Landslide: పపువాలో తీవ్ర విషాదం.. 100 మందికిపైగా సజీవ సమాధి..
ABN, Publish Date - May 24 , 2024 | 06:33 PM
ప్రకృతి విపత్తుకు పపువా న్యూ గినియా(Papua New Guinea) చిగురుటాకుల వణికింది. శుక్రవారం తెల్లవారుజామున అకస్మాత్తుగా జరిగిన ఈ ఘటనలో ఒకే గ్రామానికి చెందిన 100 మందికిపైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు.
పోర్ట్ మోర్స్బీ: ప్రకృతి విపత్తుకు పపువా న్యూ గినియా(Papua New Guinea) చిగురుటాకుల వణికింది. శుక్రవారం తెల్లవారుజామున అకస్మాత్తుగా జరిగిన ఈ ఘటనలో ఒకే గ్రామానికి చెందిన 100 మందికిపైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఆ ప్రాంతంలో తీరని విషాదం నెలకొంది. పోలీసులు, ప్రత్యక్ష సాక్ష్యులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజధాని పోర్ట్ మోర్స్బీకి 600 కి.మీ.ల దూరంలో ఎన్గా ప్రావిన్స్‌లోని కావోకలం గ్రామంలో తెల్లవారుజామున 3 గంటలకు ఈ విషాదం చోటు చేసుకుంది.
అందరూ గాఢ నిద్రలో ఉన్న సమయంలో పక్కనే ఉన్న కొండ నుంచి కొండ చరియలు(Papua New Guinea Landslide) విరిగి పడ్డాయి. గ్రామస్థులు ఏం జరుగుతుందో చూసేలోపే సజీవ సమాధి అయ్యారు. ఈ ఘటనలో చిన్నా పెద్ద అని తేడా లేకుండా 100 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. చాలా మంది ఇంకా శిథిలాల కింద ఇరుక్కున్నట్లు ఆస్ట్రేలియా అధికారిక మీడియా ఆస్ట్రేలియన్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ వెల్లడించింది. విషయం తెలుసుకున్న అధికారులు ఆలస్యంగా అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతులను, క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించారు.
భారీగా ఆస్తి, ప్రాణ నష్టం..
ప్రకృతి విపత్తుతో గ్రామంలో భారీగా ఆస్తి, ప్రాణ నష్టం సంభవించాయి. ఇళ్లు నేలమట్టం అయ్యాయి. మరికొన్ని ఇళ్లు ధ్వంసం అయ్యాయి. అయితే గ్రామస్థులు పూర్తిగా గాఢ నిద్రలో ఉండగా.. ప్రమాదం జరగడంతో తప్పించుకునే పరిస్థితి లేకుండా చాలా మంది చనిపోయారు. అధికారులు చేరుకునే ముందే శిథిలాల కింద చిక్కుకున్న వారిని కాపాడేందుకు గ్రామస్థులే రంగంలోకి దిగారు.
పెద్ద పెద్ద బండరాళ్లు పడటంతో వారిని వెలికి తీయడంలో తీవ్ర అవస్థలు ఎదుర్కున్నారు. మధ్యాహ్నం వరకు 100కుపైగా మతదేహాలు బయటపడ్డాయని.. సహాయక చర్యలు పూర్తయ్యేసరికి మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే ఈ ఘటనలో ఎంత మంది చనిపోయారనే విషయంపై ప్రభుత్వం అధికారిక ప్రకటన జారీ చేయలేదు.
Read Latest News and International News here
Updated Date - May 24 , 2024 | 06:33 PM