స్నానం చేయించేందుకూ యంత్రం
ABN, Publish Date - Dec 04 , 2024 | 04:00 AM
తువ్వాలు తీసుకుని స్నానాల గదిలోకి వెళ్లి.. బకెట్‌లో నీళ్లు పట్టుకుని.. శరీరం మీద నీళ్లు పోసుకుని, సబ్బు రుద్దుకుంటూ.. వీపు అందక అవస్థలు పడుతూ..
జపాన్‌కు చెందిన షవర్ హెడ్ సంస్థ ఆవిష్కరణ
న్యూఢిల్లీ, డిసెంబరు 3 : తువ్వాలు తీసుకుని స్నానాల గదిలోకి వెళ్లి.. బకెట్‌లో నీళ్లు పట్టుకుని.. శరీరం మీద నీళ్లు పోసుకుని, సబ్బు రుద్దుకుంటూ.. వీపు అందక అవస్థలు పడుతూ.. స్నానం చెయ్యడానికి ప్రతి రోజూ చిరాకు పడుతున్నారా? దుస్తులను ఉతికి ఆరేసే యంత్రాలు, పాత్రలు, పళ్లాలను కడిగి ఆరేసే యంత్రాల మాదిరిగా మనుషులకు స్నానం చేయించే యంత్రాలు కూడా ఉంటే బాగుండు అనుకున్నారా? అయితే ఇది మీకోసమే.. జపాన్‌కు చెందిన షవర్ హెడ్ తయారీ సంస్థ సైన్స్ కో.. మార్కెట్‌లోకి ‘హ్యుమన్ వాషింగ్ మెషీన్’ను తీసుకొస్తుంది. ఓ ప్రత్యేక గదిలా ఉండే ఈ హ్యుమన్ వాషింగ్ మెషీన్ మధ్యలో ఉండే కుర్చీలో ఓ 15 నిమిషాలు కూర్చుంటే చాలు. ఆ యంత్రం స్నానం చేయించడమే కాదు శరీరాన్ని ఆరబెట్టి పంపించేస్తుంది. కృతిమ మేధ(ఏఐ)తో పని చేసే ఇందులోని సాంకేతికత.. లోపల ఉన్న మనిషి శరీర ఉష్ణోగ్రతలు, ఇతర ప్రమాణాలను లెక్కించి తగిన ఉష్ణోగ్రతతో నీటిని విడుదల చేసి శుభ్రంగా స్నానం చేయించి ఆపై శరీరం ఆరేలా చేస్తుంది. వచ్చే ఏప్రిల్‌లో జరగనున్న ఒసాకా కాన్సయి ఎక్స్‌పోలో సైన్స్‌కో సంస్థ ఈ హ్యుమన్ వాషింగ్ మెషీన్‌ను ప్రదర్శించనున్నారు.
Updated Date - Dec 04 , 2024 | 05:18 AM