బీజేపీ రాష్ట్రాల్లో ఉచిత కరెంటు ఇస్తారా?
ABN, Publish Date - Oct 07 , 2024 | 03:41 AM
దేశంలో బీజేపీ, దాని మిత్రపక్షాలు అధికారంలో ఉన్న 22 రాష్ట్రాల్లో ఉచిత కరెంటు ఇస్తారా అని ప్రధాని మోదీకి ఆప్ అధినేత, మాజీ సీఎం కేజ్రీవాల్ సవాల్ విసిరారు.
ఇస్తే మీ తరఫున ప్రచారం చేస్తా
ప్రధాని మోదీకి కేజ్రీవాల్ సవాల్
న్యూఢిల్లీ, అక్టోబరు 6: దేశంలో బీజేపీ, దాని మిత్రపక్షాలు అధికారంలో ఉన్న 22 రాష్ట్రాల్లో ఉచిత కరెంటు ఇస్తారా అని ప్రధాని మోదీకి ఆప్ అధినేత, మాజీ సీఎం కేజ్రీవాల్ సవాల్ విసిరారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఆయా రాష్ట్రాల్లో ఉచితంగా కరెంటు ఇస్తే బీజేపీ తరఫున తాను ఎన్నికల ప్రచారం చేస్తానని ప్రకటించారు. ఫిబ్రవరిలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాల్సి ఉందని.. దమ్ముంటే మహారాష్ట్ర, జార్ఖండ్‌లతో పాటే ఢిల్లీకీ నవంబరులో ఎన్నికలు జరపాలని మరో సవాల్ విసిరారు. ఆదివారం ఆయన ఢిల్లీలో నిర్వహించిన ‘జనతా కీ అదాలత్’ ర్యాలీలో ప్రసంగించారు. తన చేతిలో ఆరు స్వీట్ల ప్యాకెట్ పట్టుకున్నారు.
ఈ ఆరూ ఢిల్లీ ప్రభుత్వం అందిస్తున్న ఉచిత పథకాలు.. ఉచిత విద్యుత్, ఉచిత నీరు, బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, వృద్ధులకు ఉచిత యాత్ర, ఉచిత ఆరోగ్యం, ఉచిత విద్య. తన చేతిలో ఉన్నటువంటి ప్యాకెట్లే ప్రజలకు పంచుతామని.. వాటిని వారు ప్రసాదంగా స్వీకరించాలని పిలుపిచ్చారు. పొరపాటున బీజేపీకి ఓటేస్తే ఈ ఉచిత ప్రయోజనాలు ఆగిపోతాయని హెచ్చరించారు. బీజేపీ అధికారంలోకి వస్తే ఢిల్లీ రవాణా సంస్థ, ప్రభుత్వ స్కూళ్లు, ఆస్పత్రులను ప్రైవేటుకు అప్పగిస్తారని అన్నారు. రాష్ట్రాల్లో బీజేపీ ‘డబుల్ ఇంజన్’ ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఆరోపించారు. ‘డబుల్ ఇంజన్ ప్రభుత్వాలంటే.. రెట్టింపు దోపిడీ, రెట్టింపు అవినీతి.. ద్రవ్యోల్బణం, నిరుద్యోగమే’ అని కేజ్రీవాల్ అన్నారు. తాను జైల్లో ఉన్నప్పుడు ఇన్సులిన్ ఆపేశారని.. కిడ్నీలు దెబ్బతిని తాను మరణించేవాడినని అన్నారు.
Updated Date - Oct 07 , 2024 | 03:41 AM