రష్యాకు ఉత్తర కొరియా సైనిక సహకారం!
ABN, Publish Date - Oct 21 , 2024 | 03:12 AM
ఉక్రెయిన్‌తో యుద్ధంలో పోరాడేందుకు రష్యాకు కిమ్ నేతృత్వంలోని ఉత్తర కొరియా సైనిక సహకారం అందిస్తోందా? అంటే... దక్షిణ కొరియా అవుననే అంటోంది.
ధ్రువీకరించిన దక్షిణ కొరియా ఇంటెలిజెన్స్
న్యూఢిల్లీ, అక్టోబరు 20: ఉక్రెయిన్‌తో యుద్ధంలో పోరాడేందుకు రష్యాకు కిమ్ నేతృత్వంలోని ఉత్తర కొరియా సైనిక సహకారం అందిస్తోందా? అంటే... దక్షిణ కొరియా అవుననే అంటోంది. రష్యాకు మద్దతుగా 12 వేల మంది సైనికులను పంపించాలని ఆ దేశం భావిస్తోందని, దీనికోసం 1,500 మంది సైనికులు తూర్పు రష్యాలో శిక్షణ తీసుకుంటున్నారని దక్షిణ కొరియా నేషనల్ ఇంటెలిజెన్స్ సర్వీస్ (ఎన్‌ఐఎస్) ధ్రువీకరించింది. ఉక్రెయిన్‌కు చెందిన సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ కమ్యూనికేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ విడుదల చేసిన వీడియోలో రష్యా తూర్పు ప్రాంతంలోని ఓ శిక్షణ మైదానంలో ఉత్తర కొరియా సైనికులు యూనిఫాం, ఆయుధాలు అందుకుంటున్నట్టు కనిపించారు. మరో వీడియోలో రష్యా-చైనా సరిహద్దుకు సమీపంలో ఉన్న సెర్గీవ్‌కా శిక్షణ మైదానానికి కూడా కొంతమంది సైనికులు చేరుకోవడం కనిపించింది.
రష్యాలోని వ్లాదివోస్టోక్, ఖబరవోస్క్ సహా వివిధ సైనిక స్థావరాల్లో ఉత్తర కొరియా దళాలు శిక్షణ పొందుతున్నాయని ఎన్‌ఐఎస్ నివేదించింది. ఆయా ప్రదేశాల్లో ఉత్తర కొరియా దళాల ఉనికిని ధ్రువీకరించే చిత్రాలు, వీడియోలను విడుదల చేసింది. అలాగే ఉత్తర కొరియా నుంచి సైనికులను రవాణా చేస్తున్న రష్యా నౌకలను కూడా ఎన్‌ఐఎస్ గుర్తించింది. ఈ ఏడాది ఆగస్టు నుంచి ఉత్తర కొరియా 13వేల షిప్పింగ్ కంటైనర్లలో రష్యాకు సైనిక సామగ్రిని పంపించిందని ఎన్‌ఐఎస్ తెలిపింది. రష్యాకు 10 వేల మందికిపైగా సైనికులను పంపేందుకు ఉత్తర కొరియా సిద్ధంగా ఉన్నట్లు తమ ఇంటెలిజెన్స్ వద్ద సమాచారం ఉందని జెలెన్‌స్కీ చెప్పారు. కాగా, దక్షిణ కొరియాకు చెందిన మిలటరీ డ్రోన్‌ను తమ భూభాగంలో గుర్తించామని, మరోసారి ఇలా జరిగితే యుద్ధం తప్పదని కిమ్ జోంగ్ హెచ్చరించారు.
Updated Date - Oct 21 , 2024 | 03:13 AM