జమ్ము, కశ్మీర్‌లో 59% పోలింగ్
ABN, Publish Date - Sep 19 , 2024 | 06:02 AM
జమ్ము, కశ్మీర్‌లో 2019లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత తొలిసారిగా జరుగుతోన్న అసెంబ్లీ ఎన్నికల్లో తొలి దశ ఎన్నికలు బుధవారం ప్రశాంతంగా ముగిశాయి. 59 శాతం పోలింగ్ నమోదు కావడం విశేషం. జమ్ము,
ప్రశాంతంగా తొలి దశ ఎన్నికలు
శ్రీనగర్/జమ్ము, సెప్టెంబరు 18 : జమ్ము, కశ్మీర్‌లో 2019లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత తొలిసారిగా జరుగుతోన్న అసెంబ్లీ ఎన్నికల్లో తొలి దశ ఎన్నికలు బుధవారం ప్రశాంతంగా ముగిశాయి. 59 శాతం పోలింగ్ నమోదు కావడం విశేషం. జమ్ము, కశ్మీర్‌లో జరిగిన గత ఏడు లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలతో పోల్చితే ఇదే అత్యధిక పోలింగ్ అని జమ్ము, కశ్మీర్ చీఫ్ ఎలక్టొరల్ ఆఫీసర్ పీకే పోలే తెలిపారు. పోస్టల్ బ్యాలెట్, మారుమూల ప్రాంతాల పోలింగ్ వివరాలు కూడా అందితే ఈ పోలింగ్ శాతం మరింత పెరగవచ్చని ఆయన చెప్పారు. బుధవారం ఉదయం ఏడు గంటలకు ప్రారంభమయిన పోలింగ్ రోజంతా స్థిరంగా కొనసాగింది. మహిళలు, పురుషులు, యువత, వృద్ధులు, నడవలేని వారు కూడా రాష్ట్రమంతటా పోలింగ్ బూత్‌ల వద్ద ఓపిగ్గా వేచిఉండడం కనిపించింది. ఈ రాష్ట్రంలోని మొత్తం 90 అసెంబ్లీ సీట్లకు తొలిదశలో 24 సీట్లకు ఎన్నికలు జరిగాయి. వాటిలో 16 కశ్మీర్ లోయలో ఉండగా... 8 జమ్ము ప్రాంతంలో ఉన్నాయి. మొత్తం 23 లక్షల మందికిపైగా ఓటర్లు ఈ ఎన్నికల్లో 219 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చనున్నారు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు భద్రతా దళాలతో విస్తృతంగా బందోబస్తు కల్పించారు. బిజ్‌బెహరా, డీహెచ్ పోరా వంటి ఒకటి రెండు చోట్ల రాజకీయ పార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణలు తప్ప ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరగలేదు. సెప్టెంబరు 25, అక్టోబరు ఒకటవ తేదీన మరో రెండు దశల్లో పోలింగ్ జరగాల్సి ఉంది. అక్టోబరు 8న ఓట్ల లెక్కింపు జరుగుతుంది.
Updated Date - Sep 19 , 2024 | 06:02 AM