Pakistan: చలి ఎక్కువగా ఉంది.. ఎన్నికలు వాయిదా వేయండి.. తీర్మానాన్ని ఆమోదించిన సెనేట్..
ABN, Publish Date - Jan 06 , 2024 | 11:59 AM
ఈ ఏడాది ఫిబ్రవరి 8న జరగనున్న జాతీయ సార్వత్రిక ఎన్నికలను వాయిదా వేయాలన్న డిమాండ్ ను పాకిస్తాన్ సెనేట్ ఆమోదించింది.
ఈ ఏడాది ఫిబ్రవరి 8న జరగనున్న జాతీయ సార్వత్రిక ఎన్నికలను వాయిదా వేయాలన్న డిమాండ్ ను పాకిస్తాన్ సెనేట్ ఆమోదించింది. 97 మంది సెనేటర్లలో కేవలం 14 మంది మాత్రమే ఈ సెషన్ కు హాజరయ్యారు. వీరిలో 13 మంది తీర్మానానికి అనుకూలంగా ఓటు వేయగా.. ఒక సభ్యుడు వ్యతిరేకంగా ఓటు వేశారు. దీంతో ఎగువ సభ ఈ తీర్మానాన్ని ఆమోదించింది. దేశంలోని భద్రతా పరిస్థితులు, తీవ్రమైన చలి ఉన్నందున ప్రచారం చేసే అవకాశం లేదంటూ స్వతంత్ర సభ్యుడు దిలావర్ ఖాన్ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఇన్ని సమస్యల నడుమ ఎన్నికలు నిర్వహించడం కష్టతరమని, ఇది ఎన్నికలలో ఓటింగ్ శాతంపై కూడా ప్రభావం చూపుతుందని ఆయన అన్నారు. కాబట్టి వాయిదా వేయాలని తీర్మానంలో కోరారు. దీనిపై ఓటింగ్ నిర్వహించిన సెనేట్ చివరికి ఎన్నికలను వాయిదా వేసింది.
పాకిస్తాన్ 75 ఏళ్ల చరిత్రలో గతంలో జరిగిన 11 సాధారణ ఎన్నికల్లో 1985, 1997, 2008 లో మూడు సార్లు ఫిబ్రవరి నెలలోనే జరిగాయి. పాకిస్తాన్ దిగువ సభను ఆగస్టులో రద్దు చేసిన తర్వాత గతేడాది నవంబర్‌లో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ప్రధానమంత్రి అన్వర్ ఉల్-హక్ కాకర్ ఆధ్వర్యంలో ఓటింగ్‌ను పర్యవేక్షించడానికి తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో 2023లో దేశ జనాభా గణన ఆధారంగా నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణకు మరింత సమయం కావాలని పాకిస్తాన్ ఎన్నికల సంఘం (ECP) కోరింది. 241 మిలియన్ల జనాభా ఉన్న ఈ దక్షిణాసియా దేశం ఏళ్లుగా రాజకీయ, ఆర్థిక సంక్షోభంలో ఉంది.
మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ 2023 ఆగస్టు నుంచి జైలులోనే ఉన్నారు. దేశ రహస్యాలను లీక్ చేశారనే ఆరోపణలతో ఆయనపై విచారణ జరుగుతోంది.ఈ క్రమంలో చాలా మంది సొంత పార్టీ నేతలు పార్టీని విడిచిపెట్టారు. తిరుగుబాటు, అవినీతి కేసులో దోషిగా తేలడంతో ఫిబ్రవరి 8 న జరిగే ఎన్నికలకు ఇమ్రాన్ ఖాన్ వేసిన నామినేషన్ పత్రాలను ఎన్నికల సంఘం తిరస్కరించడం గమనార్హం.
మరిన్ని వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.
Updated Date - Jan 06 , 2024 | 11:59 AM