Bangladesh Crisis: బంగ్లాదేశ్ ఘర్షణల్లో 650 మంది మృతి?
ABN, Publish Date - Aug 18 , 2024 | 03:37 PM
బంగ్లాదేశ్ స్వాతంత్ర్య ఉద్యమకారుల కుటుంబాలకు అత్యధిక రిజర్వేషన్లు ఇవ్వడానికి వ్యతిరేకంగా చెలరేగిన బంగ్లాదేశ్ అల్లర్లలో 200 మందికిపైగా మరణించినట్లు అధికారిక గణాంకాలు వెల్లడించాయి.
ఢాకా: బంగ్లాదేశ్ స్వాతంత్ర్య ఉద్యమకారుల కుటుంబాలకు అత్యధిక రిజర్వేషన్లు ఇవ్వడానికి వ్యతిరేకంగా చెలరేగిన బంగ్లాదేశ్ అల్లర్లలో 200 మందికిపైగా మరణించినట్లు అధికారిక గణాంకాలు వెల్లడించాయి. అయితే మృతుల సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉండే అవకాశం ఉందని ఐక్యరాజ్యసమితి(UN) వెల్లడించింది. బంగ్లాదేశ్ అల్లర్లకు(Bangladesh Crisis) సంబంధించి సంచలన విషయాలు బయటపెట్టింది. ఇటీవల రిజర్వేషన్లకు వ్యతిరేకంగా విద్యార్థులు చేపట్టిన ఉద్యమం హింసాత్మకంగా రూపుదాల్చడం, ప్రధాని షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసిన భారత్‌లో తలదాచుకోవడం, నోబెల్ అవార్డు గ్రహీత మహ్మద్ యూనస్ తాత్కాలిక పాలకుడిగా పగ్గాలు అందుకోవడం అన్ని చకచక జరిగిపోయాయి.
ఈ క్రమంలో బంగ్లాలో జరుగుతున్న ఘర్షణలపై ఐక్యరాజ్యసమితి నివేదిక రూపొందించింది. బంగ్లాదేశ్‌లో నిరసనలు-హింసపై ప్రాథమిక విశ్లేషణ పేరుతో ఈ రిపోర్ట్‌ని రూపొందించింది. ఈ రిపోర్ట్ ప్రకారం బంగ్లా అల్లర్లలో ఇప్పటి వరకు 650 మంది మరణించారు. ఆగస్టు 5, 6 తేదీల్లో జరిగిన ఘర్షణల్లో 250 మంది వరకు చనిపోయారు. బాధితుల్లో ప్రభుత్వ భద్రతా సిబ్బంది, జర్నలిస్టులు కూడా ఉన్నారు. జులై 16 నుంచి ఆగస్టు 11 మధ్యకాలంలో బంగ్లాదేశ్‌లో అశాంతి నెలకొంది.
హిందూవుల భద్రతపై ఆందోళన..
బంగ్లాదేశ్‌లో నెలకొన్న అల్లకల్లోల పరిస్థితుల కారణంగా అక్కడి మైనారిటీలైన హిందువుల భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. దేశవిభజన సమయంలో ఉన్న ప్రాంతాన్ని వదలి భారత్‌కు రాలేక ఎంతోమంది హిందువులు బంగ్లాదేశ్ (అప్పటి తూర్పు పాకిస్థాన్)లోనే ఉండిపోయారు. ఢాకా, సిలేటు ప్రాంతాల్లో కొన్ని తెలుగు కుటుంబాలూ ఉన్నాయి.
ఇప్పుడు అక్కడ తెలుగువారి సంఖ్య వేలల్లోకి చేరింది. వీరిలో ఎక్కువగా ఏపీలోని విశాఖపట్నం, శ్రీకాకుళం ప్రాంతాలకు చెందిన వారే ఉన్నారు. తమ రక్తంలో ఇప్పటికీ తెలుగు సంస్కృతి ఉందని, ఇంట్లోనూ తెలుగులోనే మాట్లాడతామని చెప్పారు. అయితే తాము ముమ్మాటికీ బంగ్లాదేశ్ జాతీయులమేనని, బంగ్లాదేశ్ పౌరులమని చెప్పుకొనేందుకు గర్వపడతామని తెలుగు సంతతికి చెందిన ఏసు రత్నం పేర్కొన్నారు. కానీ బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులను చూస్తుంటే భయమేస్తోందని ఆయన అన్నారు.
For Latest News and National News click here
Updated Date - Aug 18 , 2024 | 03:37 PM