Namibia: ఏనుగులు సహా 700 జంతువుల వధ.. ప్రజలకు మాంసం పంపిణీ..
ABN, Publish Date - Aug 30 , 2024 | 10:14 AM
కరవు ఆ దేశాన్ని అల్లకల్లోలం చేస్తోంది. పూటగడవడం కూడా అక్కడి ప్రజలకు కష్టంగా మారింది. ఆహారం దొరక్కా అల్లాడుతున్నారు. ఆకలి చావుల సంఖ్య పెరిగిపోతోంది. దీంతో ప్రభుత్వం అనూహ్య నిర్ణయం తీసుకుంది.
నమీబియా: కరవు ఆ దేశాన్ని అల్లకల్లోలం చేస్తోంది. పూటగడవడం కూడా అక్కడి ప్రజలకు కష్టంగా మారింది. ఆహారం దొరక్కా అల్లాడుతున్నారు. ఆకలి చావుల సంఖ్య పెరిగిపోతోంది. దీంతో ప్రభుత్వం అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఏకంగా 700లకుపైగా జంతువులను చంపి, వాటి మాంసాన్ని ప్రజలకు పంచాలని నిర్ణయించింది. కరవుకు కేరాఫ్‌గా పిలుచుకునే ఆఫ్రికా ఖండంలోని నమీబియా(Drought in Namibia) దేశం పరిస్థితి ఇది.అక్కడ గత 100 ఏళ్ళల్లో ఎన్నడూ లేనంతగా ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. ప్రభుత్వం దగ్గరా డబ్బులు లేకపోవడంతో ప్రజల ఆకలిని తీర్చడానికి ముప్పు తిప్పలు పడుతోంది. చివరికి అనూహ్య నిర్ణయం తీసుకుంది. నమీబియా అడవుల్లో నివసించే 700 జంతువులను చంపి..ఆ మాంసం ప్రజలకు పంచాలని నిర్ణయించింది. ఇందులో 83 ఏనుగులు, జీబ్రాలు, నీటి గుర్రాలు ఉన్నాయి. ఈ విషయాన్ని దేశ పర్యావరణ, అటవీశాఖ మంత్రులే చెప్పారు.
జాబితాలో ఉన్నావివే..
జంతువుల జాబితాలో 83 ఏనుగులు, 100 బ్లూవైల్డ్ బీస్ట్‌లు, 300 జీబ్రాలు, 30 నీటి గుర్రాలు, 60 అడవి దున్నలు, 50 ఇంఫాలాలు ఉన్నాయి. ఆఫ్రికాలోని అడవుల్లో వీటి సంఖ్య అధికంగా ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని అధికారులు చెబుతున్నారు. వీటిని వేటాడటానికి నిపుణులైన వేటగాళ్ళను నియమించనున్నారు. నైరుతి ఆఫ్రికాలోని కరవు ప్రాంతాల్లో ఈ జంతువుల మాంసం పంచనున్నారు. ఈ ఏడాది ప్రారంభం నుంచే కరవు అత్యధికంగా ఉండటంతో.. నమీబియాలో జాతీయ అత్యయిక పరిస్థితిని విధించారు. దాదాపు 14 లక్షల మంది ఆకలితో అలమటిస్తున్నారు.
ఈ సంఖ్య మొత్తం దేశ జనాభాలో సగానికిపైగా ఉంది. దీనికితోడు నీటి కొరత కూడా ఆఫ్రికా ప్రజలను ఇబ్బంది పెడుతోంది. జంతువులు జనావాసాల మీద పడి దొరికినకాడికి నీటి వనరులను వాడేస్తున్నాయి. ఆఫ్రికాలోని దక్షిణ ప్రాంతంలో 2లక్షలకుపైగా ఏనుగులు ఉన్నాయి. గత కొన్నేళ్లుగా నీరు దొరక్క చాలా వరకు మృత్యువాతపడుతున్నాయి. మొత్తం ఏనుగుల్లో ఒక్క బోట్సువానాలో లక్ష 30 వేల వరకు ఉన్నాయి. ఇక్కడ ఏనుగుల వేటకు అనుమతి ఉన్నా.. దేశంలోని చాలా ప్రాంతాల్లో తొలుత వీటి వేటపై నిషేధం విధించారు. ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో నిషేధాన్ని ఎత్తివేశారు.
For Latest News click here
Updated Date - Aug 30 , 2024 | 10:41 AM