ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

విద్యార్థుల పంతం నెగ్గింది

ABN, Publish Date - Aug 07 , 2024 | 04:27 AM

బంగ్లాదేశ్‌లో ప్రభుత్వ ఏర్పాటుపై ఉత్కంఠ వీడింది..! నోబెల్‌ అవార్డు గ్రహీత మహమ్మద్‌ యూన్‌సను తాత్కాలిక ప్రభుత్వాధినేతగా దేశాధ్యక్షుడు మహమ్మద్‌ షహబుద్దీన్‌ ప్రకటించారు.

Bangladesh Students

బంగ్లా ప్రభుత్వాధినేతగా నోబెల్‌ గ్రహీత యూనస్‌

  • అర్ధరాత్రి అధ్యక్ష కార్యాలయం ప్రకటన

  • బంగభవన్‌లో అధ్యక్షుడు షహబుద్దీన్‌తో

  • 6 గంటల పాటు విద్యార్థుల సుదీర్ఘ చర్చలు

  • మధ్యలో త్రివిధ దళాధిపతుల రంగ ప్రవేశం

  • అధ్యక్ష భవనం చుట్టూ మిలిటరీ మోహరింపు

  • ఒక్కసారిగా ఆ ప్రాంతమంతా ఉత్కంఠ

  • మాజీ ప్రధాని ఖలీదా జియా విడుదల

  • హింసతో ఆందోళనకారుల బీభత్సం

  • దేశవ్యాప్తంగా హత్యలు.. లూటీలు

  • పోలీస్‌స్టేషన్లకూ దుండగుల నిప్పు

  • గందరగోళంలో ప్రభుత్వోద్యోగులు

  • కల్లోలం వెనుక విదేశీ హస్తం!

  • అమెరికా కుట్ర? ఖలీదా కుమారుడు పాక్‌తో కలిసి పన్నిన వ్యూహం?


ఢాకా, ఆగస్టు 6: బంగ్లాదేశ్‌లో ప్రభుత్వ ఏర్పాటుపై ఉత్కంఠ వీడింది..! నోబెల్‌ అవార్డు గ్రహీత మహమ్మద్‌ యూన్‌సను తాత్కాలిక ప్రభుత్వాధినేతగా దేశాధ్యక్షుడు మహమ్మద్‌ షహబుద్దీన్‌ ప్రకటించారు. అధికార నివాసం బంగభవన్‌లో విద్యార్థి సంఘాల నేతలు, త్రివిధ దళాధిపతులతో సుదీర్ఘంగా జరిగిన చర్చల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. అధ్యక్షుడి కార్యదర్శి జోనాల్‌ అబేదిన్‌ ఓ ప్రకటన చేశారు. వివిధ పక్షాలు, రాజకీయ పార్టీలతో చర్చించాక.. తాత్కాలిక ప్రభుత్వంలో మిగిలిన సభ్యుల పేర్లను ఖరారు చేస్తామని పేర్కొన్నారు. దీంతో విద్యార్థి సంఘాలు తమ పంతం నెగ్గించుకున్నట్లైంది. మరోవైపు దేశవ్యాప్తంగా ఆందోళనకారులు ఉధృతంగా హింసకు పాల్పడ్డట్లు వెల్లడైంది. చాలా చోట్ల హత్యలు, లూటీలు జరిగాయి. పోలీస్ స్టేషన్లకు కూడా ఆందోళనకారులు నిప్పుపెట్టారు. హిందువుల, అవామీ లీగ్‌ నేతలే లక్ష్యంగా దాడులు జరిగాయి. జైళ్లను బద్ధలు చేయడంతో.. ఖైదీలు పరారయ్యారు.


సైన్యం ప్రవేశంతో ఉత్కంఠ..!

