క్షిపణుల వర్షం
ABN, Publish Date - Apr 15 , 2024 | 03:44 AM
ప్రపంచంలోనే అతిపెద్ద మిలటరీ శక్తుల్లో 14వ స్థానంలో ఉన్న ఇరాన్ అన్నంత పని చేసింది. ఈ నెల 1న సిరియా రాజధాని డమాస్క్‌సలో ఇజ్రాయెల్ జరిపిన క్షిపణి దాడుల్లో తమ ఆర్మీ కమాండర్, మరో 12
ముందుగా హెచ్చరించినట్లే ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడి
బాలిస్టిక్, క్రూయిజ్ మిసైల్స్, కామికేజ్ సూసైడ్ డ్రోన్ల ప్రయోగం
దీటుగా ఎదుర్కొన్న ఇజ్రాయెల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్
సహకరించిన అమెరికా రక్షణ వ్యవస్థలు
100 శాతం డ్రోన్లు, క్రూయిజ్ క్షిపణుల కూల్చివేత
120 బాలిస్టిక్ క్షిపణుల్లో ఇజ్రాయెల్‌ను తాకింది 17 మాత్రమే
10 ఏళ్ల బాలికకు తీవ్ర గాయాలు.. ఐడీఎఫ్ స్థావరం ధ్వంసం
ప్రతీకారం తప్పదు: ఇజ్రాయెల్.. రక్షణగా ఉంటాం: బైడెన్
అమెరికా పాల్గొంటే ఇరాన్‌కు అండగా ఉంటాం: రష్యా
అమెరికా కల్పించుకుంటే దాడులను తీవ్రం చేస్తామన్న ఇరాన్
ఇరాన్ దాడిని ఖండించిన ఐరాస, పలు దేశాలు
ఆపరేషన్ ముగిసింది.. ప్రతిదాడి చేస్తే విజృంభిస్తాం: ఇరాన్
పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నామన్న భారత్
టెహ్రాన్/టెల్‌అవీవ్, ఏప్రిల్ 14: ప్రపంచంలోనే అతిపెద్ద మిలటరీ శక్తుల్లో 14వ స్థానంలో ఉన్న ఇరాన్ అన్నంత పని చేసింది. ఈ నెల 1న సిరియా రాజధాని డమాస్క్‌సలో ఇజ్రాయెల్ జరిపిన క్షిపణి దాడుల్లో తమ ఆర్మీ కమాండర్, మరో 12 మంది అధికారుల మృతితో ప్రతీకారేచ్ఛతో రగిలిన ఇరాన్.. శనివారం రాత్రి 11 గంటల సమయంలో(భారత కాలమానం ప్రకారం అర్ధరాత్రి దాటాక 1.30 గంటలకు) ఇజ్రాయెల్‌పై బాలిస్టిక్, క్రూయిజ్ క్షిపణులు, సూసైడ్ డ్రోన్లతో విరుచుకుపడింది. గత ఏడాది అక్టోబరు 7న హమా్‌సతో ఇజ్రాయెల్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి లెబనాన్ భూభాగం నుంచి దాడులు చేస్తున్న హిజ్బుల్లా ఉగ్రవాదులు కూడా శనివారం రాత్రి ఇజ్రాయెల్ ఉత్తరాదిపై శతఘ్నులు, క్షిపణులను ప్రయోగించారు. దీంతో పశ్చిమాసియాపై ఒక్కసారిగా యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. ఇరాన్ అధికారిక వార్తా సంస్థ ఐఆర్‌ఎన్‌ఏ మేరకు.. ఇజ్రాయెల్‌పై 185 కామికేజ్ డ్రోన్లు, 120 బాలిస్టిక్ క్షిపణులు, 36 క్రూయిజ్ క్షిపణులను ఇరాన్ ప్రయోగించింది. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సె్‌స(ఐడీఎఫ్) కూడా ఆదివారం తన అధికారిక టెలిగ్రామ్ చానల్‌లో ఈ విషయాన్ని నిర్ధారిస్తూ.. ఇరాన్ దాడిని 99ు అడ్డుకున్నట్లు ప్రకటించింది. తమ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు-- ఐరన్‌డోమ్, యారో డిఫెన్స్ సిస్టమ్ ఇరాన్ దాడులను సమర్థంగా ఎదుర్కొన్నట్లు పేర్కొంది. ‘‘ఇరాన్ ప్రయోగించిన 185 కామికేజ్ డ్రోన్లను 100ు గాల్లోనే కూల్చేశాం. 36 క్రూయిజ్ క్షిపణులను కూడా కూల్చివేశాం. 120 బాలిస్టిక్ క్షిపణుల్లో 103 గాల్లోనే నిర్వీర్యమవ్వగా.. పదిహేడు మాత్రమే ఇజ్రాయెల్ నేలను తాకాయి’’ అని వివరించింది. ఈ ఘటనలో ఐడీఎ్‌ఫకు చెందిన ఓ స్థావరం దెబ్బతిన్నదని, 10 ఏళ్ల ఓ బాలికకు తీవ్ర గాయాలైనట్లు పేర్కొంది.
