Earthquake: జపాన్ భూకంపంలో 73కు పెరిగిన మృతుల సంఖ్య
ABN, Publish Date - Jan 04 , 2024 | 08:50 AM
నూతన సంవత్సరం రోజున సంభవించిన వరుస భూకంపాలు జపాన్ దేశాన్ని అతలాకుతలం చేశాయి. ఒకటి కాదు, రెండు కాదు ఒకే రోజు దేశవ్యాప్తంగా 155 భూకంపాలు సంభవించడంతో తీవ్ర ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి.
టోక్యో: నూతన సంవత్సరం రోజున సంభవించిన వరుస భూకంపాలు జపాన్ దేశాన్ని అతలాకుతలం చేశాయి. ఒకటి కాదు, రెండు కాదు ఒకే రోజు దేశవ్యాప్తంగా 155 భూకంపాలు సంభవించడంతో తీవ్ర ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. వీటి తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.5గా నమోదైంది. భూకంపాలు సంభవించి నేటికి నాలుగు రోజులు గడుస్తున్నప్పటికీ పరిస్థితులు ఇంకా అదుపులోకి రాలేదు. గురువారం కూడా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ప్రకృతి విపత్తులో మృతుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఇప్పటివరకు 73 మంది చనిపోయారు. ఈ మరణాలు అన్నీ కూడా నోటో ద్వీపకల్పం ఉన్న ఇషికావా ప్రిఫెక్చర్‌లోనే నమోదుకావడం గమనార్హం. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయి. భూకంపం సంభవించి మూడు రోజులు గడిచిపోయినప్పటికీ ఇంకా మృతుల సంఖ్యపై స్పష్టత రాలేదు.
కూలిపోయిన భవనాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు నాలుగో రోజు కూడా అన్వేషణ కొనసాగుతోంది. 300 మందికిపైగా గాయపడ్డారు. 25 మంది పరిస్థితి విషమంగా ఉంది. భూకంపం కారణంగా 33 వేలకు పైగా ప్రజలు తమ ఇళ్లను ఖాళీ చేశారు. లక్ష ఇళ్లకు పైగా నీటి సరఫరా అందడం లేదు. మరోవైపు గడ్డకట్టే ఉష్ణోగ్రతలు, భారీ వర్షపాపాత మధ్య శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇషికావాలో ఇవాళ కూడా భారీ వర్షం కురిసే అవకాశాలున్నాయి. 2016 తర్వాత జపాన్‌లో సంభవించిన అత్యంత ఘోరమైన భూకంపం ఇదే. రవాణా మార్గాలు దెబ్బతినడం సహాయక చర్యలకు ఇబ్బందిగా మారాయి.
Updated Date - Jan 04 , 2024 | 08:55 AM