అసమానతలపై పరిశోధనకు.. ఆర్థిక నోబెల్
ABN, Publish Date - Oct 15 , 2024 | 03:14 AM
ఆర్థిక శాస్త్రంలో ప్రతిష్ఠాత్మక నోబెల్ పురస్కారం ఈ ఏడాది ముగ్గురిని వరించింది. సంపద విషయంలో దేశాల మధ్య అసమానతలపై చేసిన పరిశోధనలకుగానూ అమెరికాకు చెందిన ఆర్థికవేత్తలు డారోన్ అసెమోగ్లు, సైమన్ జాన్సన్, జేమ్స్ ఏ రాబిన్సన్‌లను నోబెల్ బహుమతికి ఎంపిక చేసినట్టు రాయల్ స్వీడిష్ అకాడమీ సోమవారం ప్రకటించింది
అమెరికన్లు అసెమోగ్లు, జాన్సన్, రాబిన్సన్‌కు ప్రతిష్ఠాత్మక పురస్కారం
దేశాల సంపద తేడాపై అధ్యయనం
స్టాక్‌హోం, అక్టోబరు 14: ఆర్థిక శాస్త్రంలో ప్రతిష్ఠాత్మక నోబెల్ పురస్కారం ఈ ఏడాది ముగ్గురిని వరించింది. సంపద విషయంలో దేశాల మధ్య అసమానతలపై చేసిన పరిశోధనలకుగానూ అమెరికాకు చెందిన ఆర్థికవేత్తలు డారోన్ అసెమోగ్లు, సైమన్ జాన్సన్, జేమ్స్ ఏ రాబిన్సన్‌లను నోబెల్ బహుమతికి ఎంపిక చేసినట్టు రాయల్ స్వీడిష్ అకాడమీ సోమవారం ప్రకటించింది. వారికి పురస్కారంతోపాటు రూ.8.90 కోట్లు ప్రైజ్‌మనీ దక్కనుంది. ఒక దేశం ఆర్థికంగా ఎదగాలంటే సంస్థల ఏర్పాటు ప్రాముఖ్యతను అసెమోగ్లు, జాన్సన్, రాబిన్సన్.. తమ పరిశోధనల్లో నొక్కిచెప్పారు. కొన్ని దేశాలు ఆర్థికంగా ఎందుకు విజయం సాధిస్తున్నాయి, కొన్ని దేశాలు ఎందుకు విఫలమవుతున్నాయి అనే అంశాలను విశదీకరించారు.
‘పేలవమైన చట్టపాలన కలిగిన సమాజాలు, జనాభాను దోపిడీ చేసే సంస్థలు.. వృద్ధిని కానీ, సమాజంలో మార్పును కానీ సృష్టించలేవని ఎందుకు చెబుతారో.. అవార్డు గ్రహీతల పరిశోధన ద్వారా అర్థం చేసుకోవచ్చు’ అని రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సె్‌సకు చెందిన నోబెల్ కమిటీ వెల్లడించింది. డారోన్ అసెమోగ్లు, సైమన్ జాన్సన్.. అమెరికాలోని మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో పనిచేస్తుండగా.. రాబిన్సన్ చికాగో యూనివర్సిటీలో పరిశోధనలు చేస్తున్నారు. ‘దేశాల మధ్య ఆదాయాల్లో భారీ వ్యత్యాసాలను తగ్గించడం ప్రస్తుతం మన ముందున్న అతిపెద్ద సవాళ్లలో ఒకటి. ఒక దేశం ఆర్థికంగా ఎదగాలంటే సామాజిక సంస్థల పాత్ర ఎంతో కీలకమని అవార్డు గ్రహీతలు తెలియజేశారు’ అని స్వీడిష్ అకాడమీ ఎకనామిక్ సైన్సెస్ కమిటీ చైర్మన్ జాకబ్ స్వెన్సన్ అన్నారు. కాగా, గతవారం వైద్య విభాగంలో మొదలైన నోబెల్ బహుమతుల ప్రకటన సోమవారంతో ముగిసింది.
Updated Date - Oct 15 , 2024 | 03:14 AM