చైనా, భారత్ మధ్య నలిగిపోం: శ్రీలంక
ABN, Publish Date - Sep 25 , 2024 | 02:44 AM
చైనా, భారత్ మధ్య నలిగిపోదలుచుకోలేదని శ్రీలంక నూతన అధ్యక్షుడు అనుర కుమార దిశనాయకే అన్నారు.
శ్రీలంక అధ్యక్షుడు దిశనాయకే వ్యాఖ్య
ప్రధానిగా హరిణి అమరసూర్య ప్రమాణం
కొలంబో, సెప్టెంబరు 24: చైనా, భారత్ మధ్య నలిగిపోదలుచుకోలేదని శ్రీలంక నూతన అధ్యక్షుడు అనుర కుమార దిశనాయకే అన్నారు. భౌగోళిక రాజకీయ వైరాల్లోకి శ్రీలంకను లాగకుండా తటస్థ విదేశాంగ విధానం అవలంబిస్తామని ఓ మ్యాగజీన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. తమ నేషనల్ పీపుల్స్ పవర్ (ఎన్‌పీపీ) కూటమి ప్రభుత్వం ఏ అధికార కేంద్రంతోనూ చేతులు కలపదన్నారు. చైనా, భారత్‌లు రెండూ శ్రీలంకకు విలువైన స్నేహితులేనని, ఇరు దేశాలతోనూ సత్సంబంధాలు కొనసాగిస్తామన్నారు. కాగా, శ్రీలంక నూతన ప్రధానిగా హరిణి అమరసూర్య నియమితులయ్యారు.
మంగళవారం ఆమెతో దిసనాయకే ప్రమాణ స్వీకారం చేయించారు. హక్కుల కార్యకర్తగా, యూనివర్సిటీ అధ్యాపకురాలిగా గుర్తింపు పొందిన హరిణి (58).. శ్రీలంక చరిత్రలో మూడో మహిళా ప్రధాని. సిరిమావో బండారు నాయకే (1994-2000) తర్వాత ప్రధాని పదవి చేపట్టిన మహిళా నేత హరిణే. మరో ఇద్దరు ఎన్‌పీపీ నేతలు మంత్రులుగా నియమితులయ్యారు. దీంతో దిశనాయకేతో పాటు మొత్తం నలుగురితో క్యాబినెట్ కొలువుదీరింది. కాగా, అధ్యక్షుడు దిశనాయకే శ్రీలంక పార్లమెంట్‌ని మంగళవారం రద్దు చేశారు. నవంబరు 14న ఎన్నికలు జరుగుతాయని గెజిట్ జారీ చేశారు.
Updated Date - Sep 25 , 2024 | 02:44 AM