మధ్యంతర ప్రభుత్వ ఏర్పాటుపై మంగళవారం ఉదయం నుంచి సందిగ్దత నెలకొంది. ‘‘ప్రజలు ఎన్నుకోని వారికి ఒక్క నిమిషం కూడా అధికారం ఇవ్వొద్దు. అలా చేస్తే.. బంగ్లాదేశ్‌ మరో పాకిస్థాన్‌ అవుతుంది’’.. అని హసీనా కుమారుడు నజీబ్‌ వజీద్‌ జాయ్‌ ముందే హెచ్చరించారు. విద్యార్థి సంఘాల సమన్వయ కర్త నహీద్‌ ఇస్లాం కూడా మధ్యంతర పౌర ప్రభుత్వానికే ఆమోదం తెలుపుతామని భీష్మించారు. ఆర్మీ పాలనను అంగీకరించేది లేదని తేల్చిచెప్పారు. నోబెల్‌ గ్రహీత మహమ్మద్‌ యూనస్‌ నేతృత్వంలో సర్కారు ఉండాలని పేర్కొన్నారు. యూనస్‌ కూడా.. ఎంతో త్యాగం చేసిన విద్యార్థుల కోసం తాను ప్రభుత్వాన్ని నడిపేందుకు సిద్ధమేనని ప్రకటన చేశారు. ఆర్మీ చీఫ్‌ వకార్‌-ఉజ్‌-జమా మాత్రం సైనిక పాలన వైపే మొగ్గుచూపుతున్నట్లు వార్తలొచ్చాయి. ఈ పరిణామాల మధ్య బంగ్లాదేశ్‌ అధ్యక్షుడు మహమ్మద్‌ షహబుద్దీన్‌ మంగళవారం సాయంత్రం 6 గంటల నుంచి విద్యార్థి సంఘాల నాయకులు, త్రివిధ దళాల అధిపతులతో తన అధికారిక నివాసం ‘బంగభవన్‌’లో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ఈ చర్చలు జరుగుతుండగానే రాత్రి 7.40 సమయంలో త్రివిధ దళాధిపతులు, ఆర్మీ చీఫ్‌ కూడా బంగభవన్‌ చేరుకొని చర్చల్లో పాల్గొన్నారు. ఆ తర్వాత అర్ధరాత్రి వరకు గంటగంటకూ బంగభవన్‌ వెలుపల ఆర్మీ మోహరింపు పెరుగుతూ వచ్చింది. దీంతో ఉత్కంఠ నెలకొంది. చివరకు అర్ధరాత్రి 12 గంటల సమయంలో.. తాత్కాలిక ప్రభుత్వానికి అధినేతగా యూనస్‌ ఉంటారంటూ అధ్యక్ష కార్యాలయం నుంచి ప్రకటన వెలువడడంతో ఉత్కంఠ వీడింది.


ఖలీదా విడుదల

బీఎన్‌పీ చైర్‌పర్సన్‌ ఖలీదా జియా నిర్బంధం నుంచి విడుదలయ్యారు. సోమవారం రాత్రే ఆమె విడుదలకు అధ్యక్షుడు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. 2018 ఫిబ్రవరి 8 నుంచి రెండేళ్ల పాటు జైలులో ఉన్నారు. అవినీతి కేసుల్లో 13 ఏళ్ల జైలు శిక్ష పడగా.. 2020 మార్చి 25న ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌ ద్వారా విడుదలయ్యారు. ఆ తర్వాత హోం అరెస్టులో ఉన్నారు. మాజీ సైనికాధికారి, బ్రిగేడియర్‌ జనరల్‌ అబ్దుల్లా-ఉల్‌-అమన్‌ అజ్మీ, సుప్రీంకోర్టు న్యాయవాది అహ్మద్‌-బిన్‌-ఖాసీం(అర్మాన్‌) కూడా జైలు నుంచి విడుదలయ్యారు. అబ్దుల్లా-ఉల్‌-అమన్‌కు 1971 నేరాలకు వ్యతిరేకంగా మరణ శిక్ష పడింది. దాంతో ఎనిమిదేళ్ల క్రితం ఆయనను విధుల నుంచి తప్పించారు.


హత్యలు.. లూటీలు

షేక్‌ హసీనా రాజీనామా తర్వాత.. దొమ్మీలు చేసే గుంపులు ఆందోళనకారుల్లో కలిసిపోయి.. రాత్రి 7.30 సమయం నుంచి అర్ధరాత్రంతా దేశవ్యాప్తంగా హత్యలు, లూటీలు చేశాయి. సినీ నటుడు శాంటోఖాన్‌ మొదలు.. అవామీ లీగ్‌ పార్టీకి చెందిన జిల్లా, తాలూకా నేతల దాకా పలువురు హత్యకు గురయ్యారు. వారి ఇళ్లకు నిప్పు పెట్టారు. పోలీస్ స్టేషన్లలో లూటీ చేసి, కంప్యూటర్లు, ఏసీలు, తుపాకీలను దోచుకున్నారు. చివరకు పోలీసు వాహనాల విడిభాగాలను కూడా వదిలిపెట్టలేదని బంగ్లాదేశీ పత్రికలు కథనాలను ప్రచురించాయి. ఢాకాలోని సావర్‌లో జరిగిన హింసలో 31 మంది చనిపోయారు. కాక్స్‌బజార్‌, ఎయిర్‌పోర్ట్‌ రోడ్డు, సిల్వర్‌సైన్‌ తదితర ప్రాంతాల్లో దుకాణాలు, హోటళ్లు, ఏటీఎం కేంద్రాలు లూటీకి గురయ్యాయి. ఈ ప్రాంతాల్లో జరిగిన హింసలో ఇద్దరు బీఎన్‌పీ నేతలు సహా.. 14 మంది మరణించారు. లాల్‌మొనిర్హాట్‌లో అవామీ లీగ్‌ నేత సుమోన్‌ఖాన్‌ ఇంటిని తగులబెట్టగా.. ఆరుగురు కుటుంబ సభ్యులు సజీవదహనమయ్యారు. జస్సార్‌లోని అవామీ నేత షాహిన్‌ చక్కల్దర్‌కు చెందిన 14 అంతస్తుల ‘హోటల్‌ జబీర్‌ ఇంటర్నేషనల్‌’కు నిప్పు పెట్టిన ఘటనలో మృతుల సంఖ్య 24కు చేరుకుందని అధికారులు తెలిపారు. కోటా ఆందోళనలు ప్రారంభమైనప్పటి నుంచి 440 మరణాలు నమోదైనట్లు అధికారులు తెలిపారు.