ఇజ్రాయెల్‌కు అమెరికా, బ్రిటన్ సాయం
దాడి చేస్తామంటూ ఇరాన్ ప్రకటన చేసినప్పటి నుంచి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇజ్రాయెల్‌కు అండగా ఉంటామని, ఉక్కు పిడికిలితో దాడులను అడ్డుకుంటామని ప్రకటిస్తూ వచ్చారు. అమెరికా ఇంటెలిజెన్స్ ఇన్‌పుట్స్‌ను ఎప్పటికప్పుడు ఇజ్రాయెల్‌తో షేర్ చేసుకున్నారు. శనివారం కూడా.. ఏ క్షణాన్నైనా ఇరాన్ దాడులు చేస్తుందంటూ హెచ్చరించారు. శనివారం రాత్రి జరిగిన దాడుల్లోనూ.. పలు బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లను తాము అడ్డుకున్నామని అమెరికా నౌకాదళం స్పష్టం చేసింది. ‘‘ముందు నుంచే మధ్యధరా సముద్రంలో మా యుద్ధ నౌకలను మోహరించాం. ఇరాన్ ప్రయోగించిన 70కి పైగా డ్రోన్లు, మూడు బాలిస్టిక్ క్షిపణులను మా ఇంటర్‌సెప్టర్లు కూల్చివేశాయి’’ అని అమెరికా నౌకాదళం అధికారులు వివరించారు. మరోవైపు బ్రిటన్ కూడా పశ్చిమాసియాలో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థకు వ్యతిరేకంగా మోహరించిన తన యుద్ధ నౌకలను ఇజ్రాయెల్‌కు అండగా తరలించింది. అయితే.. శనివారం రాత్రి జరిగిన దాడిలో ఇంటర్‌సెప్టర్ సాయాన్ని ఇజ్రాయెల్‌కు అందించిందా? లేదా? అన్నదానిపై ఎలాంటి ప్రకటన వెలువడలేదు.
ఐరాస ఆందోళన.. సమర్థించుకున్న ఇరాన్
ఇరాన్ జరిపిన దాడిపై ఐక్య రాజ్య సమితి(ఐరాస) ఆందోళన వ్యక్తం చేసింది. ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రస్ ఈ దాడిని ఖండించారు. ఇరుపక్షాలు సంయమనం పాటించాలని.. పశ్చిమాసియాలో శాంతిని నెలకొల్పాలని కోరారు. ఐరాస జనరల్ అసెంబ్లీ అధ్యక్షుడు డెన్నిస్ ఫ్రాన్సిస్ కూడా ఈ దాడిపై తీవ్రంగా స్పందించారు. ‘‘ఇరాన్ దాడి వల్ల పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. దీని పరిష్కారానికి వివేకవంతంగా ఆలోచించి ముందుకు వెళ్లాలి. శాంతియుత చర్చలే ఈ సమస్యకు పరిష్కారం. ఇరాన్ ప్రభుత్వం మా మాటను గౌరవిస్తుందని ఆశిస్తున్నా. ఈ ఉద్రిక్తత ఇక్కడితో ఆగిపోతుందని భావిస్తున్నా’’ అని ఆయన వ్యాఖ్యానించారు. అన్ని పక్షాలు సంయమనం పాటించాలని కోరారు. అయితే.. ఐరాసలో ఇరాన్ శాశ్వత ప్రతినిధి అమీర్ సయీద్ ఇర్వానీ తమ దాడులను సమర్థించుకున్నారు. ‘‘ఐరాస రాజ్యాంగంలోని 51వ అధికరణ మేరకు మాకు ఆత్మరక్షణ హక్కు ఉంది. కేవలం ఆత్మ రక్షణ కోసమే ఇజ్రాయెల్‌పై దాడి చేశాం. ఇజ్రాయెల్ ఏదైనా దుస్సాహసానికి దిగితే.. మా స్పందన మరింత తీవ్రంగా ఉంటుంది’’ అని ఆయన వ్యాఖ్యానించారు. మరోవైపు ఐరాసలో ఇజ్రాయెల్ శాశ్వత ప్రతినిధి గిలాడ్ ఎర్డాన్ తాజా దాడిపై ఐరాస భద్రతామండలిని ఆశ్రయించారు. ఇజ్రాయెల్‌పై దాడిచేసిన ఐఆర్‌జీసీని ఉగ్రవాద సంస్థగా ప్రకటించాలని ఓ లేఖ రాశారు. దీనికి ప్రతిగా ఇరాన్ కూడా భద్రతామండలికి లేఖ రాసింది.
