. యువ గళాలకు, సరికొత్త నేతలకు సమయం సమయం ఆసన్నమైందని, ఆ సమయం ఇదేనని అన్నారు. కాగా జీవితంలో అత్యంత కీలక ప్రసంగం చేస్తున్న సమయంలో ఆయన కుటుంబ సభ్యులు ఓవల్ కార్యాలయంలో ఆయన ముందు కూర్చొని విన్నారు. ఆయనకు సపోర్టుగా అక్కడే ఉన్నారు. భార్య జిల్ బైడెన్, కూతురు యాష్లే, కొడుకు హంటర్ ఉన్నారు. ప్రసంగం ముగిసిన తర్వాత ఆయన వద్దకు వెళ్లి ఆప్యాయంగా చేతులు పట్టుకున్నారు. బిడెన్ మనవరాళ్లు కూడా ఓవల్ ఆఫీస్‌కు వచ్చారు.
బైడెన్ ప్రసంగంపై ట్రంప్ స్పందన..
అధ్యక్షుడు జో బైడెన్ ప్రసంగంపై రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష నామినీ డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. వండి వార్చిన జో బిడెన్ ఓవల్ ఆఫీస్ ప్రసంగం అర్థమైంది. చాలా చెడ్డగా ఉందని ట్రంప్ అన్నారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా స్పందించారు. కాగా అధ్యక్ష ఎన్నికలకు ఫిట్ కాని వ్యక్తి అధ్యక్షుడిగా మాత్రం ఎలా కొనసాగుతారని, వైగొలగాలంటూ రిపబ్లికన్ పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. అధ్యక్షుడిగా పనిచేయడానికి ఆయన తగినవాడు కాదని అంటున్నారు.
ఈ విమర్శలకు జో బైడెన్ సమాధానం ఇచ్చారు. తాను కుంటివాడిని కాదని, పదవిలో ఉన్నంత కాలం ఆర్థిక వ్యవస్థ, కీలకమైన విదేశాంగ విధాన సమస్యలపై పని చేస్తూనే ఉంటానని స్పష్టం చేశారు. రాబోయే ఆరు నెలల్లో తాను అధ్యక్షుడిగా పని చేయడంపై దృష్టి పెడతానని చెప్పారు.కాగా బిడెన్ లేకుండానే అమెరికా ఎన్నికల ప్రచారం జరుగుతోంది. డెమొక్రాటిక్ పార్టీ నామినీగా కమలా హ్యారీస్‌కు పార్టీ ప్రతినిధుల మద్ధతు లభిస్తుండడంతో ఆమె ప్రచారంలో దూసుకెళ్తున్నారు.
Updated Date - Jul 25 , 2024 | 10:36 AM