సైబర్ నేరగాళ్లకు చెక్
ABN, Publish Date - Nov 22 , 2024 | 06:48 AM
డిజిటల్ అరెస్టులంటూ రెచ్చిపోతున్న సైబర్ నేరగాళ్లకు చెక్ పెట్టే క్రమంలో భారత ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంది. ఈ కేటుగాళ్లకు సంబంధించిన 17 వేలకు పైగా వాట్సాప్ ఖాతాలను
17 వేలకు పైగా వాట్సాప్ ఖాతాలు బ్లాక్
డిజిటల్ అరెస్టుల ఫిర్యాదులపై కేంద్రం చర్యలు
న్యూఢిల్లీ: డిజిటల్ అరెస్టులంటూ రెచ్చిపోతున్న సైబర్ నేరగాళ్లకు చెక్ పెట్టే క్రమంలో భారత ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంది. ఈ కేటుగాళ్లకు సంబంధించిన 17 వేలకు పైగా వాట్సాప్ ఖాతాలను హోం మంత్రిత్వ శాఖ బ్లాక్ చేసింది. వీటిలో ఎక్కువగా కంబోడియా, మయన్మార్, లావోస్, థాయ్‌లాండ్‌ల నుంచి ఆన్‌లైన్‌లో ఆర్థిక నేరాలకు పాల్పడే కాల్ సెంటర్స్‌వే ఉన్నాయి. ఈ సైబర్ దొంగలు ఎక్కువగా కంబోడియాలోని చైనీస్ కేసినోలో ఉన్నట్లు బయటపడింది. వీరి బాధితులు ఆన్‌లైన్‌లో చేసిన ఫిర్యాదుల మేరకు హోం శాఖ విచారణ జరిపి నేరగాళ్ల ఆట కట్టించే చర్యల్లో భాగంగా వాట్సాప్ ఖాతాలను స్తంభింపజేసింది. వేలాదిగా వచ్చిన ఆన్‌లైన్ ఫిర్యాదులన్నింటినీ సైబర్ క్రైం కోఆర్డినేషన్ సెంటర్ సమీక్షించి అనుమానిత ఖాతాల జాబితాను రూపొందించింది. దానిని వాట్సా్‌పకు అందించి ఆ ఖాతాలన్నీ బ్లాక్ చేయాల్సిందింగా ఆదేశించింది. అలాగే ఉద్యోగాలు ఇప్పిస్తామని మానవ అక్రమ రవాణా ద్వారా భారతీయులను ఈ నేరాల్లో ఎలా ఇరికించారో కూడా హోం శాఖ విచారణలో బయటపడింది. రోజుకు సగటున సుమారు రూ. 6 కోట్లు సైబర్ నేరగాళ్లు కొట్టేస్తున్నారని, ఈ ఏడాది అక్టోబర్ నెలాఖరు వరకు రూ. 2,140 కోట్లు మోసగాళ్ల చేతుల్లోకి వెళ్లినట్లు హోం మంత్రిత్వ శాఖ సైబర్ వింగ్ గుర్తించింది. డిజిటల్ అరెస్టు నేరాలకు సంబంధించి అక్టోబర్ వరకు 92,334 కేసులు నమోదైనట్లు ఆ వింగ్ పేర్కొంది.
Updated Date - Nov 22 , 2024 | 06:48 AM