అదానీని అరెస్టు చేయాలి!
ABN, Publish Date - Nov 22 , 2024 | 06:55 AM
అవినీతి ఆరోపణలపై అమెరికాలో కేసు నమోదైన ఆదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ ఆదానీని తక్షణమే అరెస్ట్ చేయాలని కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష
మేం చెబుతున్నది నిజమని రుజువైంది
సీఎంలనే అరెస్టు చేస్తున్నారు..వేల కోట్ల ఆరోపణలున్న అదానీ స్వేచ్ఛగా తిరుగుతారా?
మోదీ అదానీకి రక్షణ కల్పిస్తున్నారు
జేపీసీ వేయాల్సిందే:రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి): అవినీతి ఆరోపణలపై అమెరికాలో కేసు నమోదైన ఆదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ ఆదానీని తక్షణమే అరెస్ట్ చేయాలని కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. అదానీని రక్షిస్తున్న సెబీ చెయిర్ పర్సన్ మాధబి పురీ బుచ్‌ను ఆ పదవి నుంచి తప్పించాలన్నారు. భారతదేశంలో విద్యుత్ ప్రాజెక్టులను దక్కించుకోవటానికి పలు రాష్ట్రాల్లో అధికారులకు అదానీ రూ.2,238 కోట్ల లంచాలు ఇచ్చారంటూ అమెరికాలో కేసు నమోదైన నేపథ్యంలో.. ఢిల్లీలో పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌తో కలిసి రాహుల్ మీడియాతో మాట్లాడారు. అదానీ గురించి తాము ఇన్నాళ్లుగా చెబుతున్నది నిజమని అమెరికా అధికారుల ఆరోపణలు నిరూపించాయన్నారు. అదానీ భారత్‌లోనేగాక అమెరికాలోనూ చట్టాలను ఉల్లంఘించినట్లు స్పష్టమవుతోందని, అలాంటి వ్యక్తి బయట స్వేచ్ఛగా ఎలా తిరగగలుగుతున్నారో ఆశ్చర్యంగా ఉందన్నారు. స్వలమైన ఆరోపణలపై ఏకంగా ముఖ్యమంత్రులనే అరెస్టు చేస్తున్నప్పుడు.. రూ.2,200 కోట్ల అవినీతి ఆరోపణలు ఉన్న అదానీ స్వేచ్ఛగా ఎలా తిరుగుతున్నారని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ‘ఏక్ హై తో సేఫ్ హై’ అంటూ ఇటీవలి మహారాష్ట్ర ఎన్నికల్లో మోదీ చెప్పిన నినాదాన్ని ప్రస్తావిస్తూ.. అదానీ, మోదీ కలిసి ఉన్నంతకాలం వారు భారత్‌లో సేఫ్‌గానే ఉంటారని ఎద్దేవా చేశారు. సోమవారం నుంచి ప్రారంభమవుతున్న పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో అదానీ అంశాన్ని ప్రతిపక్షాలు కలిసికట్టుగా లేవనెత్తుతాయని తెలిపారు. అదానీ అక్రమ లావాదేవీలపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)ని ఏర్పాటు చేయాలన్న విపక్షాల డిమాండ్‌ను రాహుల్ పునరుద్ఘాటించారు. ప్రధాని మోదీ అదానీని రక్షిస్తున్నారని, అందువల్లే రూ.2,000 కోట్ల అవినీతి కుంభకోణంలో ఉన్నప్పటికీ అదానీని అరెస్టు చేయబోరని, కనీసం దర్యాప్తు కూడా జరపరని రాహుల్ చెప్పారు. అయితే, ఈ విషయాన్ని తాము వదిలేయబోమని తేల్చి చెప్పారు.