జీ7 దేశాధినేతలతో భేటీకి బైడెన్ చర్యలు
పశ్చిమాసియాపై యుద్ధమేఘాలు కమ్ముకుంటుండడంతో.. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ జీ7(కెనెడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, బ్రిటన్, అమెరికా) దేశాధినేతలతో భేటీ అయ్యేందుకు సన్నాహాలు చేశారు. ఇరాన్ దాడి జరిగిన తర్వాత ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో ఫోన్‌లో మాట్లాడారు. పశ్చిమాసియాలో శాంతిని నెలకొల్పేందుకు జీ7 భేటీ అత్యవసరమని బైడెన్ భావిస్తున్నట్లు వైట్‌హౌస్ వర్గాలు తెలిపాయి.
భారత్ ఆందోళన
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య శత్రుత్వం పెరుగుతుండడంపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. పరిస్థితిని పరిశీలిస్తున్నామని, ఇరుపక్షాలు శాంతిని నెలకొల్పాలని భారత విదేశాంగ శాఖ కోరింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను తగ్గించాలని.. చర్చలతోనే అది సాధ్యమని ‘ఎక్స్’లో అభిప్రాయపడింది. ఇజ్రాయెల్‌లోని భారతీయులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇజ్రాయెల్‌లోని భారతీయుల కోసం అక్కడి ఎంబసీ హెల్ప్‌లైన్ నంబర్లను(+972-5475207112, +972-543278392) విడుదల చేసింది. మరోవైపు.. హార్ముజ్ జలసంధి సమీపంలో ఇరాన్ స్వాధీనం చేసుకున్న నౌకలోని 17 మంది భారతీయుల విడుదల కోసం అక్కడి అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు విదేశాంగ శాఖ వివరించింది. కాగా.. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో ఇజ్రాయెల్‌కు విమాన సేవలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు ఎయిర్ ఇండియా ప్రకటించింది. విస్తారా, ఇండిగో, ఇతర అంతర్జాతీయ విమానయాన సంస్థలు కూడా ఇరాన్, ఇజ్రాయెల్ గగనతలాల మీదుగా విమాన సేవలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు పేర్కొన్నాయి.
కెవిన్ పీటర్సన్ విమానం దారి మళ్లింపు
ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ ఇరాన్ దాడుల కారణంగా తన విమానం దారి మళ్లిందంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ముంబైలో జరగనున్న ఐపీఎల్ మ్యాచ్‌లో కామెంటరీ ఇవ్వడానికి ఇంగ్లండ్ నుంచి వస్తున్న తన విమానాన్ని ఇరాన్ క్షిపణి దాడుల కారణంగా దారి మళ్లించినట్లు చెప్పారు. ‘‘మా విమానాన్ని రీ-రూట్ చేశారు. పెరిగిన దూరానికి అనుగుణంగా ఇంధనాన్ని నింపుకొన్నాక.. భారత్‌కు మళ్లించారు’’ అని ఆయన వ్యాఖ్యానించారు.
ఈ నెలలోనే ఇజ్రాయెల్ వెళ్లిన 500 మంది భారత కార్మికులు
న్యూఢిల్లీ, ఏప్రిల్ 14: ఇజ్రాయెల్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడితో పశ్చిమాసియాలో ఉద్రిక్త వాతావరణం నేపథ్యంలో.. నిర్మాణ రంగంలో పనుల కోసం ఇజ్రాయెల్ వెళ్లిన భారతీయ కార్మికుల భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తమవుతోంది. కొన్ని నెలలుగా ఇజ్రాయెల్‌లో ఉద్రిక్త పరిస్థితులు ఉన్నా అక్కడ నియామకాలకు భారత ప్రభుత్వం అనుమతి ఇవ్వడాన్ని పలువురు నిపుణులు ప్రశ్నిస్తున్నారు. ఈ నెలలోనే 500 మంది కార్మికులు జాతీయ నైపుణ్య అభివృద్ధి మండలి(ఎన్‌ఎస్‌డీసీ) ద్వారా ఇజ్రాయెల్ వెళ్లారు. మంగళవారం మరో 325 మంది బయలుదేరి వెళ్లాల్సి ఉంది. ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడితో వారి ప్రయాణం ఆగిపోయింది. నియామక ప్రక్రియను కూడా తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు ఎన్‌ఎస్‌డీసీ వర్గాలు తెలిపాయి. గత ఏడాది అక్టోబరు 7న ఇజ్రాయెల్‌పై హమాస్ ఉగ్రదాడి తర్వాత పాలస్తీనాకు చెందిన లక్ష మందికి పైగా అరబ్ ముస్లిం కార్మికులను తొలగించారు. దీంతో కుంటుపడిన నిర్మాణ రంగాన్ని పట్టాలెక్కించేందుకు ఇజ్రాయెల్ భారత్ నుంచి కార్మికులను రప్పించుకుంటోంది.
