Iran: ఒకే వ్యక్తిని రెండో సారి ఉరితీయనున్న కోర్టు.. డబ్బులుంటే బతికేవాడేమో..
ABN, Publish Date - Nov 13 , 2024 | 06:50 PM
ఇరాన్ లో జైలు జీవితం అనుభవిస్తున్న వారి జీవితం దుర్భరంగా ఉంది. ఒకే కేసులో రెండో సారి ఉరికంభం ఎక్కుతున్న యువకుడి కథ ఇది.
ఇరాన్‌లో చట్టాలు ఎంత కఠినంగా ఉంటాయో తెలిపే ఘటన ఇది. నష్టపరిహారం చెల్లించేందుకు డబ్బులు లేని కారణంగా ఓ యువకుడు రెండో సారి ఉరికంభం ఎక్కనున్నాడు. మొదటి సారి ప్రాణాలతో బయటపడినప్పటికీ గురువారం అతడిని రెండో సారి ఉరి తీసేందుకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
వివరాల్లోకి వెళ్తే.. అహ్మద్ అలీజాదే అనే 26 ఏళ్ల యువకుడు 2018 నుంచి ఓ మర్డర్ కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. అతడు ఆ నేరాన్ని అంగీకరించకపోయినప్పటికీ కోర్టు అతడికి ఉరిశిక్ష విధించింది. ఏప్రిల్ 27న అహ్మద్ ని ఉరితీసిన 28 సెకన్లకు బాధిత కుటుంబీకులు ‘క్షమించండి’ అంటూ బిగ్గరగా అరిచారు. దీంతో వెంటనే అతడిని కిందకు దించేశారు. అప్పటికే కొన ప్రాణాలతో ఉన్న అతడు ఎలాగోలా బతికి బట్టగట్టాడు. తాజాగా నష్టపరిహారం విషయంలో నిందితుడి కుంటుంబంతో రాజీ కుదరకపోవడంతో గురువారం అతడికి మరోసారి ఉరి శిక్ష ఖరారు కానుంది. ఈ విషయాన్ని ఇరాన్‌లో మరణశిక్షలను నివేదిస్తున్న నార్వే కేంద్రంగా పనిచేసే ఇరాన్ హ్యూమన్ రైట్స్(ఐహెచ్‌ఆర్ ) పేర్కొంది.
ఇరాన్‌లో క్షమాభిక్ష లేదా పరిహారాన్ని కోరడం ద్వారా నేరస్థుడిని శిక్ష నుంచి తప్పించే వీలుంటుంది. కానీ, చాలా కేసుల్లో ఆ పరిహారం భారీగా ఉండటంతో ఉరిశిక్షే అమలవుతుందని సామాజిక కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇరాన్‌లో ఇటీవల ఉరిశిక్షలు భారీగా పెరిగాయని ఐహెచ్‌ఆర్ పేర్కొంది. ఒక్క అక్టోబర్‌లోనే రికార్డు స్థాయిలో 166 మందికి ఉరిశిక్ష అమలు చేసినట్లు గణాంకాలు చెప్తున్నాయి. చైనా మినహా మరే దేశంలో లేని విధంగా ఇరాన్‌లో మరణశిక్షలు అమలవుతున్నాయని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేశారు.
Death Secrets: ప్రాణం పోయిన 2 గంటల్లోపు ఏం జరుగుతుంది.. డెత్ సీక్రెట్స్ చెప్పిన సీనియర్ నర్సు
Updated Date - Nov 13 , 2024 | 06:52 PM