USA: చివరి స్వింగ్ రాష్ట్రంలోనూ ట్రంప్ విజయం!
ABN, Publish Date - Nov 10 , 2024 | 09:03 PM
అమెరికాలోని ఆఖరి స్వింగ్ రాష్ట్రం అరిజోనా కూడా డొనాల్డ్ ట్రంప్ హస్తగతమైంది. అక్కడి 11 ఎలక్టోరల్ ఓట్లు కూడా ట్రంప్‌కు చెందడంతో ఆయన ఈ ఎన్నికల్లో మొత్తం 312 ఎలక్టోరల్ ఓట్లు సాధించారు.
ఇంటర్నెట్ డెస్క్: అమెరికాలోని ఆఖరి స్వింగ్ రాష్ట్రం అరిజోనా కూడా డొనాల్డ్ ట్రంప్ హస్తగతమైంది. అక్కడి 11 ఎలక్టోరల్ ఓట్లు కూడా ట్రంప్‌కు చెందడంతో ఆయన ఈ ఎన్నికల్లో మొత్తం 312 ఎలక్టోరల్ ఓట్లు సాధించారు. 2016 నాటి ఎన్నికల కంటే (304 ఓట్లు) ఈసారి మెరుగైన విజయం సాధించారు. అరిజోనాలో విజయంతో అమెరికాలోని ఏడు స్వింగ్ రాష్ట్రాలు ట్రంప్ ఖాతాలో చేరాయి (USA).
4B Movement: అమెరికాలో మరో ఉద్యమం! పురుషులతో శృంగారానికి నో అంటున్న మహిళలు
అమెరికాలోని 50 రాష్ట్రాల్లో సగానికి పైగా ట్రంప్ హస్తగతమైనట్టు ఇప్పటికే తేలింది. గతంలో డెమొక్రటిక్ పార్టీకి మద్దతు పలికిన స్వింగ్ రాష్ట్రాలు జార్జియా, పెన్సిల్వేనియా, మిషిగన్, విస్కాన్సిన్ ఈసారి ట్రంప్ పక్షాన నిలిచాయి. హోరాహోరీగా పోటీ సాగిన నార్త్ కెరొలీనా, నెవాడా కూడా ట్రంప్ హస్తగతమయ్యాయి. ఓ కేసులో ట్రంప్ నేరం రుజువైనా కూడా ఆయన ఈ ఎన్నికల్లో ఘన విజయం సాధించడం అమెరికాలో సంచలనంగా మారింది. ఇదిలా ఉంటే ట్రంప్ ప్రత్యర్థి కమలా హారిస్ మాత్రం 226 ఎలక్టోరల్ ఓట్లు దక్కడంతో అధికారానికి సుదూరాన నిలిచారు. అధ్యక్ష పీఠం అధిరోహించేందుకు అభ్యర్థులు 270 ఎలక్టోరల్ ఓట్ల మేజిక్ మార్కు అవసరం. కాగా, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ బుధవారం డొనాల్డ్ ట్రంప్‌ను తన అధికారిక కార్యాలయం ఓవల్ ఆఫీసులో మర్యాదపూర్వకంగా కలవనున్నారు.
Donald Trump: డొనాల్డ్ ట్రంప్ గెలుపు తర్వాత పక్క దేశాల భయాందోళన.. కారణమిదేనా.
జనవరి 20న అధ్యక్ష ప్రమాణ స్వీకారం ఉన్న నేపథ్యంలో ట్రంప్ తన కేబినెట్ కూర్పు కోసం కసరత్తు చేస్తున్నారు. అగ్రరాజ్య అధ్యక్షుడి అధికారిక నివాసం వైట్ హౌస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా సూసీ వైల్స్‌ను నియమించారు. ఈ కీలక బాధ్యతలు చేపట్టిన తొలి మహిళగా సూసీ నిలిచారు. ఇక ట్రంప్ మంత్రివర్గంలో ఎలాన్ మస్క్‌కు చోటు దక్కే అవకాశం ఉందన్న వ్యాఖ్యలు వినబడుతున్నాయి. ఆయన ప్రభుత్వ ఖర్చుల ఆడిట్ బాధ్యతలు దక్కే అవకాశం కనిస్తోందని స్థానిక మీడియా చెబుతోంది. ఇక విదేశాంగ శాఖ మంత్రిగా రిక్ గ్రెనెల్ బాధ్యతలు చేపడతారని అంచనా.
ఇదిలా ఉంటే రష్యా - ఉక్రెయిన్ యుద్ధానికి ఫుల్ స్టాప్ పెట్టేందుకు ట్రంప్ ఇప్పటికే మాస్టర్ ప్లాన్ సిద్ధం చేశారని సమాచారం. ఇందులో భాగంగా రెండు దేశాల మధ్య 800 కిలోమీటర్ల మేర బఫర్ జోన్ ఏర్పాటు చేసి, గస్తీ కోసం యూరోపియన్ దేశాల సైనిక దళాలు వినియోగిస్తారని తెలుస్తోంది. అమెరికన్ సైనికులను అక్కడికి పంపే ఆలోచనే లేదని ట్రంప్ వర్గంలోని కీలక వ్యక్తి ఒకరు వ్యాఖ్యానించారు.
Read Latest and International News
Updated Date - Nov 10 , 2024 | 09:14 PM