ఇజ్రాయెల్‌కు మా అండ: బైడెన్
ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడి జరిగిన వెంటనే.. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వరుస భేటీల్లో బిజీ అయ్యారు. అమెరికా అత్యున్నత దర్యాప్తు సంస్థ సీఐఏ, నిఘా సంస్థ, జాతీయ భద్రత తదితర విభాగాల అధికారులతో భేటీ అయ్యారు. ఆ తర్వాత జీ7 దేశాధినేతలతో భేటీకి ఏర్పాట్లు చేశారు. నెతన్యాహుతో ఫోన్‌లో మాట్లాడి, ఎప్పటికప్పుడు పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ‘‘ఇజ్రాయెల్‌కు అండగా ఉంటాం. ఉక్కు పిడికిలితో ఇజ్రాయెల్‌కు రక్షణగా నిలుస్తాం’’ అని వ్యాఖ్యానించారు. ఇరాన్ భీకర దాడులను ఎదుర్కొని, శత్రువును ఓడించడంలో ఇజ్రాయెల్ అద్భుతమైన సామర్థ్యాన్ని ప్రదర్శించిందని కొనియాడారు. ఇరాన్ డ్రోన్లు, క్షిపణులను కూల్చివేయడంలో సాయం చేశామన్నారు. ఇజ్రాయెల్‌కు మద్దతును కొనసాగిస్తామని చెప్పారు.
దాడికి మేమూ సిద్ధం: నెతన్యాహు
ఇరాన్ దాడిపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అత్యవసర క్యాబినెట్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ భేటీలో సింహభాగం మంత్రులు ఇరాన్‌పై ప్రతీకారం తీర్చుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. సమావేశం అనంతరం నెతన్యాహు మీడియాతో మాట్లాడారు. తాము ఆత్మరక్షణ(డిఫెన్స్), దాడి(అఫెన్స్)కు సర్వసన్నద్ధంగా ఉన్నామన్నారు. ‘‘ఆత్మరక్షణ కోసం మేము ప్రత్యేక వ్యవస్థను రూపొందించుకున్నాం. ఆత్మరక్షణకు ఎంతలా సిద్ధంగా ఉన్నామో.. దాడులకు కూడా అంతే సర్వసన్నద్ధంగా ఉన్నాం’’ అని వ్యాఖ్యానించారు. అయితే బైడెన్ చొరవతో నెతన్యాహు ప్రతిదాడి జోలకి వెళ్లకపోవచ్చంటూ ఇజ్రాయెల్ అధికారిక వార్తాసంస్థ యెదియోత్ అహ్రోనోత్(వైనెట్) ఓ కథనాన్ని ప్రసారం చేసింది.
మేం కూడా రంగంలోకి దిగుతాం: పుతిన్
ఇరాన్-ఇజ్రాయెల్ విభేదాలను పరిశీలిస్తున్నామని రష్యా అధ్యక్షుడు పుతిన్ వెల్లడించారు. ఒకవేళ ఇజ్రాయెల్ తరఫున అమెరికా ప్రత్యక్షంగా యుద్ధంలో పాల్గొంటే.. ఇరాన్ తరఫున తాము రంగంలోకి దిగుతామని హెచ్చరించారు. అదే జరిగితే.. రష్యాకు అండగా ఉత్తరకొరియా, చైనా కూడా యుద్ధంలో పాల్గొనే ప్రమాదముందని ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే.. ఈ యుద్ధంలో అమెరికా పాల్గొనబోదని వైట్‌హౌస్ వర్గాలు చెప్పినట్లు ‘రాయిటర్స్’ కథనం ప్రచురించింది.
ఇజ్రాయెల్ ప్రతిస్పందిస్తే మరింత తీవ్రం: ఖమేనీ
ఇజ్రాయెల్ సిరియాలోని తమ అధికారుల భవనంపై దాడిచేసి, 13 మందిని హతమార్చడానికి శిక్షగా ఆ దేశంపై దాడి చేసినట్లు ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ స్పష్టం చేశారు. తమ దాడికి ఇజ్రాయెల్ ప్రతిస్పందించి మరోమారు తప్పుచేస్తే.. పరిస్థితి మరింత తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు.
Updated Date - Apr 15 , 2024 | 03:44 AM