Boat Incident: ఘోర ప్రమాదం.. పడవ బోల్తా పడి 15 మంది మృతి.. 150 మంది గల్లంతు
ABN, Publish Date - Jul 25 , 2024 | 08:18 PM
ఆఫ్రికాలో ఒక ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. మారిటానియా సముద్రతీరంలో ఒక పడవ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 15 మంది మృతి చెందగా.. మరో 150 మంది గల్లంతు అయ్యారు. ఈ విషయాన్ని..
ఆఫ్రికాలో (Africa) ఒక ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. మారిటానియా (Mauritania) సముద్రతీరంలో ఒక పడవ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 15 మంది మృతి చెందగా.. మరో 150 మంది గల్లంతు అయ్యారు. ఈ విషయాన్ని ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ (ఐఓఎం) ధృవీకరించింది. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొంది. సుమారు 300 మంది వసలదారులతో యూరప్ దిశగా ఈ బోటు బయలుదేరింది. అయితే.. మారిటానియా రాజధాని నాఖ్కోట్ సమీపంలో అది ప్రమాదవశాత్తూ బోల్తా పడింది. ఈ సమాచారం అందుకున్న కోస్టు గార్డు సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుంది. ఇప్పటివరకూ 120 మందిని తాము వాళ్లు రక్షించారని, దురదృష్టవశాత్తూ 15 మంది ప్రాణాలు కోల్పోయారని ఐఓఎం పేర్కొంది. పది మంది పరిస్థితి విషమంగా ఉండటంతో.. వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. వారిలో నలుగురు భాగస్వామ్యులను కోల్పోగా, కొందరు పిల్లలు తల్లిదండ్రులతో వేరుచేయబడ్డారు.
ప్రమాదకరమని తెలిసినా..
ఈమధ్య కాలంలో పశ్చిమ ఆఫ్రికాకు చెందిన వేలాది మంది.. స్పెయిన్‌లోని కానరీ దీవులకు (Canary Islands) వలస వెళ్తున్నారు. చిన్న చిన్న బోట్ల ద్వారా అట్లాంటిక్ సముద్రంలో (Atlantic Sea) సెనెగల్ మార్గంలో ప్రయాణం చేసి.. మారిటానియాకు చేరుకుంటున్నారు. ఈ మార్గం ఎంతో ప్రమాదకరమైనది. ఇక్కడ గతంలో ఎన్నో సంఘటనలు చోటు చేసుకున్నాయి. వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. అయినప్పటికీ.. వలసదారులు ఇదే మార్గాన్ని ఎంపిక చేసుకుంటున్నారు. ఇందుకు కారణం.. కానరీ దీవులకు వెళ్లేందుకు ఇది దగ్గరి మార్గం అవ్వడం, ప్రయాణ ఖర్చులు తక్కువ కావడం. దీనికితోడు.. వలసదారుల కటిక పేదరికం. ఇప్పటివరకూ ఈ మార్గంలో ప్రయాణించిన వసలదారుల్లో సుమారు 1,950 మంది మృతి చెందినట్లు ఐఓఎం అంచనా వేస్తోంది.
పేదరికమే కారణం..
ఆఫ్రికన్ దేశాల్లో (African Countries) పేదరికం అనేది నానాటికీ పెరుగుతూ వస్తోంది. చాలా ప్రాంతాల్లో అస్థిరత కారణంగా.. పూట గడవడం కూడా కష్టమైపోతోంది. అందుకే.. బతుకుదెరువు కోసం ఆఫ్రికన్ దేశాల ప్రజలు యూరప్‌కు వెళ్లిపోతున్నారు. ఈమధ్య ఇలా వలసవెళ్లే ఆఫ్రికన్ ప్రజల సంఖ్య గణనీయంగా పెరిగిపోయింది. స్వయంగా తల్లిదండ్రులే తమ పిల్లల్ని బలవంతంగా పంపిస్తున్నారంటే.. అక్కడ ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఈ ఒక్క ఏడాదిలోనే 20 వేల మంది వసలదారులు కానరీ దీవులకు వెళ్లిపోయినట్లు ఐఓఏం తెలిపంది. గతేడాదిలో వెళ్లిన వలసదారుల సంఖ్యతో పోలిస్తే.. ఇది మూడు రెట్లు ఎక్కువ అని ఆ ఆర్గనైజేషన్ స్పష్టం చేసింది.
Read Latest International News and Telugu News
Updated Date - Jul 25 , 2024 | 08:18 PM