ప్రైవేటు ఉద్యోగాల్లో 75% స్థానికులకే!
ABN, Publish Date - Jul 17 , 2024 | 05:52 AM
కర్ణాటకలో ఐటీ సహా ప్రైవేటు సంస్థలు, పరిశ్రమలు, కర్మాగారాల్లో ఇక ఇతర రాష్ట్రాలవారికి ఉద్యోగాలు తగ్గిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి.
సిద్దరామయ్య కేబినెట్ తీర్మానం
మేనేజ్‌మెంట్ జాబుల్లో వారికి 50ు కోటా
నాన్-మేనేజ్‌మెంట్ పోస్టుల్లో 75ు ఇవ్వాల్సిందే
గ్రూపు సీ, డీ ఉద్యోగాలన్నీ కన్నడిగులకే.. రేపు అసెంబ్లీ ముందుకు బిల్లు
ఇతర రాష్ట్రాల వారికి తగ్గనున్న ఉపాధి అవకాశాలు
బెంగళూరు ఐటీ సంస్థల్లో భారీ సంఖ్యలో తెలుగువారు
బెంగళూరు, జూలై 16 (ఆంధ్రజ్యోతి): కర్ణాటకలో ఐటీ సహా ప్రైవేటు సంస్థలు, పరిశ్రమలు, కర్మాగారాల్లో ఇక ఇతర రాష్ట్రాలవారికి ఉద్యోగాలు తగ్గిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. వాటిలో 50 శాతం నుంచి వంద శాతం వరకు స్థానికులకే రిజర్వేషన్ కల్పించాలని ఆ రాష్ట్ర కేబినెట్ ఓ బిల్లును ఆమోదించింది. మేనేజ్‌మెంట్ ఉద్యోగాల్లో 50 శాతం, నాన్-మేనేజ్‌మెంట్ ఉద్యోగాల్లో 75 శాతం స్థానికులకు ఇవ్వాలని అందులో నిర్దేశించారు. గురువారం ఈ బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టనున్నారు. కర్ణాటకలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు చెందిన అనేక మంది ప్రజలు నివసిస్తున్నారు. ముఖ్యంగా బెంగళూరులో ఐటీ సహా పలు ప్రైవేటు సంస్థల్లో పెద్దసంఖ్యలో ఉద్యోగాలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే తమ రాష్ట్రంలోని సంస్థల్లో స్థానికులకే ఉపాధి అవకాశాలివ్వాలని కన్నడ సంఘాలు చాలాకాలంగా డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ప్రైవేటు ఉద్యోగాల్లో స్థానికులకు రిజర్వేషన్ కల్పిస్తూ సీఎం సిద్దరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎవరు స్థానికులో ఈ బిల్లులో నిర్వచించారు. కర్ణాటకలో జన్మించినవారు.. 15 ఏళ్లుగా ఆ రాష్ట్రంలోనే నివసిస్తున్నవారు.. కన్నడ భాషలో మాట్లాడే, చదివే, రాసే నైపుణ్యం ఉండి.. రాష్ట్ర నోడల్ ఏజెన్సీ నిర్వహించే అర్హత పరీక్షలో నెగ్గినవారిని స్థానిక అభ్యర్థిగా పరిగణిస్తారు.
కన్నడం ఓ భాషగా ఉన్న ఎస్‌ఎ్‌ససీ సర్టిఫికెట్‌ను ఉద్యోగార్థులు కలిగి ఉండాలి. లేదంటే ప్రభుత్వ నోడల్ ఏజెన్సీ నిర్వహించే కన్నడ ప్రావీణ్య పరీక్షలో పాసవ్వాలి. అర్హతలున్న స్థానిక అభ్యర్థులు దొరక్కపోతే.. చట్ట నిబంధనల సడలింపునకు ప్రైవేటు పరిశ్రమలు, సంస్థలు ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోవాలి. తగు విచారణ తర్వాత ప్రభుత్వం సముచిత ఉత్తర్వులు జారీచేస్తుంది. అవే ఫైనల్. అర్హతలున్న స్థానికులు లేకపోతే.. ఆయా సంస్థలు సర్కారు సహకారంతో మూడేళ్లలో స్థానిక అభ్యర్థులకు శిక్షణ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలి. నిబంధనలు ఉల్లంఘించిన సంస్థలకు రూ.10 వేల నుంచి రూ.25 వేల వరకు జరిమానా విధిస్తామని బిల్లులో పేర్కొన్నారు. కాగా.. ప్రైవేటు పరిశ్రమల్లోని గ్రూపు సీ, డీ ఉద్యోగాలను వంద శాతం స్థానికులకే ఇవ్వాలని కేబినెట్ భేటీలో తీర్మానించినట్లు సిద్దరామయ్య మంగళవారం ‘ఎక్స్’లో పేర్కొన్నారు. కన్నడిగులు తమ రాష్ట్రంలో సౌకర్యవంతమైన జీవనం సాగించాలని.. మాతృభూమిలో వారికి ఉపాధి దూరం కారాదన్నది తమ ప్రభుత్వ అభిలాష అని తెలిపారు. ‘మాది కన్నడ అనుకూల ప్రభుత్వం. వారి సంక్షేమానికే మా ప్రాధాన్యం’ అని వెల్లడించారు. మరోవైపు.. ఏడో వేతన కమిషన్ సిఫారసులకు అనుగుణంగా ప్రభుత్వ ఉద్యోగులకు వేతనం పెంచుతూ కర్ణాటక కేబినెట్ నిర్ణయం తీసుకుంది. 31 శాతం కరువుభత్యాన్ని మూలవేతనంలో కలపడంతో పాటు 27.5 శాతం ఫిట్‌మెంట్ ఇవ్వాలని కమిషన్ సిఫారసు చేసింది. పెంచిన వేతనాలు ఆగస్టు నుంచి అమలులోకి రానున్నాయి.
Updated Date - Jul 17 , 2024 | 05:52 AM