Jaishankar: ఎస్‌సీఓ సమ్మిట్ కోసం పాక్‌కు చేరిన జైశంకర్
ABN, Publish Date - Oct 15 , 2024 | 08:32 PM
జైశంకర్‌కు నూర్ ఖాన్ ఎయిర్‌బేస్ వద్ద పాకిస్థాన్ సీనియర్ అధికారులు సాదర స్వాగతం పలికారు. భారత్-పాక్ మధ్య సంబంధాలు దిగజారిన క్రమంలో భారత సీనియర్ మంత్రి ఆదేశంలో అడుగుపెట్టడం గత తొమ్మిదేళ్లలో ఇదే మొదటిసారి.
ఇస్లామాబాద్: షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) సమ్మిట్‌కు హాజరయ్యేందుకు భారత విదేశాంగ శాఖ మంత్రి సుబ్రమణియం జైశంకర్ (Subrahmanyam Jaishankar) మంగళవారంనాడు ఇస్లామాబాద్ (Islamabad) చేరుకున్నారు. ఆయనకు నూర్ ఖాన్ ఎయిర్‌బేస్ వద్ద పాకిస్థాన్ సీనియర్ అధికారులు సాదర స్వాగతం పలికారు. భారత్-పాక్ మధ్య సంబంధాలు దిగజారిన క్రమంలో భారత సీనియర్ మంత్రి ఆదేశంలో అడుగుపెట్టడం గత తొమ్మిదేళ్లలో ఇదే మొదటిసారి. చివరిసారిగా 2015 డిసెంబర్‌లో అప్పటి భారత విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ ఆప్ఘనిస్థాన్‌లో సదస్సు కోసం ఇస్లామాబాద్ వెళ్లారు. కాగా, ఈసారి రెండ్రోజుల పాటు జరిగే ఎస్‌సీఓ కౌన్సిల్స్ ఆఫ్ హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్ (సీహెచ్‌జీ) సదస్సుకు పాకిస్థాన్ ఆతిథ్యం ఇస్తోంది. ఆర్థిక, వాణిజ్య, పర్యావరణ, సామాజిక-సాంస్కృతిక సంబంధాల్లో సభ్యదేశాల పరస్పర సహకారంపై ఈ సదస్సులో చర్చించనున్నారు. ఎస్‌సీఓ పనితీరును కూడా సమీక్షిస్తారు.
ఇజ్రాయెల్‌పై 9/11 తరహా దాడికి హమాస్ కుట్ర
ఎస్‌సీఓ సభ్యదేశాల ప్రతినిధులకు స్వాగతం పలుకుతూ పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ ఇస్తున్న విందుకు జైశంకర్ హాజరయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. జైశంకర్, పాకిస్థాన్ విదేశాంగ మంత్రి ఇషాఖ్ డర్ మధ్య ద్వైపాక్షిక చర్చలు జరిగే అవకాశాలను మాత్రం ఇరుపక్షాలు కొట్టివేశాయి. ఎస్‌సీఏ సభ్యదేశ ప్రతినిధిగా అందిరిలాగానే తాను ఇస్లామాబాద్ వెళ్తున్నానని, భారత్-పాక్ సంబంధాల గురించి చర్చించడానికి కాదని జైశంకర్ ఇప్పటికే స్పష్టం చేశారు.
భారీ భద్రత
ఇస్లామాబాద్‌లో నిర్వహిస్తున్న 23వ ఎస్‌సీఓ సమ్మిట్‌కు హాజరవుతున్న అతిథిల భద్రత కోసం పాకిస్థాన్ భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేశారు. ఈ ఈవెంట్‌కు ఎలాంటి అవాంతరం లేకుండా కీలక ప్రభుత్వ భవంతులు, రెడ్ జోన్ ఏరియాల్లో ఆర్మీ రేంజర్లను మోహరించారు. ఇస్లామాబాద్ అంతటా అదనపు రేంజర్లను దింపారు. పలు వాణిజ్య సంస్థలను తాత్కాలికంగా మూసేశారు. ఇస్లామాబాద్, రావల్పిండిలో ఎలాంటి సెక్యూరిటీ రిస్క్ లేకుండా కీలకమైన రూట్లను మూసేశారు. 900 మంది ప్రతినిధులు వచ్చే అవకాశం ఉండటంతో వారి భద్రత కోసం 10,000 పోలీసులు, పారామిలటరీ సిబ్బందిని పాక్ ప్రభుత్వం మోహరించింది.
Read More International News and Latest Telugu News
Updated Date - Oct 15 , 2024 | 08:32 PM