తొలి వాణిజ్య స్పేస్ వాక్
ABN, Publish Date - Sep 14 , 2024 | 04:24 AM
టెస్లా చీఫ్ ఈలన్ మస్క్‌కు చెందిన స్పేస్ ఎక్స్ సంస్థ సరికొత్త చరిత్ర సృష్టించింది! ఇన్నాళ్లుగా ప్రభుత్వ నిధులతో, అనుభవజ్ఞులైన వ్యోమగాములు మాత్రమే చేసిన స్పేస్ వాక్‌ను...
నిర్వహించి చరిత్ర సృష్టించిన స్పేస్ ఎక్స్
కమర్షియల్ స్పేస్‌వాక్ చేసిన తొలి వ్యక్తిగా జారెడ్ ఐజక్‌మ్యాన్ రికార్డ్
వాషింగ్టన్, సెప్టెంబరు 13: టెస్లా చీఫ్ ఈలన్ మస్క్‌కు చెందిన స్పేస్ ఎక్స్ సంస్థ సరికొత్త చరిత్ర సృష్టించింది! ఇన్నాళ్లుగా ప్రభుత్వ నిధులతో, అనుభవజ్ఞులైన వ్యోమగాములు మాత్రమే చేసిన స్పేస్ వాక్‌ను (రోదసిలో నడక).. తన పోలారిస్ డాన్ మిషన్‌లో భాగంగా వాణిజ్యపరంగా నిర్వహించింది! వ్యోమగాములు కాని ఇద్దరు వ్యక్తులతో స్పేస్‌వాక్ చేయించింది. ఆ సంస్థ చేపట్టిన పోలారిస్ డాన్ మిషన్‌లో భాగంగా.. అమెరికాకు చెందిన అపర కుబేరుడు, పైలట్.. జారెడ్ ఐజక్‌మ్యాన్ (41) భారత కాలమానం ప్రకారం గురువారం సాయంత్రం ఇంచుమించుగా నాలుగున్నర గంటల సమయంలో.. భూమికి 700కి.మీ. ఎత్తున క్రూడ్రాగన్ వ్యోమనౌక నుంచి బయటకు వచ్చి, స్కైవాకర్ హ్యాండ్‌రైల్ సిస్టమ్ ద్వారా తొలి కమర్షియల్ స్పేస్‌వాక్ చేసి, చరిత్రలో నిలిచారు. జారెడ్‌తోపాటు అదే వ్యోమనౌకలో వెళ్లిన మిగతా ముగ్గురిలో.. సారా గిల్లీస్ అనే మహిళ కూడా కొంతసేపు స్పేస్‌వాక్ చేసింది. ఆమె స్పేస్‌ఎక్స్ ఇంజనీర్. భవిష్యత్తులో చంద్రుడి మీదకి, కుజుడి మీదకు వెళ్లి దీర్ఘకాలంపాటు ఉండే మిషన్లను నిర్వహించే యోచనలో ఉన్న స్పేస్ ఎక్స్ సంస్థ.. వ్యోమగాముల కోసం ప్రత్యేకమైన ‘ఈవీఏ’ సూట్లను అభివృద్ధి చేసింది. ఈవీఏ సూట్లంటే.. ఎక్స్‌ట్రా వెహిక్యులార్ యాక్టివిటీ సూట్లు. అంటే వ్యోమగాములు వ్యోమనౌకల నుంచి బయటకు వచ్చినప్పుడు అక్కడ ఉండే పీడనాన్ని తట్టుకునేలా రూపొందించిన సూట్లు. వాటిని పరీక్షించేందుకే స్పేస్ ఎక్స్ సంస్థ ఈ మిషన్‌ను నిర్వహించింది.
Updated Date - Sep 14 , 2024 | 04:24 AM