రెండు జైళ్లపై దాడి.. లూటీ.. ఖైదీల పరార్‌

సోమవారం జరిగిన ఆందోళనల్లో రెండు జైళ్లు ధ్వంసమయ్యాయి. వాటిల్లోని కరడుగట్టిన ఖైదీలు పరారవ్వగా.. ఒక జైలుకు చెందిన పలువురు ఖైదీలు తిరిగి వచ్చారు. ఆందోళనకారులు జైళ్లలోనూ దోపిడీకి పాల్పడ్డారు. షేర్పూర్‌లో ఉన్న జిల్లా జైలు గేట్లను బద్ధలు కొట్టిన సుమారు 10 వేల మంది ఆందోళనకారులు లోనికి దూసుకెళ్లారు. ఈ క్రమంలో యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్న 10 మంది కరడుగట్టిన ఖైదీలతో పాటు 500 మందికి పైగా ఖైదీలు పారిపోయారు. సత్ఖిరా జిల్లా జైలులో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. ఇక్కడ 596 మంది ఖైదీలు పారిపోయారు.


అయోమయంలో ఉద్యోగులు

ప్రభుత్వోద్యోగులు మంగళవారం విధులకు హాజరైనా.. చాలా చోట్ల కార్యాలయాలు తెరుచుకోలేదు. పార్లమెంట్‌ సచివాలయం, సుప్రీంకోర్టులోకి ఉద్యోగులను వెల్లనీయలేదు. ప్రభుత్వ వెబ్‌సైట్లను డౌన్‌ చేశారు. మరికొన్ని కార్యాలయాల్లో ఉద్యోగులు బిక్కుబిక్కుమంటూ విధులు నిర్వహించారు. పోలీసుల పరిస్థితి మరీ దారుణంగా ఉందని ఆ కథనాలు పేర్కొన్నాయి. ఢాకా సహా.. ప్రధాన నగరాల్లో సింహభాగం పోలీస్ స్టేషన్లను ఆందోళనకారులు తగుల బెట్టారు. చాంద్‌పూర్‌లో ఐదు ఠాణాల్లో లూటీ జరగ్గా.. ఓ ఎస్సై హత్యకు గురయ్యారు. బనియాచౌక్‌లో ఓ పోలీసు అధికారిని చంపి, చెట్టుకు వేళాడదీశారు.


ఆర్థికవేత్త నుంచి.. ప్రభుత్వాధినేతగా

మహమ్మద్‌ యూనస్‌ ప్రస్థానం

బంగ్లాదేశ్‌ తాత్కాలిక ప్రభుత్వాధినేతగా నియమితుడైన మహమ్మద్‌ యూనస్‌ ఆర్థికవేత్తగా సుపరిచితుడు. 2006లో నోబెల్‌ శాంతి పురస్కారం అందుకున్న యూనస్‌ 1940 జూన్‌ 28న తూర్పు బెంగాల్‌(ప్రస్తుతం బంగ్లాదేశ్‌)లోని చిట్టాగాంగ్‌లో జన్మించారు. ఆయన విద్యాభ్యాసమంతా చిట్టాగాంగ్‌లోనే జరిగింది. ఆ తర్వాత ఆయన పలు దేశాల వర్సిటీల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పనిచేశారు. గ్రామీణ బ్యాంకులను స్థాపించి.. మైక్రోక్రెడిట్‌, మైక్రోఫైనాన్స్‌ విధానాలను పరిచయం చేశారు. ఈ అంశంపైనే ఆయనను నోబెల్‌ వరించింది. ఆయనను నోబెల్‌కు ఎంపిక చేసినప్పుడు ఆ పురస్కార కమిటీ బ్యాంకు రుణాలకు అర్హులు కాని పేద, గ్రామీణ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు గ్రామీణ బ్యాంకు ఓ దిక్సూచి వంటిదని వ్యాఖ్యానించింది. ఆర్థిక రంగానికి ఆయన చేసిన సేవకు గాను.. అమెరికా సహా.. పలు దేశాలు యూన్‌సను పలు పురస్కారాలతో గౌరవించాయి. యూనస్‌ 2009లో అమెరికా ప్రెసిడెన్షియల్‌ మెడల్‌ ఆఫ్‌ ఫ్రీడమ్‌ అవార్డు అందుకున్నారు.