విశ్వసనీయత కోల్పోయిన ప్రధాని
అదానీ మీద మీరు ఎన్ని ఆరోపణలు చేసినా అతడికి వ్యతిరేకంగా ప్రభుత్వం వైపు నుంచి ఏమీ జరగటం లేదు కదా అన్న విలేకర్ల ప్రశ్నకు రాహుల్ స్పందిస్తూ.. ‘మేం లేవనెత్తుతున్న అంశాల వల్లనే ప్రధానమంత్రి తన విశ్వసనీయతను పూర్తిగా కోల్పోయారు. అదానీ, మోదీ ఒకటేనని యావత్ దేశానికి తెలిసింది. దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తాం. ఇది రాజకీయ-ఆర్థిక-ప్రభుత్వ యంత్రాంగంతో కూడిన నెట్‌వర్క్. ఈ విషవలయం ఇప్పుడు యావత్ దేశాన్ని, దేశ రాజకీయ రంగాన్ని చుట్టుముట్టింది. దేశాన్ని గుప్పిట్లోకి తీసుకున్న అదానీ అన్నింటినీ నియంత్రిస్తున్నారు. ఈ నెట్‌వర్క్‌లో ఉన్న ప్రతి ఒక్కరినీ బయటకీడుస్తాం. దీనికి మొట్టమొదటి ఉదాహరణ.. మాధవి బుచ్. మేం నింపాదిగా పని చేస్తూనే చివరికి ఈ నెట్‌వర్క్‌ను బద్దలు కొడతాం’ అని స్పష్టం చేశారు. అవినీతికి పాల్పడిన వారెవరైనా వారికి జైలుకు పంపాల్సిందేనన్నారు. అయితే, నిబంధనలకు అనుగుణంగా అదానీ పని చేస్తే తమకు ఎలాంటి సమస్య లేదని రాహుల్ తెలిపారు.
అంతర్జాతీయంగా దేశానికి అప్రతిష్ఠ: ఖర్గే
అదానీ గ్రూపుల పనితీరు, విదేశాల్లో వాటి పెట్టుబడులు, దేశంలో వివిధ సంస్థల ప్రతిష్ఠ మసకబారటం తదితర అంశాలపై సమగ్ర జేపీసీ దర్యాప్తు తక్షణావసరమని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలిపారు. ఎక్స్‌లో ఈ మేరకు ఒక పోస్ట్ పెట్టారు. భారతదేశానికి చెందిన ఒక ప్రముఖ వ్యాపారవేత్తపై విదేశాల్లో అభియోగాలు రావటం అంతర్జాతీయంగా దేశ ప్రతిష్ఠను దెబ్బ తీస్తుందన్నారు. ‘అవినీతి అధికారులు-రాజకీయ నేతలు- ఆశ్రిత పెట్టుబడిదారుల’తో మోదీ-అదానీ సృష్టించిన విష వలయం వల్ల దేశంలోని కోట్లాదిమంది పేద, మధ్యతరగతి ప్రజలు, చిన్న, మధ్యస్థాయి పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు, స్టార్ట్‌పలు, మదుపరులు తీవ్రంగా నష్టపోతున్నారని ఖర్గే ఆవేదన వ్యక్తం చేశారు.
సీబీఐ కేసు నమోదు చేయాలి: సీపీఎం
ప్రభుత్వ అధికారులకు లంచాలు ఇవ్వటం అన్నది అవినీతి నిరోధక చట్టం కిందికి వస్తుందని, అది సీబీఐ పరిధిలో ఉంటుందని.. కాబట్టి, అదానీ మీద తక్షణం సీబీఐ కేసు నమోదు చేయాలని సీపీఎం డిమాండ్ చేసింది. అదానీ అవినీతి అమెరికాలో రట్టు కావటం సిగ్గు చేటని పేర్కొంది. అదానీ మీద వచ్చిన ఆరోపణల్ని కేంద్రప్రభుత్వం సీరియ్‌సగా తీసుకొని, దర్యాప్తు జరిపించాలని నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా డిమాండ్ చేశారు. అదానీ వ్యవహారం మీద ప్రధాని మోదీ సవివరమైన ప్రకటన జారీ చేయాలని తృణమూల్ కాంగ్రెస్ డిమాండ్ చేసింది.
Updated Date - Nov 22 , 2024 | 06:55 AM