Mallikarjuna Kharge : అయోధ్యపై బుల్డోజర్ అబద్ధం
ABN, Publish Date - May 23 , 2024 | 06:06 AM
ఇండియా కూటమి అధికారంలోకి వస్తే అయోధ్యలోని రామ మందిరంపైకి బుల్డోజర్‌ను పంపిస్తుందన్న ప్రధాని మోదీ వ్యాఖ్యలు పచ్చి అబద్ధాలని కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే అన్నారు. ఈ దేశాన్ని కాంగ్రెస్ పార్టీ 55 ఏళ్లు పాలించిందని.. ఏనాడూ ఏ ఒక్కరి మంగళసూత్రాన్నీ లాగేసుకోలేదని ఖర్గే పీటీఐ ఇంటర్వ్యూలో
55 ఏళ్లు పాలించినా ఏ ఒక్కరి మంగళసూత్రం మేం లాక్కోలేదు
ప్రధాని మోదీవి పచ్చి అబద్ధాలు
ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే
న్యూఢిల్లీ మే 22: ఇండియా కూటమి అధికారంలోకి వస్తే అయోధ్యలోని రామ మందిరంపైకి బుల్డోజర్‌ను పంపిస్తుందన్న ప్రధాని మోదీ వ్యాఖ్యలు పచ్చి అబద్ధాలని కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే అన్నారు. ఈ దేశాన్ని కాంగ్రెస్ పార్టీ 55 ఏళ్లు పాలించిందని.. ఏనాడూ ఏ ఒక్కరి మంగళసూత్రాన్నీ లాగేసుకోలేదని ఖర్గే పీటీఐ ఇంటర్వ్యూలో అన్నారు. ఎవరి విశ్వాసాలకూ తాము అడ్డు చెప్పలేదన్నారు. ఇవన్నీ తెలిసి కూడా ప్రధాని మోదీ పచ్చి అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. ‘‘మా పార్టీ నేతలు ఎన్నడూ ఇంత బరితెగించి మాట్లాడలేదు’’ అని ఖర్గే అన్నారు. పేదలు ఏ మతంలో ఉన్నా వారికి సాయం చేయడం ‘బుజ్జగింపు’ కాబోదని చెప్పారు. బీజేపీ, మోదీలు ప్రజల మధ్య విభజన సృష్టించి ఓట్లు కొల్లగొట్టాలని చూస్తున్నాయని, ఓట్ల కోసమే వారు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. యూపీఏ హయాంలో తీసుకువచ్చిన పథకాలతో పేదలకు తమ పార్టీ మేలు చేసిందని, కానీ, దీనిపై కూడా బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తోందని దుయ్యబట్టారు. గతంలో తమ ప్రభుత్వం తీసుకువచ్చిన ఉపాధి హామీ పథకం సహా అనేక పథకాలను తప్పుబట్టిన బీజేపీ.. ఇప్పుడు వాటిని తన ఘనతగా ప్రచారం చేసుకుంటోందని విమర్శించారు. ‘‘మేం ఏం చేసినా.. దానిని బుజ్జగింపుగా బీజేపీ ప్రచారం చేస్తోంది. కానీ, నా ఉద్దేశంలో బీజేపీనే బుజ్జగింపు రాజకీయాలు చేస్తోంది’’ అని అన్నారు. తమిళనాడు మాదిరిగా 69ు రిజర్వేషన్లు పెంచాలని భావిస్తున్నట్టు తెలిపారు. ఇవి పేదలకేనని. దీనిని కూడా బీజేపీ వ్యతిరేక కోణంలో ప్రచారం చేస్తోందన్నారు.
అందుకే కులగణన
కులగణనను ఖర్గే సమర్థించారు. గతంలో నిరాదరణకు గురైన కులాలకు ప్రాధాన్యం ఇవ్వాలనే ఉద్దేశంతోనే కులగణన చేపట్టాలని నిర్ణయించినట్టు తెలిపారు. ఎవరి హక్కులనూ కాలరాయబోమని స్పష్టం చేశారు. కానీ, బీజేపీ మాత్రం ప్రతి విషయాన్నీ వక్రీకరించే పనిలో ఉందన్నారు. భూసంస్కరణలు తెచ్చినప్పుడు, బ్యాంకులను జాతీయం చేసినప్పుడు కూడా యాగీ చేసిందని దుయ్యబట్టారు. బీజేపీ నేతలకు ఫ్యూడల్ మనస్తత్వం ఉందన్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలకు తాము కట్టుబడి ఉంటామని, కర్ణాటక, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్‌లలో చేసి చూపుతున్నామని ఖర్గే చెప్పారు. పేదలకు తాము రూ.లక్ష ఇస్తామని చెబుతున్నామని.. ఇది వారి ఆర్థిక స్వావలంబనను పెంచుతుందన్నారు. ధనిక వర్గాలకు రూ.16 లక్షల కోట్ల రుణాలను మాఫీ చేసిన బీజేపీ.. ప్రజలకు రూ.లక్ష ఎందుకు ఇవ్వకూడదని ప్రశ్నించారు. ‘‘తాను లేకపోతే.. అంతా నాశనం అయిపోతుందని మోదీ అంటున్నారు. కానీ, ఎన్డీయే హయాంలో ఏం జరిగింది? దేశంపై రూ.155 లక్షల కోట్ల అప్పుల భారం పడింది. కాంగ్రెస్ హయాంలో ఈ అప్పు రూ.55 లక్షల కోట్లేనన్న విషయాన్ని వారు మరిచిపోతున్నారు. వారు చేసిన తప్పులు మరిచిపోతూ.. మాపై నిందలు మోపుతున్నారు’’ అని ఖర్గే వ్యాఖ్యానించారు. మరోవైపు, రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ కంకణం కట్టుకొందని ప్రియాంకగాంధీ ఆరోపించారు. ఝార్ఖండ్‌లోని గొడ్డాలో ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
‘అగ్నివీర్’ను చెత్తబుట్టలో పడేస్తాం : రాహుల్ గాంధీ
మహేంద్రగఢ్(హరియాణా) మే 22: ఇండియా కూటమి అధికారంలోకి వస్తే అగ్నివీర్ పథకాన్ని పూర్తిగా రద్దుచేసి చెత్తబుట్టలో పడేస్తామని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ అన్నారు. బుధవారం హరియాణాలో ఎన్నికల సభలో ఆయన ప్రసంగించారు. ‘భారత జవాన్లను ప్రధాని మోదీ కూలీలుగా మార్చారు. ఇది ఆర్మీ పథకం కాదు... మోదీ పథకం. దీన్ని పీఎంవో రూపొందించింది’ అని ఆయన పేర్కొన్నారు. ‘‘22మంది అగ్ర పారిశ్రామికవేత్తలకు రూ.16లక్షల కోట్ల రుణాలను మాఫీ చేసిన మోదీ ప్రభుత్వం... రైతుల రుణాలను మాత్రం మాఫీ చేయబోమని బహిరంగంగానే చెబుతోంది. రైతుల రక్షణ కోసం, వారికి తగిన పరిహారం దక్కేవిధంగా మేం తీసుకొచ్చిన భూ సేకరణ బిల్లును రద్దు చేశారు’’ అని రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జూన్ 4న తాము అధికారంలోకి రాగానే రైతుల రుణాలు మాఫీ చేస్తామని, దీనికి సంబంధించి కర్జా మాఫీ (రుణ మాఫీ) కమిషన్‌ను తీసుకొస్తామని రాహుల్ హామీ ఇచ్చారు.
Updated Date - May 23 , 2024 | 06:06 AM