ఎవరీ నహీద్‌?

హసీనా రాజీనామా చేసి, భారత్‌ వెళ్లడానికి.. బంగ్లాదేశ్‌లో మధ్యంతర ప్రభుత్వం ఏర్పాటు నిర్ణయాల వెనక.. విద్యార్థి సంఘాల సమన్వయకర్త.. 26 ఏళ్ల నహీద్‌ ఇస్లాం ఉన్నారు. చిన్నగా ప్రారంభమైన రిజర్వేషన్ల ఉద్యమాన్ని.. చినికిచినికి గాలివానగా మార్చడంలో నహీద్‌ కీలక పాత్ర పోషించారు. 1998లో ఢాకాలో జన్మించిన నహీద్‌.. ఢాకా విశ్వవిద్యాలయంలో సోషియాలజీ చదువుతున్నారు. గత నెల పోలీసులు ఇతడిని అరెస్టు చేయడంతో పాపులర్‌ అయ్యారు. పోలీసులు అతన్ని స్పృహ తప్పేలా కొట్టడం.. రోడ్డుపై పారేయడం వంటి వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవ్వడంతో.. అనతికాలంలోనే పాపులర్‌ అయ్యారు.


విద్యార్థుల డిమాండ్లివే!

ప్రభుత్వ పదవీకాలాన్ని 6 సంవత్సరాలకు పెంచాలి. ప్రభుత్వ కాలపరిమితి ముగియడానికి మూడు నెలల ముందే ఎన్నికలు నిర్వహించాలి

ప్రస్తుత ఎన్నికల సంఘాన్ని రద్దు చేసి, కొత్త అధికారులను నియమించాలి. పక్షపాత ధోరణితో వ్యవహరించే ప్రధాన న్యాయమూర్తి, ఇతర న్యాయమూర్తులను తొలగించాలి

హసీనా ప్రభుత్వం వివిధ శాఖల్లో నియమించిన కాంట్రాక్టు నియామకాలను రద్దు చేయాలి

విద్యార్థుల త్యాగానికి గుర్తుగా.. జూలై నెలలో జాతీయ సంతాపదినంగా ప్రకటించాలి. మృతులు, క్షతగాత్రుల కుటుంబాలకు పరిహారాన్ని చెల్లించాలి

గడిచిన 15 ఏళ్లుగా దేశంలో జరిగిన అవినీతిపై విచారణ జరిపించి, కారకులను శిక్షించాలి.


హిందువుల ఆలయాలు, ఇళ్లపై దాడి

బంగ్లాదేశ్‌ వ్యాప్తంగా హిందూ ఆలయాలు, హిందువుల దుకాణాలు, ఇళ్లపై దాడులు, లూటీలు జరిగాయని బంగ్లాదేశ్‌ వార్తాసంస్థలు వెల్లడించాయి. హిందువులతోపాటు.. ముస్లిముల్లో అహ్మదీయ వర్గానికి చెందిన వారిని టార్గెట్‌గా చేసుకున్న ఆందోళనకారులు హత్యలు, లూటీలకు పాల్పడ్డట్లు పేర్కొన్నాయి. దినాజ్‌పూర్‌లోని బోచాగంజ్‌లో హిందువులకు చెందిన 40 దుకాణాలు ధ్వంసమయ్యాయి. ఇస్లామి ఆందోళన్‌ కార్యకర్తలు, ముస్లిం పెద్దలు కూడా హిందూ ఆలయాలను కాపాడేందుకు కర్రలు పట్టుకుని, గస్తీ తిరిగారు. కాగా.. బంగ్లాదేశ్‌లో హిందువులు, మైనారిటీలపై జరుగుతున్న హింసను ఐరోపా సమాఖ్య ఢాకా కార్యాలయం ఖండించింది. మైనారిటీల భద్రతకు చర్యలు తీసుకోవాలని ఎక్స్‌లో కోరింది.

Updated Date - Aug 07 , 2024 | 08:56 AM

Advertising
Advertising
<